యుద్ధంలో ఉక్రెయిన్‌ను గెలిపిస్తాం: అమెరికా

రష్యాతో పోరులో ఉక్రెయిన్‌ గెలిచేలా చేస్తామని, ఆ దేశ యుద్ధ సామర్థ్యాలను పెంచుతామని అమెరికా తెలిపింది. అత్యాధునిక లెపర్డ్‌-2 ట్యాంకులను సరఫరా చేస్తామని జర్మనీ ప్రకటించిన నేపథ్యంలో వైట్‌హౌస్‌ ఈ ప్రకటన చేసింది.

Updated : 27 Jan 2023 08:10 IST

వాషింగ్టన్‌: రష్యాతో పోరులో ఉక్రెయిన్‌ గెలిచేలా చేస్తామని, ఆ దేశ యుద్ధ సామర్థ్యాలను పెంచుతామని అమెరికా తెలిపింది. అత్యాధునిక లెపర్డ్‌-2 ట్యాంకులను సరఫరా చేస్తామని జర్మనీ ప్రకటించిన నేపథ్యంలో వైట్‌హౌస్‌ ఈ ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌ను గెలిపించడమే తమ లక్ష్యమని ప్రకటించింది. అందుకు నాటో దేశాలతో కలిసి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని పేర్కొంది. 14 లెపర్డ్‌ 2 ఏ6 ట్యాంకులను అందిస్తామని జర్మనీ ప్రకటించగానే అమెరికా కూడా తమ అత్యాధునిక అబ్రామ్స్‌ ట్యాంకులను సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ‘‘యుద్ధక్షేత్రంలో విజయవంతం కావడానికి అవసరమైన సామర్థ్యాలను ఉక్రెయిన్‌కు అందేలా చేయడం మా మిత్రదేశాల లక్ష్యం’’ అని అమెరికా జాతీయ భద్రతా సలహా మండలి స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ సమన్వయ కర్త జాన్‌కిర్బీ తెలిపారు.

రష్యా సంస్థపై అమెరికా ఆంక్షలు

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు అండగా నిలిచినందుకు, ఆఫ్రికాలో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడినందుకు రష్యాకు చెందిన వాగ్నర్‌ సంస్థపై అమెరికా ఆంక్షలు విధించింది. దాని అనుబంధ సంస్థలపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు గురువారం అమెరికా ప్రకటించింది.

ఆగని రష్యా దాడులు..11 మంది మృతి

మరోవైపు అత్యాధునిక యుద్ధట్యాంకులు సరఫరా చేస్తామని జర్మనీ, అమెరికా ప్రకటించిన నేపథ్యంలో రష్యా తన దాడులను మరింత ఉద్ధృతం చేసింది. కీవ్‌, ఒడెసాలపై క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 11 మంది పౌరులు చనిపోయారని, మరో 11 మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ తెలిపింది. 47 రష్యా క్షిపణులను నేలకూల్చామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని