భారతీయ అమెరికన్లకు కీలక సభ్యత్వాలు

అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు)లో ప్రతినిధుల సభకు చెందిన మూడు కీలక కమిటీలలో నలుగురు భారత సంతతి అమెరికన్లను సభ్యులుగా నియమించారు.

Published : 03 Feb 2023 04:46 IST

వాషింగ్టన్‌: అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు)లో ప్రతినిధుల సభకు చెందిన మూడు కీలక కమిటీలలో నలుగురు భారత సంతతి అమెరికన్లను సభ్యులుగా నియమించారు. అమెరికాలో నానాటికీ పెరుగుతున్న భారతీయ అమెరికన్ల ప్రాముఖ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ప్రమీలా జయపాల్‌, అమీబెరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నాలను ఈ నియామకాలు వరించాయి. వలస వ్యవహారాల ఉప సంఘ సభ్యురాలిగా నియమితులైన ప్రమీలా జయపాల్‌ (57) పదహారేళ్ల వయసులో అమెరికాకు వలస వచ్చి, 17 ఏళ్ల తరవాత అమెరికా పౌరసత్వం పొందారు. ప్రతినిధుల సభకు ఎన్నికైన మొట్టమొదటి దక్షిణాసియా మహిళనైన తాను ఈ సభ్యత్వం పొందడాన్ని గొప్ప గౌరవంగా పరిగణిస్తున్నానని ఆమె చెప్పారు. అమెరికా వెలుపల పుట్టి అమెరికా పౌరసత్వం పొంది కాంగ్రెస్‌లో సభ్యులైన రెండు డజన్ల మందిలో తానూ ఒకరినని జయపాల్‌ తెలిపారు. గూఢచర్య వ్యవహారాలపై శక్తిమంతమైన సభా సంఘ సభ్యత్వాన్ని అమీబెరా (57) పొందారు. సీఐఏ, జాతీయ భద్రతా సంస్థ ఎన్‌.ఐ.ఏ, సైన్య గూఢచారి సంఘాల వ్యవహారాలను పర్యవేక్షించే సంఘమది. ఆరుసార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన బెరా.. విదేశాంగ వ్యవహారాల సంఘం, శాస్త్ర-సాంకేతిక, అంతరిక్ష వ్యవహారాల సంఘంలో కూడా సభ్యుడే. అమెరికాకు, ప్రపంచానికి చైనా వల్ల పొంచివున్న ముప్పును ఎదుర్కొనే అంశంపై కొత్తగా ఏర్పాటైన సభా సంఘంలో రాజా కృష్ణమూర్తి సభ్యుడయ్యారు. ఈ సంఘంలో మరొక భారతీయ అమెరికన్‌ రో ఖన్నానూ సభ్యుడిగా నియమించారు.

అధ్యక్ష పదవికి పోటీలో హేలీ!

ప్రముఖ భారతీయ అమెరికన్‌ రాజకీయ నాయకురాలు నిక్కీ హేలీ తాను ఈ నెల 15న నిర్వహించే సమావేశానికి హాజరు కావాల్సిందిగా మద్దతుదారులను, శ్రేయోభిలాషులను ఆహ్వానించారు. 2024 నవంబరు 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తానూ పోటీచేయదలచినట్లు బహుశా ఆమె ప్రకటిస్తారని భావిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జరగబోయే రిపబ్లికన్‌ ప్రైమరీలలో పార్టీ సభ్యుల మద్దతును చూరగొంటే ఆమె అధ్యక్ష బరిలో దిగగలుగుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు