సంక్షిప్త వార్తలు(4)

పాలు కలిపిన కాఫీ తీసుకున్నవారు ఆరోగ్యపరంగా ప్రయోజనాలు పొందుతారని డెన్మార్క్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. వీరిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం ఉంటుందని ప్రయోగాల్లో తేలింది.

Updated : 01 Feb 2023 05:43 IST

పాలు కలిపిన కాఫీతో మంచి ఆరోగ్యం

లండన్‌: పాలు కలిపిన కాఫీ తీసుకున్నవారు ఆరోగ్యపరంగా ప్రయోజనాలు పొందుతారని డెన్మార్క్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. వీరిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం ఉంటుందని ప్రయోగాల్లో తేలింది. ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్ల మిశ్రమం వల్ల రోగ నిరోధక కణాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు రెట్టింపవుతున్నాయని వారు వివరించారు. కోపెన్‌హాగన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగ నిరోధక వ్యవస్థలు స్పందిస్తాయి. ఆ సూక్ష్మజీవుల దాడి నుంచి మన శరీరాన్ని రక్షించడానికి తెల్లరక్త కణాలు, ఇతర రసాయన పదార్థాలను మోహరిస్తాయి. ఈ చర్యను ఇన్‌ఫ్లమేషన్‌గా పిలుస్తారు. కండరాలపై మనం భారం మోపినప్పుడు కూడా ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. మానవులు, మొక్కలు, పండ్లు, కూరగాయల్లో పాలీఫినాల్స్‌ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీసే ఆక్సిడేటివ్‌ ఒత్తిడిని తగ్గించడంలో సాయపడతాయి. ప్రొటీన్లలోని ముఖ్య పదార్థాలైన అమినో ఆమ్లాలతో కలిసినప్పుడు ఈ పాలీఫినాల్స్‌ ఎలా పనిచేస్తాయన్నది తాజాగా శాస్త్రవేత్తలు పరిశీలించారు. అమినో ఆమ్లంతో చర్య జరిపినప్పుడు పాలీఫినాల్‌కున్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం పెరుగుతోందని వెల్లడైంది. తద్వారా ఈ మిశ్రమం.. మానవుల్లో ఇన్‌ఫ్లమేషన్‌పై సానుకూల ప్రభావం చూపుతుందని తేలింది. మాంసం ఉత్పత్తులు, పాలలోని ప్రొటీన్లతో పాలీఫినాల్స్‌ బంధం ఏర్పరుస్తాయని ఇప్పటికే గుర్తించారు. పాలతో కూడిన కాఫీలోనూ ఈ రెండు పదార్థాలు చర్య జరుపుతాయా  అన్నది తాజాగా పరిశీలించారు. కాఫీ గింజల్లో పాలీఫినాల్స్‌, పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ తరహా కాఫీలోనూ పాలీఫినాల్స్‌, ప్రొటీన్ల మధ్య చర్య జరుగుతుందని వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.


చిన్నారులకు కొవిడ్‌ రీఇన్‌ఫెక్షన్‌ ముప్పు ఎక్కువ

మెల్‌బోర్న్‌: పెద్దలతో పోలిస్తే పిల్లల రోగనిరోధక వ్యవస్థకు జ్ఞాపకశక్తి తక్కువని పరిశోధకులు పేర్కొన్నారు. భవిష్యత్‌లో కరోనా వైరస్‌ మరోసారి తారసపడితే దాన్ని గుర్తించలేదని పేర్కొన్నారు. తనకు పరిచయంలేని కొత్త వైరస్‌గానే అది పరిగణిస్తుందని చెప్పారు. అందువల్ల ఆ పిల్లలు రెండోసారి కొవిడ్‌ బారినపడే ముప్పు అధికమని వివరించారు. అయితే వారిలో తీవ్రస్థాయి కొవిడ్‌-19 లక్షణాలు చాలావరకూ కనిపించబోవని చెప్పారు. ఆ చిన్నారుల్లో బలమైన సహజసిద్ధ రోగనిరోధక ప్రతిచర్య ఉంటుందని, అది వైరస్‌ను వేగంగా చిత్తుచేస్తుందని వివరించారు. అయితే ఇంత త్వరగా కొవిడ్‌ను మట్టికరిపించడం వల్ల.. రెండోసారి ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా రక్షించుకునే అవకాశాన్ని వారు కోల్పోతారని చెప్పారు. ‘‘పిల్లలు అప్పటికి అనేకరకాల వైరస్‌లకు గురికాకపోవడం వల్ల వారి రోగనిరోధక వ్యవస్థలో అనుభవరాహిత్యం ఎక్కువ. వారిలో మెమరీ టి కణాలు ఇంకా అభివృద్ధి చెందకపోవడం వల్ల రీఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు వారు అనారోగ్యం బారినపడే అవకాశం ఎక్కువ’’ అని డేవిడ్‌ రొబ్బియాని అనే శాస్త్రవేత్త వివరించారు.


కరోనాను దెబ్బతీసే  కోల్డ్‌స్పాట్స్‌

లండన్‌: కరోనా వైరస్‌లో లక్ష్యంగా చేసుకోవడానికి అనువైన భాగాలను స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అవి మార్పులకు లోనుకావని, వాటిని ఉపయోగించుకొని, భవిష్యత్‌లో ఈ వైరస్‌ను నిర్వీర్యం చేయవచ్చని తేల్చారు.కరోనా ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతుంటుంది. తద్వారా అది మన రోగ నిరోధక వ్యవస్థ ప్రభావాన్ని తప్పించుకుంటుంది. అయితే ఈ వైరస్‌ మొత్తం మారుతుందా? అందులోని కొంత భాగం చెక్కుచెదరకుండా ఉంటుందా? అన్నది కీలకంగా మారింది. స్విట్జర్లాండ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ బయోమెడిసిన్‌ శాస్త్రవేత్తలు దీనిపై దృష్టిసారించారు. దాదాపు కోటి కరోనా వైరస్‌ జన్యుక్రమాలను విశ్లేషించారు. మానవ కణాల్లోకి ప్రవేశించడానికి వైరస్‌ ఉపయోగించుకునే స్పైక్‌ ప్రొటీన్‌లోని 15 భాగాలు ఎప్పటికీ మారబోవని గుర్తించారు. వీటిని ‘కోల్డ్‌ స్పాట్స్‌’గా పేర్కొంటారు. కొద్దిమంది కొవిడ్‌-19 బాధితుల్లో ఈ భాగాలను లక్ష్యంగా చేసుకునే యాంటీబాడీలను గుర్తించారు. ‘‘ఈ యాంటీబాడీలు చాలా అరుదు. సరికొత్త విధానం సాయంతో వీటిని కనుగొన్నాం’’ అని ఫిలిప్లో బియాంచిని అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు ఈ యాంటీబాడీలు వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకున్నాయి. కొత్త వేరియంట్లపైనా అవి సమర్థంగా పనిచేశాయి. ప్రస్తుత, భవిష్యత్‌ కరోనా వైరస్‌లను మెరుగ్గా కట్టడి చేసే విధానాల అభివృద్ధికి ఈ పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.


నిరక్షరాస్యతతో మానసిక ఇబ్బందులు ఎక్కువ!

లండన్‌: సరైన చదువు లేనివారికి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది. ఇలాంటివారు ఒంటరితనం, కుంగుబాటు, ఆదుర్దా వంటివి ఎదుర్కొనే అవకాశం ఎక్కువని తెలిపింది. భారత్‌ సహా 9 దేశాల డేటాను విశ్లేషించిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు.

50 ఏళ్లుగా అక్షరాస్యత పెరుగుతున్నప్పటికీ ప్రపంచంలో ఇప్పటికీ 77.3 కోట్ల మంది వయోజనులకు చదివే, రాసే సామర్థ్యం లేదు. వర్ధమాన దేశాలతోపాటు ఘర్షణలు ఎక్కువగా ఉన్న చోట్ల అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉంటోంది. ప్రపంచ నిరక్షరాస్యుల్లో మూడింట రెండొంతుల మంది మహిళలే. అందువల్ల ఆ ప్రభావాన్ని పురుషులతో పోలిస్తే వారే ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. బాగా చదువుకున్నవారు సామాజికంగా మెరుగైన స్థానంలో ఉండటానికి ఆస్కారం ఉంది. ఉద్యోగం సంపాదించడం, మంచి వేతనం, ఆహారం, గృహ సౌకర్యం వంటి ప్రయోజనాలను వారు పొందగలుగుతారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సరిగా చదువుకోనివారు పేదరికంలో మగ్గిపోతారని, వారి ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటుందని, దీర్ఘకాల వ్యాధుల బారినపడొచ్చని, వారి సగటు ఆయుర్దాయం కూడా తక్కువగానే ఉంటుందని చెప్పారు. ఇవన్నీ వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని