మాపై దాడులకు రష్యా భారీ సన్నాహాలు!

తమ దేశంలపై భారీ దాడులకు రష్యా సిద్ధమవుతోందని ఉక్రెయిన్‌ రక్షణశాఖ మంత్రి ఓలెక్‌సీ రెజ్నికోవ్‌ తెలిపారు. ఈ నెల 24 నాటికి అవి ప్రారంభం కావచ్చని పేర్కొన్నారు.

Published : 03 Feb 2023 04:46 IST

24 నాటికి ప్రారంభం కావచ్చన్న ఉక్రెయిన్‌ మంత్రి రెజ్నికోవ్‌
త్వరలో మాస్కోపై మరిన్ని ఆంక్షలు: ఈయూ

కీవ్‌: తమ దేశంలపై భారీ దాడులకు రష్యా సిద్ధమవుతోందని ఉక్రెయిన్‌ రక్షణశాఖ మంత్రి ఓలెక్‌సీ రెజ్నికోవ్‌ తెలిపారు. ఈ నెల 24 నాటికి అవి ప్రారంభం కావచ్చని పేర్కొన్నారు.  ఈ దిశగా మాస్కో ఇప్పటికే అయిదు లక్షలాది మంది సైనికులను సమీకరించిందని, వారిలో అధికశాతం మందిని లుహాన్స్క్‌ ప్రాంతంలో మోహరిస్తోందని వెల్లడించారు. సైనిక చర్యకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ దాడులకు దిగొచ్చని అంచనా వేస్తున్నట్లు రెజ్నికోవ్‌ చెప్పారు. ఏటా ఫిబ్రవరి 23న నిర్వహించే రెడ్‌ ఆర్మీ వ్యవస్థాపక దినోత్సవం ‘డిఫెండర్‌ ఆఫ్‌ ఫాదర్‌ల్యాండ్‌ డే’ గుర్తుగానూ రష్యా ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు.

ముగ్గురు ఉక్రెయిన్‌వాసుల మృతి

ఇదిలా ఉండగా బుధవారం రష్యా జరిపిన క్షిపణి దాడిలో క్రమటోర్స్క్‌ నగరంలోని అపార్ట్‌మెంట్‌ భవంతి నాశనమైంది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించగా, 21 మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద మరొకరు ఉండొచ్చని భావిస్తున్నారు. రక్షణ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోపక్క యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌తో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక యూరోపియన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉక్రెయిన్‌కు కమిషన్‌ ప్రతిపాదిస్తున్నట్లు వాన్‌ డెర్‌ తెలిపారు. దీంతో ఐరోపా సమాజం(ఈయూ)లో సభ్యత్వానికి దగ్గరగా ప్రయోజనాలు పొందొచ్చని వివరించారు. యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి ఈయూ 50 బిలియన్‌ డాలర్ల సహాయాన్ని ఉక్రెయిన్‌కు అందించినట్లు ఆమె వెల్లడించారు. ఈ నెల 24వ తేదీలోపు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి ఈయూ యోచిస్తున్నట్లు వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని