మాకు యుద్ధ విమానాలూ కావాలి

పాశ్చాత్య దేశాల నుంచి యుద్ధ ట్యాంకులను పొందుతున్న ఉక్రెయిన్‌ తమకు యుద్ధ విమానాలు, దూరశ్రేణి క్షిపణులూ కావాలంటోంది.

Published : 01 Feb 2023 04:54 IST

పాశ్చాత్య దేశాలను కోరుతున్న ఉక్రెయిన్‌
ఎఫ్‌-16లు ఇచ్చే ప్రసక్తే లేదన్న అమెరికా
మేమూ ఇవ్వబోమంటున్న జర్మనీ
షరతులతో సరేనంటున్న ఫ్రాన్స్‌!

కీవ్‌: పాశ్చాత్య దేశాల నుంచి యుద్ధ ట్యాంకులను పొందుతున్న ఉక్రెయిన్‌ తమకు యుద్ధ విమానాలు, దూరశ్రేణి క్షిపణులూ కావాలంటోంది. ఉక్రెయిన్‌ వాటిని రష్యాపై ప్రయోగిస్తే యుద్ధం మరింత ఉద్ధృతమవుతుందనే భావనతో అమెరికా, నాటో దేశాలు వెనుకాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌కు ఎఫ్‌-16 ఫైటర్లను పంపే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేయగా, జర్మనీ కూడా యుద్ధ విమానాలను పంపడానికి విముఖత ప్రదర్శించింది. కొన్ని దేశాలు అంతర్గత రాజకీయాల వల్ల ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపాలన్న డిమాండ్‌ను లేవనెత్తుతున్నాయని జర్మనీ ఛాన్స్‌లర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌ వ్యాఖ్యానించారు. రష్యాకు తూర్పు సరిహద్దులో ఉన్న పోలండ్‌, స్లొవేకియా, లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా దేశాలు ఉక్రెయిన్‌ తరవాత పుతిన్‌ తమపైనే దండెత్తవచ్చని అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లిథువేనియా, పోలండ్‌లు యుద్ధవిమానాలను ఉక్రెయిన్‌కు పంపాలని కోరుతున్నాయి. ఈ విషయమై చర్చించడానికి ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ మంగళవారం పారిస్‌ చేరుకున్నారు. ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలను పంపడానికి తాము సిద్ధమే కానీ, ఆ విమానాలు రష్యా భూభాగాన్ని తాకకూడదనీ, ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లకూడదనీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ సోమవారం షరతులు పెట్టారు. ఫైటర్‌ జెట్‌లను పంపడం వల్ల ఫ్రాన్స్‌ వాయుసేన సంఖ్యాబలం తగ్గకూడదనీ ఆయన భావిస్తున్నారు. ఈ అంశంపై మెక్రాన్‌, రెజ్నికోవ్‌లు చర్చించనున్నారు.


పోలండ్‌ విజ్ఞప్తి అనాలోచిత చర్య: రష్యా

మరోవైపు ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపాలని పోలండ్‌ తదితర దేశాలు నాటోను కోరడం బొత్తిగా అనాలోచిత చర్య అని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ వ్యాఖ్యానించారు. దీనివల్ల యుద్ధం మరింత ప్రజ్వరిల్లుతుందని తెలిసి కూడా అవి కవ్వింపు చర్యలకు దిగుతున్నాయని ఆరోపించారు. ఐరోపాలోని ప్రధాన దేశాలు ఇటువంటి తీవ్ర వైఖరులను నివారించకపోవడం విచారకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని