Liquor: మద్యం ఒక్క చుక్క తీసుకున్నా.. ఆరోగ్యానికి హానికరమే

ఒక్క చుక్క మద్యం తాగినా ఆరోగ్యానికి హానికరమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తేల్చి చెప్పింది. ఎంత మోతాదులో దాన్ని తీసుకున్నా అది ఆరోగ్యానికి ప్రమాదకరమేనని, మద్యం క్యాన్సర్‌కు దారి తీస్తుందని హెచ్చరించింది.

Updated : 12 Jan 2023 08:07 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

దిల్లీ: ఒక్క చుక్క మద్యం తాగినా ఆరోగ్యానికి హానికరమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తేల్చి చెప్పింది. ఎంత మోతాదులో దాన్ని తీసుకున్నా అది ఆరోగ్యానికి ప్రమాదకరమేనని, మద్యం క్యాన్సర్‌కు దారి తీస్తుందని హెచ్చరించింది. అందుకు సంబంధించిన వివరాలను డబ్ల్యూహెచ్‌వో ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించింది. మద్యపానం మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌తో పాటు పేగు, కాలేయ, అన్నవాహిక తదితర ఏడు రకాల క్యాన్సర్లకు కారణభూతమవుతుందని గతంలో ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌(ఐఏఆర్‌సీ) వెల్లడించింది. ధర, నాణ్యతతో సంబంధం లేకుండా కొంత మొత్తంలో మద్యం తాగినా.. అది జీవక్రియ వ్యవస్థపై ప్రభావం చూపి శరీరాన్ని విచ్ఛిన్నం చేస్తూ క్యాన్సరును క్రమంగా పెంచుతుందని పేర్కొంది. క్యాన్సర్‌ కారక మరణాలు అధికంగా ఉన్న ఐరోపా ప్రాంతంలో పరిశీలించినప్పుడు.. ప్రతిరోజూ 20 గ్రాముల కంటే తక్కువ మోతాదులో స్వచ్ఛమైన మద్యాన్ని తీసుకున్నవారిలో (2017వ సంవత్సరంలో) 23,000 కొత్త క్యాన్సర్‌ కేసులు వెలుగుచూశాయని, అందులో 50 శాతం మహిళల రొమ్ము క్యాన్సర్‌ కేసులు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదిక స్పష్టంచేసింది. ‘హృదయ సంబంధిత, టైప్‌ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్థులకు మద్యం మేలు చేస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, దాన్ని అధికంగా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతాయని నమ్మడానికి మాత్రం ఆధారాలు ఉన్నాయి’ అని పేర్కొంది. ఐరోపా ప్రాంతంలో మద్యం అధికంగా తాగుతున్న వారిలో 20 కోట్ల మంది మద్యపాన కారక క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అధ్యయనం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని