రిక్త పరీక్ష

ఆరోగ్య పరిస్థితి, శరీరానికి సోకిన ఇన్‌ఫెక్షన్ల గురించి తెలుసుకోవడానికి రక్తపరీక్షపై వైద్యులు ఆధారపడుతుంటారు.

Published : 27 Jan 2023 05:39 IST

బ్లడ్‌టెస్ట్‌కు మెరుగైన ప్రత్యామ్నాయం
నొప్పిలేని ఐఎస్‌ఎఫ్‌ విధానంపై శాస్త్రవేత్తల దృష్టి

ఆరోగ్య పరిస్థితి, శరీరానికి సోకిన ఇన్‌ఫెక్షన్ల గురించి తెలుసుకోవడానికి రక్తపరీక్షపై వైద్యులు ఆధారపడుతుంటారు. ఇది రోగికి నొప్పితో కూడుకున్న వ్యవహారం. సిరంజీతో రక్తం సేకరించడానికి సుశిక్షిత సిబ్బంది అవసరం. ఈ ఇబ్బందులకు శాస్త్రవేత్తలు కొత్త ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నారు. శరీరంలోని కణజాల ద్రవం (ఇంటర్‌స్టీషియల్‌ ఫ్లూయిడ్‌- ఐఎస్‌ఎఫ్‌)ను పరీక్షించడం ద్వారా దీర్ఘకాల ఆరోగ్య పర్యవేక్షణ సులువని పేర్కొంటున్నారు. వ్యాధులనూ చాలా ముందుగానే గుర్తించొచ్చని వివరిస్తున్నారు. రోగికి కూడా పెద్దగా నొప్పి లేకుండానే ఈ ద్రవాన్ని సేకరించొచ్చని చెబుతున్నారు.


ప్రత్యామ్నాయం ఎందుకు?  

చర్మం నుంచి స్రవించే చెమటలో కార్టిసాల్‌ వంటి కొన్ని హార్మోన్లు ఉంటాయి. ఒక వ్యక్తిలో ఒత్తిడి, ఆదుర్దా వంటి అంశాల స్థాయిని పరిశీలించడానికి స్వేదం ముఖ్యమైన మాధ్యమం. శరీరంలో ఇంకా అనేక రసాయనాలు ఉంటాయి. స్వేద గ్రంథుల కఠిన వడపోతను దాటుకొని అవి చెమట ద్వారా అంత సులువుగా విడుదల కాలేవు.  

ఈ నేపథ్యంలో ఆరోగ్య పర్యవేక్షణకు రక్తపరీక్షను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. అయితే బ్లడ్‌ టెస్ట్‌ల ద్వారా నిరంతరం ఆరోగ్య పరామితులను సేకరించడం కష్టం. ఎందుకంటే.. ఈ పరీక్ష కోసం రక్తనాళంలోకి సూదిని గుచ్చాల్సి ఉంటుంది. దాన్ని అలాగే ఉంచేసి, నిరంతరం వివిధ అంశాలను పరిశీలించడం అసాధ్యం. దీంతో ప్రత్యామ్నాయాల గురించి శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఐఎస్‌ఎఫ్‌పైకి వారి దృష్టి మళ్లింది.


ఏమిటీ ఐఎస్‌ఎఫ్‌

శరీరంలో కణాలు, కణజాలాలు, అవయవాల చుట్టూ ఉండే ద్రవాన్ని ఐఎస్‌ఎఫ్‌గా పేర్కొంటారు. ఇది రక్త నాళాల నుంచి వెలుపలికి ఉబికి వస్తుంది. కణాలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అదే సమయంలో వ్యర్థాలను తొలగిస్తుంది.

* మానవ శరీరంలో రక్తంతో పోలిస్తే ఐఎస్‌ఎఫ్‌ పరిమాణం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. మన శరీర బరువులో దీని వాటా 15 శాతం.


సాధనాల అభివృద్ధి..

ఐఎస్‌ఎఫ్‌లోని హార్మోన్లు, ఇతర రసాయనాల స్థాయిని కొలవడానికి అమెరికాలోని సిన్సినాటి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సెన్సర్లను అభివృద్ధి చేస్తున్నారు.

* ఈ ఫ్లూయిడ్‌ సేకరణకు ఒక పట్టీని రూపొందించారు. దానికి 1 మిల్లీమీటరు కన్నా తక్కువ పొడవు కలిగిన సూక్ష్మ సూది ఉంటుంది. ఈ పట్టీని చర్మానికి అతికించాలి. ఫలితంగా అందులోని సూది.. చర్మానికి చిన్నపాటి రంధ్రం పెట్టి ఐఎస్‌ఎఫ్‌ను సేకరిస్తుంది. ఏ సమయంలోనైనా ఈ ద్రవాన్ని విశ్లేషించొచ్చు. ఇది నొప్పి కలిగించదు. పట్టీ చర్మానికి అతుక్కొని ఉందనే భావనే కలగదు.

* జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు కూడా ఇదే తరహా ప్యాచ్‌ను అభివృద్ధి చేశారు. అందులో ఐదు సూక్ష్మసూదులు ఉంటాయి. వాటిద్వారా స్వల్ప మొత్తంలో ద్రవాన్ని సేకరించొచ్చు. దాని ద్వారా గ్లూకోజ్‌, కెఫీన్‌, విటమిన్‌-డి స్థాయిని పరీక్షించారు. ఈ సూదులు చాలా చిన్నగా ఉన్నందువల్ల చర్మానికి ఏర్పడ్డ రంధ్రాలు ఒక్క రోజులోనే మానిపోతాయి. రక్తం కలవకుండా నెమ్మదిగా సక్షన్‌ ప్రయోగించి ఐఎస్‌ఎఫ్‌ నమూనాలను సేకరించడం దీని ప్రత్యేకత. సూదులు లోపలికి దిగినప్పుడు సమీపంలోని రక్తనాళం దెబ్బతినకుండా శాస్త్రవేత్తలు ఈ ఏర్పాటు చేశారు.


ఈ పరీక్ష ప్రయోజనమేంటి?

రక్తం గురించి వైద్యులకు మంచి అవగాహన ఉంది. అందులో గుర్తించిన అంశాల ఆధారంగా మన గుండె, కాలేయానికి ఏమవుతుందో ముందే తెలుసుకోవచ్చు. ఐఎస్‌ఎఫ్‌లోనూ చాలావరకూ అదే పరిమాణంలో, అవే తరహా రసాయనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల వ్యయప్రయాసలతో కూడిన వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రత్యామ్నాయంగా ఈ ద్రవాన్ని వాడొచ్చని వివరిస్తున్నారు.

* రక్తం తరహాలో గడ్డకట్టే గుణం ఐఎస్‌ఎఫ్‌కు లేదు. అందువల్ల రోగి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ ద్రవం ఉపయోగపడుతుంది.

* ఔషధాల సమర్థతను పరిశీలించడానికి కూడా దీన్ని వాడొచ్చు. తద్వారా రోగికి అవసరమైన మోతాదును నిర్ధారించొచ్చు. రోగ నిరోధక వ్యవస్థ పర్యవేక్షణ ద్వారా వ్యాధిని ముందే గుర్తించొచ్చు.

* రక్త పరీక్షల కన్నా ఐసీఎఫ్‌ పరీక్ష విధానం చాలా ప్రయోజనకరమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పిల్లల విషయంలో ఇది బాగా ఉపయోగపడుతుందని వివరించారు.

* భవిష్యత్‌లో వేరబుల్‌ టెక్నాలజీ ద్వారా ఆరోగ్య పరిరక్షణకు ఐఎస్‌ఎఫ్‌ అపార అవకాశాలను కల్పిస్తుంది.


ఇబ్బంది ఉంది..

ఐఎస్‌ఎఫ్‌ను సేకరించడానికి చర్మంలోకి సూదిని చొప్పిస్తే.. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ తలెత్తవచ్చు. దీనివల్ల సేకరించిన నమూనాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. సూది గుచ్చకముందు ఉన్న స్థాయిలో ఆయా పదార్థాల పరిమాణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేలా పరిశోధనలు సాగుతున్నాయి.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు