అమెరికా ఎంచుకునే కీలక భాగస్వామి భారత్‌

వాణిజ్య సహకారం సహా అనేక అంశాల్లో అమెరికా ఎంచుకునే ఓ కీలక భాగస్వామి భారత్‌ అని అధ్యక్షుడు బైడెన్‌ పాలనా యంత్రాంగంలోని ఓ అధికారి అన్నారు.

Updated : 28 Jan 2023 06:27 IST

డోభాల్‌ పర్యటనకు ముందు యూఎస్‌ అధికారి వ్యాఖ్య

వాషింగ్టన్‌: వాణిజ్య సహకారం సహా అనేక అంశాల్లో అమెరికా ఎంచుకునే ఓ కీలక భాగస్వామి భారత్‌ అని అధ్యక్షుడు బైడెన్‌ పాలనా యంత్రాంగంలోని ఓ అధికారి అన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ వచ్చే వారం అమెరికాలో కీలక పర్యటన చేయనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ వాషింగ్టన్‌లో  విలేకరులతో మాట్లాడుతూ.. డోభాల్‌ పర్యటనపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో భద్రతా సహకారాన్ని పెంపొందించుకోవడం కూడా ఉభయ దేశాల సంబంధాల్లో భాగమని పేర్కొన్నారు. వీటిలో సాంకేతిక సహకారం కూడా ఉందని చెప్పారు. భారత్‌ - అమెరికా సంబంధాలు తమకు చాలా ముఖ్యమైనవని తెలిపారు. వాషింగ్టన్‌లో భారత గణతంత్ర దినోత్సవాల సందర్భంగా అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూ మాట్లాడుతూ.. ఉభయ దేశాల మధ్య ప్రపంచ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత కీలకంగా కొనసాగుతుందని అన్నారు. ఆరోగ్య సంరక్షణ, శుద్ధ ఇంధనం, భద్రత, విద్య, సాంకేతికత తదితర రంగాలతో పాటు మోదీ, బైడెన్‌ల దార్శనికతను కార్యరూపంలోకి తేవడంలో పరస్పర మార్పిడి ద్వారా ఉభయ దేశాలూ ప్రయోజనం పొందుతున్నాయని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని