కేబినెట్‌ మంత్రిపై సునాక్‌ వేటు

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సొంత పార్టీ అధ్యక్షుడిపైనే వేటు వేశారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఛైర్మన్‌, కేబినెట్‌ మంత్రి అయిన నదీమ్‌ జహావిని మంత్రివర్గం నుంచి తొలగించారు.

Updated : 30 Jan 2023 06:01 IST

పన్ను చెల్లింపుల్లో అక్రమాలే కారణం  

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సొంత పార్టీ అధ్యక్షుడిపైనే వేటు వేశారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఛైర్మన్‌, కేబినెట్‌ మంత్రి అయిన నదీమ్‌ జహావిని మంత్రివర్గం నుంచి తొలగించారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుల విషయంలో జహావి తీవ్ర మోసానికి పాల్పడినట్లు తేలడంతో ఆదివారం ఈ చర్యలు తీసుకున్నారు. జహావి వద్ద ఏ శాఖా లేనప్పటికీ బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో కొనసాగుతూ ఆయన నిబంధనలు ఉల్లఘించారని సునాక్‌ పేర్కొన్నారు. జహావి పన్ను చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదాయ పన్ను విభాగానికి 48 లక్షల పౌండ్ల పరిహారం చెల్లించేందుకు జహావి అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిహారం మంత్రి పదవి నియమావళి ఉల్లంఘనకు సమానమా కాదా అన్న విషయాన్ని తేల్చేందుకు సునాక్‌ ఓ స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణ పూర్తి చేసిన దర్యాప్తు బృందం.. జహావి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు నివేదిక సమర్పించింది. దీంతో ఆయనపై సునాక్‌ చర్యలు తీసుకున్నారు. ‘‘గతేడాది నేను ప్రధాని పదవి చేపట్టినప్పుడు నా ప్రభుత్వం ప్రతి విషయంలోనూ జవాబుదారీగా ఉంటుందని ప్రతిజ్ఞ చేశాను. మీరు నిబంధనలను ఉల్లంఘించినట్లు దర్యాప్తు బృందం నిర్ధారించింది. కాబట్టి మిమ్మల్ని పదవి నుంచి తొలగిస్తున్నాను’’ అని జహావికి రాసిన లేఖలో సునాక్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని