విద్యుత్తు అవసరంలేని వాషింగ్‌ మెషిన్‌ తయారీ

విద్యుత్తు లేకుండా, తక్కువ నీటితో వాషింగ్‌ మెషిన్‌ తయారు చేసిన భారత సంతతి వ్యక్తి నవ్‌జోత్‌ సాహనీకి రిషి సునాక్‌ అవార్డును బ్రిటన్‌ ప్రకటించింది.

Published : 28 Jan 2023 06:34 IST

బ్రిటన్‌లో సిక్కు వ్యక్తికి రిషి సునాక్‌ అవార్డు

లండన్‌: విద్యుత్తు లేకుండా, తక్కువ నీటితో వాషింగ్‌ మెషిన్‌ తయారు చేసిన భారత సంతతి వ్యక్తి నవ్‌జోత్‌ సాహనీకి రిషి సునాక్‌ అవార్డును బ్రిటన్‌ ప్రకటించింది. బ్రిటన్‌లో జన్మించిన నవ్‌జోత్‌ సాహనీ.. మహిళలు దుస్తులు ఉతకడం చూడలేకపోయారు. వారి కష్టాన్ని కొంతలో కొంతైనా తగ్గించాలని భావించారు. అంతేకాకుండా పేదలకు ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నారు. దీంతో విద్యుత్‌ లేకుండానే పనిచేసేలా పరికరాన్ని తయారు చేశారు. నీరు సైతం 50 శాతం ఆదా అయ్యేలా రూపొందించారు. చేతితో ఉతికే సమయానికంటే ముందే పని ముగించేలా వాషింగ్‌ మెషిన్‌ను తీర్చిదిద్దారు. దానికి తన స్నేహితురాలు పేరు మీద ‘దివ్య పరికరాలు’ అని పేరు పెట్టి 300 వాషింగ్‌ మెషిన్‌లను ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలకు, పునరావాస కేంద్రాలకు, ఆనాథాశ్రమాలకు ఇచ్చారు. నాలుగేళ్ల క్రితమే ఆయన ఈ పరికరాన్ని రూపొందించారు. భారత్‌లో నిర్వహించిన ఈ ప్రాజెక్టును బ్రిటన్‌ ప్రభుత్వం గుర్తించింది. ‘ప్రధానమంత్రి రిషి సునాక్‌ పాయింట్స్‌ ఆఫ్‌ లైట్‌’ అవార్డును సాహనీకి ప్రకటించింది. నవ్‌జోత్‌ పనితనాన్ని మెచ్చుకున్న బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఆయనకు లేఖ రాశారు. ‘‘మీ చాతుర్యం, కరుణను ప్రశంసిస్తున్నాను. వేలమందికి సహాయం చేయడం కోసం మీ తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. మహిళలకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది. ఆపదలో ఉన్న ఉక్రెయిన్‌ వాసులకూ ఇది ఉపయోగపడుతోందని తెలుసుకున్నాను’’ అని అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు