మాపై దాడి.. ఇజ్రాయెల్ పనే
తమ భూభాగంలో ఉన్న ఆయుధ కర్మాగారంపై దాడి చేసింది ఇజ్రాయెలేనని ఇరాన్ ఆరోపించింది. గురువారం ఐరాసకు రాసిన లేఖలో ఈ మేరకు పేర్కొంది.
ఐరాసకు ఇరాన్ లేఖ
దుబాయ్: తమ భూభాగంలో ఉన్న ఆయుధ కర్మాగారంపై దాడి చేసింది ఇజ్రాయెలేనని ఇరాన్ ఆరోపించింది. గురువారం ఐరాసకు రాసిన లేఖలో ఈ మేరకు పేర్కొంది. దాడిపై ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని లేఖలో స్పష్టం చేసింది. ‘ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంలో ఉన్న ఓ ఆర్మీ ఆయుధ కర్మాగారంపై గత శనివారం మూడు డ్రోన్లు దాడి చేయగా వాటిలో రెండింటిని కూల్చేశాం. మూడో డ్రోన్ వల్ల స్వల్ప ఆస్తి నష్టం వాటిల్లింది. మా ప్రాథమిక దర్యాప్తులో ఇజ్రాయెల్ ఈ దాడి చేసినట్లు తేలింది. తగిన సందర్భంలో సరైన రీతిలో బదులిస్తాం’ అని పేర్కొంది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సాయంతో ఈ దాడులు చేశామని కొంత మంది ఇరాన్ అధికారిక వార్తా చానల్‌లో చెబుతున్నప్పటికీ.. అవి ఇరాన్ అద్దెకు తెచ్చుకున్నవారు చెప్పే సాక్ష్యాలు కావొచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దాడి జరిగిన తర్వాతి రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారుడు చేసిన ట్వీట్‌పైనా ఐరాసకు ఇరాన్ ఫిర్యాదు చేసింది. ‘ఇరాన్‌లో అది పేలుళ్ల రాత్రి.. ఉక్రెయిన్ ముందే హెచ్చరించింది’ అని ఆ ట్వీట్‌లో ఉంది.
క్షిపణి కేంద్రంపైనే దాడి?
ఇస్ఫహాన్‌లో రెండు క్షిపణి అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఈ నగరంలో మరో నాలుగు అణు ప్రయోగశాలలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా దాడి జరిగిన ప్రదేశం ఇరాన్ హైపర్‌సోనిక్ క్షిపణి అభివృద్ధి కేంద్రం కావొచ్చని మొసాద్ మాజీ చీఫ్ డానీ యాటమ్ ఇజ్రాయెల్ ఆర్మీ రేడియోలో సోమవారం పేర్కొన్నారు. ఇరాన్ అభివృద్ధి చేసిన పలు రకాల ఆయుధాలను సిరియా, లెబనాన్, పాలస్తీనాకు సరఫరా చేయడం ఇజ్రాయెల్‌లకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఇస్ఫహాన్‌లోని క్షిపణి కేంద్రాన్ని మొసాద్ లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చనే విశ్లేషణలు ఉన్నాయి.
భారీ నష్టమే జరిగిందా..?
క్వాడ్ కాప్టర్లకు పేలుడు పదార్థాలు అమర్చి దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది ఆ ఆయుధ స్థావరంపై మూడు నుంచి నాలుగు పేలుళ్లు చోటు చేసుకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని లండన్‌లోని ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. భారీ నష్టమే జరిగే అవకాశం ఉందని తెలిపింది.
రష్యా-ఉక్రెయిన్ కోణం ఉందా?
ఇరాన్ నుంచి చౌకగా క్షిపణులు కొనుగోలు చేయాలని రష్యా యత్నిస్తున్నట్లు అమెరికా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సాయంతో క్షిపణి కేంద్రంపై అమెరికానే దాడి చేయించిందనే ప్రచారం ఉంది. ఈ దాడి సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ పర్యటనలోనే ఉండటం గమనార్హం.
ఇరాన్ అణు కార్యకలాపాలపై అనుమానాలు
ఇరాన్ తమకు చెబుతున్న దానికి భిన్నంగా అణు కార్యకలాపాలు చేపడుతోందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) బుధవారం ప్రకటించింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫోర్దో అణు కేంద్రాన్ని తమ ప్రతినిధి తనిఖీ చేసినపుడు ఈ వివరాలు బయటపడ్డాయని వెల్లడించింది.
గాజాపై ఇజ్రాయెల్ రాకెట్ దాడి
టెల్ అవీవ్: గాజా ప్రాంతంలో ఉన్న ఓ రాకెట్ తయారీ కేంద్రంపై వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్య వర్గాలు గురువారం ప్రకటించాయి. హమాస్ దళాల ఆధ్వర్యంలో ఉన్న ఆ తయారీ కేంద్రంలో పలు రసాయనాలు ఉన్నాయని తెలిపింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగిందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. పాలస్తీనా ఖైదీల పట్ల మరింత కఠినంగా ఉంటామని ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతకు కొన్ని గంటల ముందు పాలస్తీనా మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్‌ను గగనతలంలోనే నిలువరించామని ఇజ్రాయెల్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.