సంక్షిప్త వార్తలు (3)

కౌమార ప్రాయంలో, అంటే 15-19 ఏళ్ల మధ్య వయసులో రోజుకు కనీసం ఏడు గంటలసేపు చక్కగా నిద్రపోనివారు పెరిగి పెద్దయ్యాక మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ (ఎంఎస్‌) వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని స్వీడన్‌లో జరిగిన పరిశోధనలు హెచ్చరించాయి.

Updated : 25 Jan 2023 05:11 IST

కౌమారంలో నిద్రతగ్గితే పెద్దయ్యాక మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌!

లండన్‌: కౌమార ప్రాయంలో, అంటే 15-19 ఏళ్ల మధ్య వయసులో రోజుకు కనీసం ఏడు గంటలసేపు చక్కగా నిద్రపోనివారు పెరిగి పెద్దయ్యాక మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ (ఎంఎస్‌) వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని స్వీడన్‌లో జరిగిన పరిశోధనలు హెచ్చరించాయి. ఏడు గంటల లోపు నిద్రను స్వల్ప నిద్రగా వర్గీకరించారు. 7-9 గంటల నిద్రను మంచి నిద్రగా, 10 గంటలు, అంతకుమించిన నిద్రను సుదీర్ఘమైనదిగా నిర్వచించారు. సెలవు దినాల్లో, వారాంతంలో సుదీర్ఘ నిద్ర ఎంఎస్‌కు దారితీయదు. కనీసం ఏడు గంటలసేపైనా నిదురించకపోతే మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ వ్యాధికి దారితీయవచ్చునని తేల్చారు. సరిగ్గా నిద్రపట్టకపోయినా సమస్యే. రక్తనాళాలు గట్టిపడే ఈ వ్యాధి మెదడు, వెన్నెముక, కళ్ల నరాలను దెబ్బతీస్తుంది. చిన్న వయసులో షిఫ్టులవారీగా పనిచేయడమూ ఎంఎస్‌కు దారితీయవచ్చు.


కలుషిత మందుల విషయంలో.. డబ్ల్యూహెచ్‌వో అత్యవసర హెచ్చరికలు

జెనీవా: కలుషిత మందులను గుర్తించి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. గత నాలుగు నెలల్లో జరిగిన వివిధ ఘటనల్లో.. చిన్నారులకు ఇచ్చే దగ్గు సిరప్‌లలో డైఇథిలిన్‌ గ్లైకాల్‌, ఇథిలిన్‌ గ్లైకాల్‌ అధిక మోతాదులో ఉన్నట్లు గుర్తించామని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కేవలం మూడు దేశాల్లోనే ఐదేళ్లలోపు ఉన్న 300 మంది చిన్నారులు ఈ మందుల ప్రభావానికి గురయ్యారని వెల్లడించింది.


మైక్‌పెన్స్‌ నివాసంలో రహస్య పత్రాలు లభ్యం

వాషింగ్టన్‌: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ నివాసంలో పరిమిత సంఖ్యలో రహస్యపత్రాలు వెలుగు చూశాయి. వీటిని జాతీయ ప్రాచీనపత్ర భాండాగారానికి అందజేసినట్లు పెన్స్‌ తరఫు న్యాయవాది మంగళవారం తెలిపారు. ఇటీవలి కాలంలో ఈ పత్రాలు కనిపించాయనీ, ఇవి ఇంట్లో ఉన్న విషయం పెన్స్‌కు తెలియదని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నివాసంలో ఇటీవల కొన్ని రహస్య పత్రాలు లభ్యమైన విషయం తెలిసిందే.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని