ఆక్సిటోసిన్‌ లవ్‌ హార్మోన్‌ కాదా?.. శాస్త్రవేత్తల పరిశోధనల్లో కీలక విషయాలు..

‘లవ్‌ హార్మోన్‌’గా పేరొందిన ఆక్సిటోసిన్‌పై శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెలుగులోకి తెచ్చారు.

Updated : 29 Jan 2023 08:22 IST

లాస్‌ ఏంజిలెస్‌: ‘లవ్‌ హార్మోన్‌’గా పేరొందిన ఆక్సిటోసిన్‌పై శాస్త్రవేత్తలు కీలక విషయాలు వెలుగులోకి తెచ్చారు. అది లేకున్నప్పటికీ సామాజిక బంధాలు ఏర్పడతాయని, కాన్పులు సాఫీగానే సాగుతాయని, స్తన్యం ఉత్పత్తి జరుగుతుందని తేల్చారు. ఈ అంశాలకు ఆక్సిటోసిన్‌ అవసరమంటూ దశాబ్దాలుగా ఉన్న భావనను ఇది ప్రశ్నార్థకం చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ప్రేమానురాగాలు, కన్నపిల్లలపై మమకారం వంటి అంశాల్లో ఆక్సిటోసిన్‌ అవసరమని 30 ఏళ్లుగా శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. ఇందులో నిజానిజాలు తేల్చడానికి ప్రెయిరీ వోల్స్‌ అనే ఒక రకం మూషికాలపై వీరు పరిశోధన చేశారు. క్రిస్పర్‌ జన్యు ఎడిటింగ్‌ సాధనంతో.. ఆక్సిటోసిన్‌ గ్రాహకాలు లేని కొన్ని వోల్స్‌ను అభివృద్ధి చేశారు. అవి సహచర జీవులతో దీర్ఘకాల బంధాలను ఏర్పర్చగలవా అన్నది పరిశీలించారు. అవి సాధారణ వోల్స్‌ తరహాలోనే వ్యవహరించాయని తేల్చారు. శృంగారం, సామాజిక బంధాలు వంటి అంశాల్లో ఎలాంటి తేడాలు లేవని వివరించారు. రిసెప్టార్లు లేని ఆడ వోల్స్‌ కూడా సంతానానికి జన్మనిచ్చాయని, పాలిచ్చాయని తెలిపారు. ఇది శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. కాన్పు, పాల ఉత్పత్తికి ఆక్సిటోసిన్‌ అవసరమన్న భావన ఉండటమే ఇందుకు కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని