సంక్షిప్త వార్తలు(5)

సాధారణ వైద్య పరీక్షలతో పోలిస్తే మూడున్నరేళ్ల ముందే అల్జీమర్స్‌ వ్యాధిని గుర్తించే ఒక రక్తపరీక్షను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Updated : 31 Jan 2023 06:09 IST

మూడున్నరేళ్ల ముందే అల్జీమర్స్‌ను గుర్తించొచ్చు

లండన్‌: సాధారణ వైద్య పరీక్షలతో పోలిస్తే మూడున్నరేళ్ల ముందే అల్జీమర్స్‌ వ్యాధిని గుర్తించే ఒక రక్తపరీక్షను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మెదడు కణాల పుట్టుక ప్రక్రియ (న్యూరోజెనిసిస్‌)ను రక్తంలోని పదార్థాలు నియంత్రిస్తాయన్న సిద్ధాంతాన్ని ఇది సమర్థిస్తోంది.

మెదడులోని హిప్పోక్యాంపస్‌ అనే ముఖ్య భాగంలో న్యూరోజెనిసిస్‌ ప్రక్రియ జరుగుతుంది. అభ్యాసం, జ్ఞాపకశక్తికి ఈ భాగానికి ప్రమేయం ఉంది. అల్జీమర్స్‌ ఆరంభ దశలో ఉన్నప్పుడు హిప్పోక్యాంపస్‌లో నాడీ కణాల పుట్టుక ప్రక్రియ దెబ్బతింటుంది. అయితే వ్యాధి తీవ్రమైన దశల్లో ఉన్నప్పుడే ఇలాంటి ప్రక్రియ ఉంటుందన్న మునుపటి వాదన తప్పని శాస్త్రవేత్తలు తెలిపారు. విషయ గ్రహణ సామర్థ్యం ఒక మోస్తరు స్థాయిలో దెబ్బతిన్న (ఎంసీఐ) బాధితులు 56 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి, పరిశీలన జరిపారు. ఈ రుగ్మత ఉన్నవారు భవిష్యత్‌లో అల్జీమర్స్‌ బారినపడే అవకాశం ఎక్కువ. శాస్త్రవేత్తలు పరిశీలించిన 56 మందిలో 36 మందికి ఆ తర్వాత వ్యాధి ఉత్పన్నమైంది. ఈ నమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు మూడున్నరేళ్ల ముందే న్యూరోజెనిసిస్‌ సంబంధ మార్పుల ఆనవాళ్లను రక్తంలో గుర్తించగలిగారు.


మరణం ముప్పును తగ్గించే మూడో డోసు
-  అధ్యయనంలో వెల్లడి

బీజింగ్‌: బహుళ ఆరోగ్య సమస్యలున్నవారు కొవిడ్‌-19 టీకా మూడో డోసు తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని హాంకాంగ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. రెండో డోసు పొందినవారితో పోలిస్తే వీరికి అకాల మరణం ముప్పు 90 శాతం తగ్గుతుందని వెల్లడైంది. 2021 నవంబరు నుంచి 2022 మార్చి మధ్య కొవిడ్‌ టీకా మూడో డోసు పొందిన పలువురిని పరిశోధకులు పరిశీలించారు. వారికి అధిక రక్తపోటు, మధుమేహం, దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి వంటి రుగ్మతలు ఉన్నాయి. రెండు డోసులు మాత్రమే పొందినవారితో వీరిని పోల్చి చూశారు. ప్రాణాలు కాపాడటంలో మూడో డోసు సమర్థత ఇందులో వెల్లడైంది. 


రూ.6 కోట్లు చొప్పున  ముగ్గురికి బోనస్‌

బీజింగ్‌: చైనాకు చెందిన ఓ క్రేన్‌ తయారీ సంస్థ తమ సిబ్బందికి భారీగా బోనస్‌ ప్రకటించింది. దానిని పూర్తిగా నగదు రూపంలో అందించింది. ఈ మొత్తాన్ని చేతులతో తీసుకెళ్లలేక ఉద్యోగులు పెద్దపెద్ద సంచులు తెచ్చుకోవాల్సి వచ్చింది. చైనాకు చెందిన హెనాన్‌ మైన్‌ అనే కంపెనీ క్రేన్లను ఉత్పత్తి చేస్తుంటుంది. కరోనా కారణంగా గతేడాది పలు కంపెనీలు నష్టాలను చవిచూసినప్పటికీ, ఈ సంస్థకు భారీ లాభాలొచ్చాయి. దీంతో ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. అమ్మకాల విభాగంలో మంచి పనితీరు కనబరిచిన 30 మందికి పైగా ఉద్యోగులకు 6.10 కోట్ల యువాన్లు (రూ.73 కోట్లు) బోనస్‌గా ప్రకటించింది. అత్యుత్తమైన ముగ్గురు ఉద్యోగులకు ఒక్కొక్కరికి 50 లక్షల యువాన్లు (రూ.6 కోట్లు) చొప్పున అందించింది. కొందరికి 10 లక్షల యువాన్లు (రూ.1.20 కోట్లు) ఇచ్చింది.


ప్రయాణికులపైకి దూసుకెళ్లిన వాహనాలు
నైజీరియాలో 20 మంది మృతి

అబుజా: నైజీరియాలోని దక్షిణ ప్రాంతంలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు చోట్ల భారీ వాహనాలు ప్రయాణికులపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనల్లో 20 మంది మృతి చెందారు. ఓజులెగ్బా ప్రాంతంలో రద్దీగా ఉండే వంతెన వద్ద బస్సుపైకి 20 అడుగుల ఓ భారీ కంటైనర్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు ఎక్కుతున్న ఇద్దరు చిన్నారులు సహా 9 మంది ప్రయాణికులు మరణించారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ సురక్షితంగా బయటపడింది. మరో ఘటనలో ఆదివారం తెల్లవారుజామున ఒండో రాష్ట్రంలోని ఒడిగ్బో కౌన్సిల్‌ ప్రాంతంలో మరో ట్రక్కు బస్సును ఢీకొట్టింది. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి.


అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ.. మలుపు దశలో కరోనా
డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ అథనోమ్‌

జెనీవా: కరోనా వైరస్‌ ఇప్పటికీ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని సృష్టిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ పేర్కొన్నారు. చాలామందికి ఈ రోగ నిరోధక శక్తి పెరిగినందున కరోనా ఇప్పుడు మలుపు దశకు చేరిందని అభిప్రాయపడ్డారు. సోమవారం తమ సంస్థ వార్షిక కార్యనిర్వహణ మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది ఒమిక్రాన్‌ విజృంభించిన సమయంకంటే ఎంతో మెరుగైన స్థితిలో ప్రస్తుతం ఉన్నామనడంలో సందేహం లేదని అన్నారు. కానీ గత రెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా కనీసం 1.7లక్షల మంది కరోనా, దాని సంబంధిత వ్యాధులతో మరణించారని అప్రమత్తం చేశారు. ఈ ముప్పును ఎదుర్కొనే అవకాశాలున్నవారికి సంపూర్ణ వ్యాక్సినేషన్‌, పరీక్షలు, ప్రయోగశాలల విస్తరణ కొనసాగించాలని సూచించారు. ఈ వ్యాధిపై దుష్ప్రచారాలకూ తెరదించాలని పిలుపునిచ్చారు. కొవిడ్‌తో ఆసుపత్రిలో ప్రవేశాలు, మరణాలు ఈ ఏడాది బాగా తగ్గుతాయని ఆశిస్తున్నామన్నారు. కరోనా రహిత ఆరోగ్య సమాజాన్ని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు