అమెరికా గగనతలంలో చైనా గూఢచర్య బెలూన్‌

చైనాకు చెందిన ఓ గూఢచర్య బెలూన్‌ను తమ గగనతలంలో గుర్తించినట్లు అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ గురువారం ప్రకటించింది. మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్‌ విమానాల కన్నా ఎత్తులో ప్రయాణిస్తోందని వెల్లడించింది.

Updated : 04 Feb 2023 04:23 IST

గాలుల వల్ల దారి తప్పిందన్న డ్రాగన్‌
బీజింగ్‌ పర్యటన రద్దు చేసుకున్న ఆంటోనీ బ్లింకన్‌

వాషింగ్టన్‌: చైనాకు చెందిన ఓ గూఢచర్య బెలూన్‌ను తమ గగనతలంలో గుర్తించినట్లు అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ గురువారం ప్రకటించింది. మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్‌ విమానాల కన్నా ఎత్తులో ప్రయాణిస్తోందని వెల్లడించింది. ఈ విషయాన్ని పలు మార్గాల ద్వారా చైనా దృష్టికి తీసుకెళ్లినట్లు అమెరికా తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని గంటల్లో చైనాకు బయలుదేరాల్సి ఉన్న విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకన్‌ తన పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉత్తర అమెరికాలో రాష్ట్రాల్లో భద్రతాపరంగా సున్నితమైన స్థావరాల మీదుగా ప్రయాణిస్తున్న ఈ బెలూన్‌ను కొన్ని రోజులుగా అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది.

అణు క్షిపణి ప్రయోగ కేంద్రంపై నిఘా!

గురువారం ఈ బెలూన్‌ అణు క్షిపణుల ప్రయోగ కేంద్రం ఉన్న మోంటానా రాష్ట్ర గగనతలంలో ఉండటంతో అమెరికా అప్రమత్తమయింది. దాడి చేసి కూల్చేస్తే ఆ శకలాలు ప్రజలపై పడే అవకాశం ఉండడంతో ఆ ఆలోచనను అధికారులు పక్కనపెట్టారు. ఈ రకమైన బెలూన్ల వల్ల ఇప్పటి రోజుల్లో సమాచార చౌర్యానికి పెద్దగా అవకాశం లేకపోయినప్పటికీ చైనా దీనిని ఎందుకు పంపించి ఉంటుందోనని నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు. ఈ బెలూన్‌ను తాము ట్రాక్‌ చేస్తున్నామని, అమెరికాతో కలిసి పనిచేస్తామని కెనడా పేర్కొంది.

వాతావరణ సర్వే కోసమే: చైనా

ఈ వివాదంపై చైనా తన స్పందనను వెలువరించింది. ఆ బెలూన్‌ ఒక ‘పౌర గగననౌక’ అని తెలిపింది. వాతావరణ పరిశోధనల కోసం దానిని తామే ప్రయోగించామని స్పష్టం చేసింది. గాలుల ప్రభావంతో పాటు, స్వయంచోదక సామర్థ్యం పరిమితంగా ఉండటం వల్ల దశ తప్పి అమెరికా గగనతలంలోకి పొరపాటున వచ్చిందని వివరించింది. ఈ ఘటనపై చింతిస్తున్నట్లు చైనా పేర్కొంది. అయితే ఈ స్పందనతో అమెరికా సంతృప్తి చెందలేదు. మరింత సమగ్రమైన వివరణ కోసం అగ్రరాజ్యం పట్టుపడుతోంది.

గూఢచర్య బెలూన్‌ అంటే..

ఓ పెద్ద బెలూన్‌కు సౌర శక్తితో పనిచేసే కెమెరా, రాడార్‌ లాంటి పరికరాలను బిగించి పక్క దేశాల మీదకి గూఢచర్యానికి పంపిస్తే దానినే స్పై బెలూన్‌ అని వ్యవహరిస్తారు. ఇవి సుమారు 80 వేల నుంచి 1.20 లక్షల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. వీటిని నేరుగా నియంత్రించలేరు. అయితే లక్ష్యం వైపు వీస్తున్న గాలివాటుకు అనుగుణంగా బెలూన్‌ ఎత్తును మార్చడం ద్వారా దాని దిశను మార్చేందుకు ప్రయత్నిస్తారు.

శాటిలైట్‌లు ఉండగా బెలూన్‌ ఎందుకో..

గూఢచర్యంలో శాటిలైట్‌లకున్న సామర్థ్యం ముందు బెలూన్‌లు దిగదుడుపే. అయితే ఇప్పుడు స్పై శాటిలైట్‌లను గుర్తించి, కూల్చేసే సాంకేతికత అందుబాటులో ఉంది. శత్రు దేశం వీటిని గుర్తించి కూల్చేస్తే ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనికి భిన్నంగా బెలూన్‌ల ప్రయోగానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందుకే మళ్లీ వీటిపై ఆసక్తి పెరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని