పాక్‌ ప్రజలపై పెట్రో బాంబు.. లీటరుకు రూ.35 పెంపు

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్‌ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మంత్రుల విదేశీ ప్రయాణాలు, లగ్జరీ కార్ల కొనుగోలుపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం.. ఇప్పుడు సామాన్యులపై పెను భారాన్ని మోపింది.

Updated : 30 Jan 2023 06:03 IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్‌ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మంత్రుల విదేశీ ప్రయాణాలు, లగ్జరీ కార్ల కొనుగోలుపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం.. ఇప్పుడు సామాన్యులపై పెను భారాన్ని మోపింది. ఆహార కొరత, విద్యుత్‌ సంక్షోభంతో ప్రస్తుతం సతమతమవుతున్న ప్రజలకు, పెట్రో ధరతో షాక్‌ ఇచ్చింది. కనీవినీ ఎరుగని రీతిలో ఇంధన ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటర్‌కు రూ.35 రూపాయల చొప్పున పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆదివారమే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు పాక్‌ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌తోపాటు కిరోసిన్‌, లైట్‌ డీజిల్‌ ధరలను కూడా లీటర్‌కు రూ.18 రూపాయల చొప్పున ప్రభుత్వం పెంచింది. తాజా నిర్ణయంతో పాకిస్థాన్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.249.80కి చేరగా.. హైస్పీడ్‌ డీజిల్‌ ధర రూ.262.80కు పెరిగింది. కిరోసిన్‌ రూ.189.83, లైట్‌ డీజిల్‌ రూ.187కు చేరింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.50కు పెంచుతారని సోషల్‌ మీడియాలో ఊహాగానాలు వచ్చిన వెంటనే పాక్‌లో పెట్రోల్‌ రూ.35 పెరిగింది. ధరల పెంపుతో పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు పెద్దఎత్తున బారులు తీరారు.

ఐఎంఎఫ్‌ నిధుల కోసమే ఈ తంటా..

పాక్‌ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సాయం అత్యవసరమన్న పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. అందుకోసం ఎంత కఠినమైన ఆంక్షలకైనా సిద్ధమని ప్రకటించారు. ఐఎంఎఫ్‌ ఇప్పుడు నిధులు విడుదల చేయకపోతే.. 6 బిలియన్‌ డాలర్ల నిధులన్నీ రద్దయిపోతాయి. అందుకే పాక్‌ సర్కారు కఠిన నిర్ణయాలకు ఉపక్రమించినట్లు స్పష్టం అవుతోంది. షరతులకు అంగీకరించిన నేపథ్యంలో వచ్చేవారం తమ బృందం పాకిస్థాన్‌లో పర్యటిస్తుందని ఐఎంఎఫ్‌ వెల్లడించింది. మరోవైపు పాకిస్థాన్‌ రూపీ మారకం విలువ రోజురోజుకు దిగజారుతోంది. శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్‌ రూపీ మారకం విలువ రూ.262.60 కనిష్ట స్థాయికి పతనమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు