కొక్కొరొక్కో... అంటే..

కొక్కొరొక్కో... అంటే కోడి కూస్తోందనుకుంటాం. కానీ ఆ కూత అర్థమేంటి? అదేం చెబుతోంది? ఎవరితో చెబుతోంది? మరోకోడి ఆ కూతనేమని అర్థం చేసుకుంటుంది?

Updated : 28 Jan 2023 10:25 IST

జంతుజాలం భాష తెలిసిపోతుంది
కృత్రిమమేధ ఫలితంగా...

కొక్కొరొక్కో... అంటే కోడి కూస్తోందనుకుంటాం. కానీ ఆ కూత అర్థమేంటి? అదేం చెబుతోంది? ఎవరితో చెబుతోంది? మరోకోడి ఆ కూతనేమని అర్థం చేసుకుంటుంది?

భౌభౌ అంటే కుక్క అరుపు అనుకుంటాం. కానీ ఆ భౌభౌ సందేశం ఏంటి? ఇతర కుక్కలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటాయి?
ఏనుగు ఘీంకారాలకు... సింహం హూంకారాలకు... తుమ్మెద ఝుంకారాలకూ... కాకి కావ్‌కావ్‌లకు, పిల్లి మ్యావ్‌మ్యావ్‌లకు... కప్ప బెకబెకలకూ... అన్నింటికీ ఓ అర్థముంటుంది. అది మనకు తెలియదు. అంతరిక్షాలకు ఎగిరిపోతూ, విశ్వాంతరాళంలో జీవరాశుల కోసం అన్వేషిస్తున్న మన మేధస్సుకు ఈ భూమ్మీద మనతో జీవిస్తున్న జంతు ప్రపంచం సందేశాలు ఇప్పటికీ అర్థంగాని ప్రహేళికలే! పెంచుకున్న కుక్క మన మాటల్ని అర్థం చేసుకుంటుంది. మన ఆదేశాలు పాటిస్తుంది. కానీ మేధస్సుందనుకుంటున్న మన మానవాళి మాత్రం వాటితో ఎన్నేళ్లు సహవాసం చేసినా భౌభౌలకు అర్థం ఇప్పటికీ తెలుసుకోలేదు.

... అయితే అదంతా గతం! మనిషి మేధస్సుతో సాధ్యం కానిది తను సృష్టించిన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) పుణ్యమా అని సాధ్యమవుతోంది. ఈ భూమ్మీదున్న ఇతర జీవజాలం చేసే శబ్దాలకు, వాటికున్న భావాలకు అర్థం చెప్పబోతోంది
కృత్రిమ మేధ!

మానవ భాషలను అర్థం చేసుకొని, ఇతర భాషల్లోకి తర్జుమా చేయటానికి సంవత్సరాల తరబడి కృత్రిమమేధ, మెషిన్‌ లెర్నింగ్‌ పరిశోధనలు కొనసాగాయి. వాటి ఫలితంగా అనేక సాంకేతిక భాషలు, అలెక్సా అంతకుమించిన ఆధునిక చాట్‌బోట్స్‌, ఇతర స్మార్ట్‌ పరికరాలు ఆవిష్కృతమయ్యాయి. అదే పద్ధతిలో జంతుజాలం సందేశాలను, వాటి భాషను అర్థం చేసుకోవటానికి కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ పరిరక్షణకు, జీవజాలం సుస్థిరతకు ఇది ఉపయోగపడుతుందం టున్నారు. చాలాకాలంగా సాగుతున్న ఈ పరిశోధనలు ఓ కొలిక్కి వస్తున్నాయి.

‘‘మానవులు, జంతుజాలం మధ్య భాషా ప్రసారంలో కృత్రిమమేధను ఉపయోగించి చేస్తున్న పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి’’ అని ఎర్త్‌ స్పీసిస్‌ ప్రాజెక్ట్‌ (ఈఎస్పీ) వ్యవస్థాపకులు కేటీ జకారియన్‌ తెలిపారు. కాలిఫోర్నియాలోని ఈ సంస్థ జంతుజాలం భాషను డీకోడ్‌ చేసే ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా కృత్రిమమేధ, మెషిన్‌ లెర్నింగ్‌ను ఉపయోగించి వివిధ జంతుజాలం శబ్దాలను, కదలికలను నిశితంగా రికార్డు చేసి, విశ్లేషిస్తున్నారు. వివిధ సందర్భాల్లో అవెలా స్పందిస్తున్నాయో కూడా  కృత్రిమమేధ ద్వారా విశ్లేషణ సాగుతోంది.

ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఇళ్లు, కొండలు, గుట్టలు, దట్టమైన అడవులు, సముద్ర గర్భం... ఇలా అనేకానేక ప్రాంతాలతో పాటు అనేక జంతువులు, పక్షులు, చెట్లకు కూడా, అత్యంత సున్నితమైన సెన్సార్లు, రికార్డింగ్‌ పరికరాలు, సూక్ష్మ కెమెరాలను అమర్చారు. ఇళ్లలోని పెంపుడు జంతువులపైనా ఈ ప్రయోగం కొనసాగుతోంది. ఈఎస్పీతో ప్రపంచవ్యాప్తంగా మరో 40 పర్యావరణ సంస్థలు, అనేకమంది బయాలజిస్టులు ఈ పరిశోధనలో పాలుపంచుకుంటున్నారు. ఇలా సేకరించిన టన్నుల కొద్ది డేటాను విశ్లేషించటం మానవమాత్రులకు అయ్యేది కాదు. అందుకే కృత్రిమమేధ సాయం తీసుకుంటున్నది. ఇలా సేకరించిన సమాచారమంతటినీ పరిశీలించి వాటి ఆధారంగా వివిధ సందర్భాల్లో అవి స్పందించే తీరులను బేరీజు వేసి... వాటి ప్రవర్తనకు ముడిపెట్టి ఆల్గరిథమ్స్‌ ద్వారా విశ్లేషిస్తారు.

‘‘భారీగా ఉండే ఏనుగులు మనుషులు వినలేని శబ్దాలు చేస్తాయి. దూరంగా ఉండే ఏనుగులు ఈ శబ్దాలను విని వాటి గమనాన్ని కొనసాగిస్తాయి. ఒకరకంగా ఇది మనకు టెలిపతీలాంటిది. ఇప్పుడు సాకేంతిక పరికరాల కారణంగా అలాంటి శబ్దాలనూ వినగలుగుతున్నాం. ఏనుగులు మనుషులకు ఒకరకంగా, తేనెటీగలకు మరోరకంగా సంకేతాలనిస్తాయి. అంతేగాదు, మనుషులను భయపెట్టడానికి ఒకరకంగా, మామూలుగా మరోరకంగా స్పందిస్తాయి. అలాగే తేనటీగలైతే వందల రకాల శబ్దాలు చేస్తాయి. కేవలం వాటి సందేశాలు, సంకేతాలను అర్థం చేసుకోవటం కాదు. వాటిని అవెలా అర్థం చేసుకుంటున్నాయో తెలుసుకోవటం మనమందున్న అతిపెద్ద సవాలు. అంటే ఒక గబ్బిలం శబ్దాన్ని మరో గబ్బిలం ఏం అర్థం చేసుకుంటుందో తెలుసుకోవటం చాలా కష్టమైన పని. ఈ భూమి సకల జంతుజాల సమ్మిళితం. కొమ్మకొమ్మకో సన్నాయి మోగుతుంటుంది. ప్రతి జీవికీ ఓ భాషుంది. మనం గుర్తించలేనివాటిని లేనే లేవనుకోవటం మానవ సహజగుణం. కానీ ఇప్పటిదాకా అలా మన భావనలకు అందని వాటిని సాంకేతికత కారణంగా అర్థం చేసుకునే వీలవుతోంది. అయితే దీన్ని కూడా మనిషి స్వార్థానికి వినియోగించుకుంటే అంతకంటే వినాశనానికి దగ్గరి మార్గం లేదు’’ అని జీవశాస్త్రవేత్త, రచయిత కరెన్‌ బాకెర్‌ హెచ్చరిస్తున్నారు.


జంతుజాలం నుంచి, ఈ పర్యావరణం నుంచి వస్తున్న శబ్దాలు, వాటి సందేశాల ఆధారంగా... మానవాళి తన సామాజిక, భౌతిక వ్యవస్థల్లో మార్పులు చేసుకోగలుగుతుంది. అంతేకాదు... ఇతర జీవుల భాషను అర్థం చేసుకోవటమంటే... పర్యావరణ పరిరక్షణలో ఇతరుల మాటకు విలువిస్తున్నామని అర్థం’’

కేఫిర్త్‌ బటర్‌ఫీల్డ్‌, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం కృత్రిమమేధ విభాగాధిపతి


ఈనాడు ప్రత్యేక విభాగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు