అచేతనావస్థలో ఐరాస భద్రతా మండలి

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)పై సర్వప్రతినిధుల సభ(యూఎన్‌జీఏ) అధ్యక్షుడు కసాబా కొరొసి కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 30 Jan 2023 04:50 IST

ఓ శాశ్వత సభ్యదేశం పొరుగు దేశంపై దాడి చేస్తున్నా చర్యలు శూన్యం
యూఎన్‌జీఏ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
యూఎన్‌ఎస్‌సీలో సంస్కరణలు అవసరమని స్పష్టీకరణ
భారత్‌లో మూడు రోజుల పర్యటనకు రాక

ఐరాస: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)పై సర్వప్రతినిధుల సభ(యూఎన్‌జీఏ) అధ్యక్షుడు కసాబా కొరొసి కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలి నేటి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రాథమిక విధి అయిన అంతర్జాతీయ శాంతి, భద్రతల పరిరక్షణను కూడా సక్రమంగా నిర్వర్తించలేని అచేతనావస్థలో ఉందన్నారు. ఒక శాశ్వత సభ్యత్వ దేశం తన సరిహద్దు దేశంపై దాడికి పాల్పడుతుంటే ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆక్షేపించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా యూఎన్‌ఎస్‌సీ చేసిన తీర్మానాలను రష్యా తన వీటో అధికారంతో తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు రష్యా తనవిగా చెప్పుకొంటున్న ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను గుర్తించకూడదని యూఎన్‌జీఏ తీర్మానించగా, దానిపైనా మాస్కో వీటో ప్రయోగించింది. ‘‘దాడికి దిగిన దేశంపై చర్యలు తీసుకోవాల్సిన భద్రతా మండలి ఆ పని చేయలేకపోతోంది. ఆ దేశానికి వీటో అధికారం ఉండటమే ఇందుకు కారణం’’ అని కొరొసి వివరించారు. ప్రపంచ వ్యవస్థల పనితీరును సంస్కరించే విషయంలో ఇదో విలువైన పాఠంగా నిలుస్తుందని చెప్పారు. ఐరాసను సంస్కరించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు సభ్య దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోందని కొరొసి పేర్కొన్నారు. భారత్‌ పర్యటనకు బయల్దేరే ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆహ్వానం మేరకు ఆదివారం భారత్‌కు చేరుకున్న ఆయన మూడు రోజులు పర్యటించనున్నారు. భద్రతా మండలిలో సంస్కరణల కోసం భారత్‌ కూడా గట్టి గళం వినిపిస్తుండటం, శాశ్వత సభ్యత్వం కోసం డిమాండు చేస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘రెండో ప్రపంచ యుద్ధ అనంతర పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలి ఏర్పాటైంది. ఈ 77 ఏళ్లలో ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ సంబంధాలు మారాయి. భారత్‌ సహా మరికొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్థితిగతుల్లోనూ మార్పు వచ్చింది. కాబట్టి నేటి పరిస్థితులను ప్రతిబింబించేలా భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని 70కి పైగా సభ్య దేశాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి’’ అని కొరొసి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని