బ్యాంకు దోచుకొని.. ప్లాస్టిక్‌ సర్జరీతో పరారీ

బ్యాంకులో చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓ మహిళా ఉద్యోగిని ప్లాస్టిక్‌ సర్జరీతో ముఖాన్నే మార్చేసుకుంది. ఆ నేరాన్ని దాచిపెట్టి 25 ఏళ్ల పాటు కొత్త జీవితాన్ని గడిపింది.

Updated : 24 Jan 2023 09:11 IST

25 ఏళ్ల తర్వాత పోలీసులకు  చిక్కిన మహిళ

బీజింగ్‌: బ్యాంకులో చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓ మహిళా ఉద్యోగిని ప్లాస్టిక్‌ సర్జరీతో ముఖాన్నే మార్చేసుకుంది. ఆ నేరాన్ని దాచిపెట్టి 25 ఏళ్ల పాటు కొత్త జీవితాన్ని గడిపింది. చివరకు పోలీసులకు చిక్కింది. చైనాలో ఈ ఘటన వెలుగుచూసింది. ఆ మహిళ పేరు చెన్‌ వైల్‌. 1997లో ఆమె యెకింగ్‌లోని చైనా కన్‌స్ట్రక్షన్‌ బ్యాంకులో క్లర్క్‌గా విధులు నిర్వర్తించేది. ఆ సమయంలో ఒకరోజు బ్యాంకింగ్‌ వ్యవస్థలోని ఒక లోపాన్ని గుర్తించింది.

బ్యాంకులోని నగదును తన ఖాతాలోకి సులభంగా మళ్లించుకునే అవకాశం ఉందని గ్రహించింది. ఆ ప్రకారం తన ఖాతాలోకి రూ.6.8 కోట్లను జమ చేసుకుంది. అనంతరం అందులో నుంచి రూ.4.7 కోట్ల మొత్తాన్ని డ్రా చేసుకుంది. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి ప్లాస్టిక్‌ సర్జరీతో తన ముఖ రూపురేఖలను మార్చుకుంది. పుట్టింటికి వెళ్లి, వారి కోసం కొంత డబ్బును అక్కడ దాచింది. వారు దానిని డ్రా చేసుకునే విధంగా ఖాతా పుస్తకాలను అక్కడ పెట్టింది.

ఆమె ద్వారా ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇది సరికాదని వారించారు. వారు కొంత సొమ్మును బ్యాంకుకు తిరిగి ఇచ్చేశారు. ఆమె మాత్రం వారి మాట వినకుండా.. వేరే రాష్ట్రానికి వెళ్లిపోయింది. అక్కడ పేరు మార్చుకొని, మరో పెళ్లి చేసుకుంది. ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. వ్యాపారవేత్తగానూ ఎదిగింది. ఆ దొంగతనానికి పాల్పడకముందే ఆమెకు వివాహం కావడం గమనార్హం. ఆమెను గుర్తించేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. 1997 నుంచి వారు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. చివరకు ఇటీవల ఆమె పోలీసులకు చిక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని