సంక్షిప్త వార్తలు(5)

కొవిడ్‌ కారణంగా హృదయం-రక్తనాళాల సంబంధిత వ్యాధుల (సీవీడీ)తో మరణాల ముప్పు పెరిగినట్లు తాజా అధ్యయనమొకటి గుర్తించింది.

Updated : 28 Jan 2023 06:08 IST

కొవిడ్‌తో అధికమవుతున్న సీవీడీ మరణాలు

వాషింగ్టన్‌: కొవిడ్‌ కారణంగా హృదయం-రక్తనాళాల సంబంధిత వ్యాధుల (సీవీడీ)తో మరణాల ముప్పు పెరిగినట్లు తాజా అధ్యయనమొకటి గుర్తించింది. కరోనా విజృంభణ ప్రారంభమైన తొలి ఏడాదిలోనే అమెరికాలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించినట్లు తెలిపింది. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం.. అమెరికాలో 2019లో 8.74 లక్షల మంది పక్షవాతం, గుండె వైఫల్యం, అధిక రక్తపోటు వంటి సీవీడీల కారణంగా మరణించారు. మరుసటి ఏడాది ఆ సంఖ్యలో దాదాపు 6.2% పెరుగుదల నమోదైంది. అంటే- 2020లో సీవీడీలు 9.28 లక్షల మంది ప్రాణాలను బలిగొన్నాయి. గుండె-రక్తనాళాల ఆరోగ్యాన్ని కరోనా ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ రూపాల్లో ప్రభావితం చేయడమే మరణాల సంఖ్యలో పెరుగుదలకు కారణం.


సముద్రమట్టాల పెరుగుదలతో ముప్పు ఎక్కువే!

లండన్‌: సముద్రమట్టాల పెరుగుదల వల్ల మానవాళికి కలిగే ముప్పు.. మునుపటి అంచనాల కంటే ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనమొకటి హెచ్చరించింది. గతంలో ఊహించినదానితో పోలిస్తే రెండు రెట్లకుపైగా భూభాగంలో జల విలయం కనిపించే అవకాశాలున్నాయని పేర్కొంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా 2018లో ప్రయోగించిన ఐసీఈశాట్‌-2 లిడార్‌ ఉపగ్రహం ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. సముద్రమట్టాల్లో అనేక మీటర్ల మేర పెరుగుదల నమోదైనప్పుడు చాలావరకు తీరప్రాంతాలు నీట మునుగుతాయని ఇప్పటివరకు అత్యధిక మంది పరిశోధకులు అంచనా వేశారు. అయితే ఈ పెరుగుదల కేవలం 2 మీటర్లకు చేరుకున్నా.. గతంలో ఊహించిన దానికంటే 2.4 రెట్ల భూభాగాన్ని నీరు పూర్తిగా కప్పేస్తుందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.


జెరూసలెంలో కాల్పులు.. అయిదుగురి మృతి

జెరూసలెం: ఇజ్రాయెల్‌లోని తూర్పు జెరూసలెంలో ఒక ప్రార్థనా మందిరం సమీపంలో శుక్రవారం రాత్రి ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో అయిదుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి సైతం భద్రతా దళాల కాల్పుల్లో మృతిచెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.


ఇరాన్‌లో అజర్‌బైజాన్‌ ఎంబసీపై కాల్పులు
భద్రతాధికారి మృతి, ఇద్దరికి గాయాలు

దుబాయ్‌: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న అజర్‌బైజాన్‌ రాయబార కార్యాలయంపై శుక్రవారం ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో అజర్‌బైజాన్‌ భద్రతాధికారి మృతి చెందగా.. ఇద్దరు గార్డ్‌లు గాయాలపాలయ్యారు. ఇజ్రాయెల్‌తో తమకు ఉన్న విదేశాంగ బంధంపై ఇరాన్‌లో ఉన్న వ్యతిరేకతే ఈ దాడికి కారణంగా భావిస్తున్నామని అజర్‌బైజాన్‌ వెల్లడించింది. ఘటనకు సంబంధించి అజర్‌బైజాన్‌ విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడడంతో టెహ్రాన్‌ పోలీసు ఉన్నతాధికారిని ఇరాన్‌ సస్పెండ్‌ చేసింది. ఇలాంటి దాడికి అవకాశముందని సమాచారం ఉన్నా ఇరాన్‌ సరైన చర్యలు తీసుకోలేదని అజర్‌బైజాన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తూ.. టెహ్రాన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నామని ప్రకటించింది.


ఇంటర్వ్యూ చేస్తుండగా.. హెచ్‌ఆర్‌కి లేఆఫ్‌

 గూగుల్‌లో అనూహ్య పరిణామం

వాషింగ్టన్‌: దిగ్గజ సంస్థ గూగుల్‌లోని మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి అనూహ్య పరిస్థితుల్లో లేఆఫ్‌ సందేశం అందింది. డాన్‌ లానిగాన్‌ ర్యాన్‌ అనే ఆ వ్యక్తి సంస్థ కోసం ఓ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేస్తుండగానే, అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఈ-మెయిల్‌ వచ్చింది. ఫోన్‌లో ర్యాన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాల్‌ కట్‌ అయింది. సంస్థకు చెందిన వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించగా వీలుకాలేదు. తనతో పాటు మరికొందరికి ఈ పరిస్థితి ఎదురైంది. ఇదొక సాంకేతిక లోపంగా మేనేజర్‌ భావించినట్లు ర్యాన్‌ చెప్పారు. అయితే ఆ వెంటనే ఈ-మెయిల్‌ ద్వారా లేఆఫ్‌ సందేశం వచ్చినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని