సంక్షిప్త వార్తలు(9)

ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిలీ దళాలు జరిపిన దాడుల్లో 10 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా అధికారవర్గాలు తెలిపాయి.

Updated : 27 Jan 2023 06:40 IST

పట్టపగలు ఇజ్రాయెల్‌ కాల్పులు.. 10 మంది పాలస్తీనా పౌరుల మృతి

వెస్ట్‌బ్యాంక్‌: ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిలీ దళాలు జరిపిన దాడుల్లో 10 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా అధికారవర్గాలు తెలిపాయి. ఈ దాడిలో అనేకమంది గాయపడ్డారని వెల్లడించాయి. వెస్ట్‌బ్యాంక్‌లో మిలిటెంట్లకు బలమైన స్థావరమైన జెనిన్‌ శరణార్థుల శిబిరంపై పట్టపగలు ఈ దాడి జరిగినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. పాలస్తీనియన్‌ ఇస్లామిక్‌ జిహాద్‌ గ్రూపు దాడులు జరిపేందుకు ప్రయత్నిస్తోందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టినప్పుడు ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించాయని, దీంతో మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని మిలటరీ దాడులు చేసిందని ఇజ్రాయెల్‌ వివరించింది. గత రెండు దశాబ్దాల్లో ఇక్కడ ఒకే ఘటనలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. తాజా ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.


ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులను ఖండించిన భారత్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో దేవాలయాలపై దాడులు చేస్తూ వాటిపై భారత వ్యతిరేక నినాదాలను రాస్తున్న ఘటనలను భారత్‌ గురువారం తీవ్రంగా ఖండించింది. గడిచిన నెల రోజుల్లో మెల్‌బోర్న్‌, కేరమ్‌ డాన్స్‌ నగరాల్లోని మూడు ఆలయాలపై ఈ తరహా దాడులు జరిగాయి. భారత వ్యతిరేక ఉగ్రవాదులను కీర్తిస్తూ రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు జరగడం తీవ్ర ఆందోళనకర అంశమని కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్‌ తన ప్రకటనలో ఘాటుగా స్పందించింది. ఉగ్రవాద సంస్థ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే)తో పాటు ఇతర సంస్థల అండదండలున్న ఖలిస్థానీ అనుకూలురు ఆస్ట్రేలియాలో తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారని పేర్కొంది. వచ్చే వారం మెల్‌బోర్న్‌, సిడ్నీలలో ఎస్‌ఎఫ్‌జే తలపెట్టిన రెఫరెండంపైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడి భారతీయుల భద్రత, వారి ఆస్తుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.


ఉ. కొరియాపై నిఘాకు జపాన్‌ ఉపగ్రహం

టోక్యో: ఉత్తర కొరియాలోని సైనిక స్థావరాల్లో కదలికలను గమనించడంతోపాటు ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడానికి జపాన్‌ గురువారం ఓ నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. తూర్పు ఆసియాలో పెరుగుతున్న ముప్పు దృష్ట్యా జపాన్‌ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. అందులో భాగంగానే మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ తయారుచేసిన హెచ్‌2ఏ రాకెట్‌ ద్వారా ఐజీఎస్‌-రాడార్‌ 7 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది.


మునిగిన చైనా నౌక.. 8మంది మృతి

బీజింగ్‌: జపాన్‌, దక్షిణ కొరియా సముద్ర జలాల్లో చైనా కార్గో నౌక మునిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు గురువారం చైనా అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ఆరుగురు చైనీయులేనని వెల్లడించారు. నౌకలో మొత్తం 22 మంది సిబ్బంది ఉండగా.. అందులో 14 మంది చైనీయులు, 8 మంది మయన్మార్‌కి చెందిన వారు ఉన్నారు.


ఇమ్రాన్‌ను అరెస్టు చేయనున్న పాక్‌ ప్రభుత్వం?

లాహోర్‌: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో మద్దతుదారులు గురువారం పెద్ద సంఖ్యలో లాహోర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇమ్రాన్‌పై హత్యాయత్నం జరిగిన అనంతరం ఆయనకు కేటాయించిన అదనపు భద్రతను పంజాబ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం మంగళవారం తొలగించింది. ఇమ్రాన్‌ ఇంటి వద్ద ఉన్న పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) కార్యకర్తలు ఇమ్రాన్‌కు భద్రత కల్పించడమే కాకుండా ప్రభుత్వం అరెస్టు చేసినా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నాయకురాలు ఒకరు వెల్లడించారు. ఆహారం ద్వారా ఇమ్రాన్‌పై విషప్రయోగం జరిగే అవకాశమున్నట్లు ఆయనను హెచ్చరించానని మాజీ మంత్రి షేక్‌ రషీద్‌ మీడియాకు తెలిపారు. అయితే ఇమ్రాన్‌ను అరెస్టు చేసే ఆలోచన లేదని రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ స్పష్టం చేశారు.


చైనా దుందుడుకు విధానాలతోనే క్వాడ్‌లోకి భారత్‌: మైక్‌ పాంపియో

వాషింగ్టన్‌: చైనా దుందుడుకు విధానాల కారణంగానే స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించే భారత్‌.. తన వైఖరిని మార్చుకుని క్వాడ్‌ కూటమిలో చేరిందని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు. మారిన పరిస్థితులు భారత్‌, అమెరికాలు కొత్తగా స్నేహ సంబంధాలు ఏర్పరచుకొనేలా పురిగొల్పాయన్నారు. ఈ మేరకు ‘నెవర్‌ గివ్‌ ఏన్‌ ఇంచ్‌: ఫైటింగ్‌ ఫర్‌ అమెరికా ఐ లవ్‌’ పేరిట పాంపియో రాసిన గ్రంథంలో పేర్కొన్నారు. ఈ పుస్తకం మంగళవారం మార్కెట్‌లో విడుదలైంది.


అఫ్గానిస్థాన్‌లో భారీగా పెరిగిన పౌష్టికాహార లోపం
ఐరాస ఆహార సంస్థ వెల్లడి

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ పోషకాహార లోపం రేట్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దేశంలోని సగం మంది ప్రజలు ఏడాది పొడవునా ఆకలితో అలమటిస్తున్నారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితికి చెందిన అనుబంధ సంస్థ ప్రపంచ ఆహార కార్యక్రమం గురువారం వెల్లడించింది. 2021లో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో  ఆ దేశానికి అందే విదేశీ సాయం ఒక్కసారిగా నిలిచిపోయింది. తాలిబన్‌ పాలకులపై ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. వీటికి తోడు తాలిబన్ల అరాచక పాలన దేశంలోని కోట్ల మందిని పేదరికం, క్షుద్బాధలోకి జార్చింది.


ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలోకి మళ్లీ ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సామాజిక మాధ్యమ ఖాతాను పునరుద్ధరించనున్నట్లు మెటా వెల్లడించింది. క్యాపిటల్‌ హిల్‌ అల్లర్ల అనంతరం దీనిని తొలగించిన విషయం తెలిసిందే. మెటా నిర్ణయంతో త్వరలోనే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆయన ఖాతా అందుబాటులోకి రానుంది. ఎలా మాట్లాడేవారికైనా స్వేచ్ఛగా వారి భావాలను ప్రకటించుకునే అవకాశం ఇవ్వడమే తమ విధానమని మెటా ప్రపంచ వ్యవహారాల అధ్యక్షుడు నిక్‌ క్లెగ్‌ స్పష్టం చేశారు. ‘నన్ను తొలగించాక బిలియన్‌ డాలర్లు నష్టపోయిన ఫేస్‌బుక్‌ మళ్లీ నా ఖాతాను తీసుకొస్తోందట. ఇపుడున్న అధ్యక్షుడికి గానీ, పగ తీర్చుకోలేని ఎవరికైనా సరే నాకు జరిగినట్లు జరగకూడదు’ అని ట్రంప్‌ స్పందించారు. ట్రంప్‌ రాజకీయ సమావేశాలకు నిధుల సేకరణలో ఫేస్‌బుక్‌ కీలకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.


అలరించిన గూగుల్‌ డూడుల్‌

దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ తన ప్రత్యేక డూడుల్‌తో భారతీయులకు శుభాకాంక్షలు చెప్పింది. రాష్ట్రపతి భవన్‌, ఇండియా గేట్‌, నార్త్‌బ్లాక్‌, సౌత్‌బ్లాక్‌, పరేడ్‌లో ఉండే మోటార్‌ సైకిల్‌ విన్యాసాలు, అశ్విక దళం మొదలైన అంశాలతో ఉన్న ఈ డూడుల్‌ను గుజరాత్‌ కళాకారుడు పార్థ్‌ కోటేకర్‌ పేపర్‌ ఆర్ట్‌ ద్వారా రూపొందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని