సంక్షిప్త వార్తలు(7)
భూతాపం పెరుగుదలను 1.5 సెల్సియస్ డిగ్రీల లోపునకు కట్టడి చేయడమనేది ప్రస్తుత సామాజిక మార్పుల వల్ల సాధ్యపడదని జర్మనీలోని హాంబర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు.
భూతాపం కట్టడి ఇప్పట్లో అసాధ్యం
తేల్చిచెప్పిన జర్మనీ పరిశోధకులు
బెర్లిన్: భూతాపం పెరుగుదలను 1.5 సెల్సియస్ డిగ్రీల లోపునకు కట్టడి చేయడమనేది ప్రస్తుత సామాజిక మార్పుల వల్ల సాధ్యపడదని జర్మనీలోని హాంబర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు. వాతావరణ మార్పులను అంచనా వేయడానికి మొట్టమొదటిసారిగా సామాజిక శాస్త్రాలను, ప్రాకృతిక శాస్త్రాను మేళవించిన అధ్యయనమది. మానవ సమాజం ఎంత వేగంగా సానుకూల మార్పులను చేపడితే అంత త్వరగా భూతాపానికి కళ్లెం వేయగలుగుతామని పరిశోధకులు నిర్ధారించారు. మానవ వస్తుసేవల వినియోగం, కార్పొరేట్ చర్యలు వాతావరణ మార్పులను నిరోధించే కృషిని మందగింపజేస్తున్నాయి. కర్బన ఉద్గారాలను వెదజల్లే శిలాజ ఇంధనాలను మానవ సమాజం వేగంగా వదిలించుకోలేకపోతోంది. ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని పెంచుతున్నందున పారిస్ వాతావరణ సభ తీర్మానించిన ప్రకారం భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల లోపునకు పరిమితం చేయడం కష్టమవుతోంది. రష్యన్ సహజవాయువుపై ఆధారపడాల్సిన అగత్యం నుంచి ప్రపంచం ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా శిలాజ ఇంధనాలకు వీడ్కోలు చెప్పగలుగుతామని జర్మన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మానవ సమాజం తన పంథాను మార్చుకోకపోతే భూతాపం పెరిగిపోవడం ఖాయమన్నారు.
చెస్‌లో ఎత్తుగడలపై వాయు కాలుష్యం దెబ్బ!
వాషింగ్టన్: వ్యక్తుల మేధో సామర్థ్యాలపై వాయు కాలుష్యం ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెస్ ఆటగాళ్లు పూర్తిస్థాయిలో తమ సత్తా చాటలేకపోతుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. జర్మనీలో 2017, 2018, 2019ల్లో నిర్వహించిన ఓ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఆటగాళ్లు వేసిన ఎత్తులను అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు కంప్యూటర్ సాయంతో విశ్లేషించారు. వాతావరణంలో పీఎం 2.5 సూక్ష్మ ధూళికణాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఆటగాళ్లు తమ తదుపరి ఎత్తును తప్పుగా వేసే అవకాశాలు 2.1% మేర అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. ఆయా ఎత్తుల దోష తీవ్రత 10.8% దాకా ఉంటోందని కూడా తేల్చారు. వాతావరణం కాలుష్యరహితంగా ఉన్నప్పుడు వ్యక్తులు చురుగ్గా ఆలోచించగలరని ఈ ఫలితాల ద్వారా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.
త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు ఎమ్‌క్యూ-9బి ప్రిడేటర్ డ్రోన్‌లు
వాషింగ్టన్: సాయుధ ఎమ్‌క్యూ-9బి ప్రిడేటర్ డ్రోన్‌ల కొనుగోలుకు సంబంధించి భారత్ అమెరికాల మధ్య ఐదేళ్లుగా చర్చల్లో నానుతున్న ఒప్పందం త్వరలో ఖరారు కానుంది. త్రివిధ దళాల నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు భారత్ నిర్ణయించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా పర్యటనలో ఈ ఒప్పందానికి తుదిరూపు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఆయన బుధవారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ను కలిసి పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అత్యాధునిక సాంకేతికత రంగాల్లో సహకారానికి భారత్ అమెరికాల మధ్య కుదిరిన ఐసీఈటీ ఒప్పందాన్ని ఇరు దేశాల సంబంధాల్లో మరో మైలురాయిగా అమెరికా ప్రధాని జో బైడెన్ అభివర్ణించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది.
కరెన్సీ నోటుపై బ్రిటన్ రాజముద్ర తొలగింపు
ఆస్ట్రేలియా నిర్ణయం
కాన్‌బెర్రా: తమ దేశ ఐదు డాలర్‌ల కరెన్సీ నోటుపై ఇక నుంచి బ్రిటన్ రాజు చిత్తరువుని ముద్రించబోమని ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంకు ప్రకటించింది. బ్రిటన్ రాజవంశంతో ముద్రిస్తున్న చివరి కరెన్సీ నోటు ఇదే కావడంతో తాజా నిర్ణయంతో ఇక నోట్లపై రాజవంశ ఆనవాళ్లు కనపడవు. ఆ స్థానంలో తమ దేశ మూలవాసుల సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త నోట్లను ఆస్ట్రేలియా ముద్రించనుంది. నాణేలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ 3 రూపు ఉన్న నాణేలు త్వరలోనే విపణిలోకి వస్తాయని వివరించింది. ఆస్ట్రేలియా పూర్తి స్వతంత్ర దేశమే అయినప్పటికీ బ్రిటన్ రాజవంశం పేరుమీదుగానే పాలన సాగడం సంప్రదాయంగా వస్తోంది.
పోలీసు దుస్తుల్లో పెషావర్ ఉగ్రవాది
పెషావర్: పాకిస్థాన్‌లోని పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది.. పోలీసు దుస్తుల్లో ఘటనా స్థలానికి చేరుకున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఉగ్రవాది శిరస్త్రాణం, మాస్కు ధరించి ద్విచక్రవాహనంపై మసీదుకు చేరుకున్నాడని గురువారం ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ఐజీ వెల్లడించారు. ‘ఉగ్రవాది పోలీసు దుస్తుల్లో ఉండటంతో ప్రధాన గేటు వద్ద అతడిని సిబ్బంది తనిఖీ చేయలేదు. ఓ పోలీసును మసీదుకు చిరునామా అడిగిన దాన్ని బట్టి ఈ ప్రదేశంపై అతడికి అవగాహన లేదని భావిస్తున్నాం.’ అని వివరించారు.
ఫిలిప్పిన్స్‌లో అమెరికా బలగాల పెంపు
దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ అలజడి నేపథ్యంలో
మనీలా: తైవాన్‌ను బలవంతంగానైనా హస్తగతం చేసుకుంటామని గురువారం చైనా ప్రకటించిన నేపథ్యంలో ఫిలిప్పిన్స్.. అమెరికా తలుపు తట్టింది. ఇప్పటికే అగ్రరాజ్యానికి చెందిన సైనిక శిబిరాలు ఫిలిప్పిన్స్‌లో ఉన్నాయి. మరో నాలుగు మిలిటరీ క్యాంపుల ఏర్పాటుకు గురువారం అమెరికా అంగీకారం తెలిపింది. దేశంలో పర్యటిస్తున్న అమెరికా రక్షణశాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఫిలిప్పిన్స్‌తో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. ‘‘ఫిలిప్పిన్స్ భవిష్యత్తు కోసం ఈ ఒప్పందం అవసరం. దీనికి అంగీకరించిన అధ్యక్షుడు జూ.ఫెర్డినాండ్ మార్కస్‌కు ధన్యవాదాలు. ఆసియా- పసిఫిక్, అమెరికా మధ్య బంధం బలమైనది’’ అని అన్నారు. ఒప్పందం చేసుకునే సమయంలో వామపక్ష వాదులు యూఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ దేశ జెండాలను కాల్చారు. దీనిపై స్పందించిన చైనా.. ఫిలిప్పిన్స్, అమెరికా మధ్య స్వార్థ ఎజెండా నడుస్తోందని వ్యాఖ్యానించింది.
భూగోళంపై పరిశోధనల కోసం.. జట్టుకట్టిన నాసా, ఐబీఎం
వాషింగ్టన్: భూగోళం గురించి మరింత శాస్త్రీయ సమాచారాన్ని సంపాదించే దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా, ప్రఖ్యాత ఐబీఎం కంపెనీ చేతులు కలిపాయి. భూమి చుట్టూ తిరుగుతున్న ఓ నాసా ఉపగ్రహం సేకరించే విస్తృత సమాచారాన్ని సమర్థంగా విశ్లేషించేందుకు అవి సంయుక్తంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నమూనా సాంకేతికతలను అభివృద్ధి చేయనున్నాయి. ఇందుకోసం సంబంధిత ఏఐ నమూనాలను తొలిసారిగా నాసా ఉపగ్రహ డేటాకు అనుసంధానించనున్నారు. ప్రకృతి విపత్తులు సహా భూ వాతావరణ వ్యవస్థను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు అవి దోహదపడే అవకాశాలున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Andhra News: సత్తెనపల్లి టికెట్ కోసం యుద్ధానికైనా సిద్ధం: వైకాపా నేత చిట్టా
-
Politics News
KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Movies News
Balagam: ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు
-
India News
Uttarakhand: లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, 20మందికి గాయాలు..!
-
India News
Anurag Thakur: ‘రాహుల్ గాంధీ పది జన్మలెత్తినా.. సావర్కర్ కాలేరు’