హెచ్‌ 1బీ వీసాల తిరస్కరణలతో.. అమెరికా కంపెనీలకు సిబ్బంది కొరత

ఏటా 85,000 మంది విదేశీ నిపుణులకు మాత్రమే హెచ్‌ 1బీ వీసాలు మంజూరవుతున్నందున అమెరికన్‌ కంపెనీల సిబ్బంది అవసరాలు తీరడం లేదని ఒక అధ్యయనం తెలిపింది.

Published : 04 Feb 2023 07:59 IST

వాషింగ్టన్‌: ఏటా 85,000 మంది విదేశీ నిపుణులకు మాత్రమే హెచ్‌ 1బీ వీసాలు మంజూరవుతున్నందున అమెరికన్‌ కంపెనీల సిబ్బంది అవసరాలు తీరడం లేదని ఒక అధ్యయనం తెలిపింది. నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ (ఎన్‌.ఎఫ్‌.ఎ.పి.) సంస్థ నిర్వహించిన అధ్యయనమిది. గతేడాది ఏప్రిల్‌లో అమెరికా కంపెనీలు 4,83,000 హెచ్‌ 1బీ వీసా దరఖాస్తులు సమర్పించగా.. వాటిలో 85,000 దరఖాస్తులకు వీసాలు లభించాయి. విదేశీ నిపుణులు అమెరికాలో వైద్యం, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ రంగాల్లో ఆరేళ్లపాటు పనిచేయడానికి హెచ్‌ 1బీ వీసా వీలు కల్పిస్తుంది. ఆరేళ్ల తరవాత శాశ్వత నివాసం కింద గ్రీన్‌కార్డులు పొందడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అమెరికా విశ్వవిద్యాలయాల్లో కంప్యూటర్‌, ఇన్ఫర్మేషన్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు అభ్యసిస్తున్నవారిలో 70 శాతం మందికి పైగా విదేశీ విద్యార్థులే. వారిలోనూ భారత్‌, చైనా విద్యార్థులే ఎక్కువ. ఏటా మంజూరయ్యే 85,000 హెచ్‌ 1బీ వీసాల్లో 20 వేల వీసాలను అమెరికాలో విద్యాభ్యాసం చేసిన విదేశీ విద్యార్థులకు కేటాయిస్తారు. అమెరికా కార్మిక బలగం 16.5 కోట్లు కాగా, వారిలో హెచ్‌ 1బీ వీసాదారుల సంఖ్య కేవలం 0.05 శాతం. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం అమెరికాకు విదేశీ నిపుణులు, సాధారణ కార్మికుల వలసలను వ్యతిరేకించినందున హెచ్‌ 1బీ వీసాËల్లో అత్యధికం తిరస్కరణకు గురయ్యేవి. దీనివల్ల నిపుణుల కొరత ఏర్పడి అమెరికన్‌ కంపెనీలు తమ పనులను, సిబ్బందిని విదేశాలకు తరలించడం ఎక్కువైంది.  

టెక్‌ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించడం హెచ్‌ 1బీ వీసాదారులను ఇబ్బంది పెడుతోంది. అయితే, వారిలో 79 శాతం మందికి మూడు నెలల్లోనే కొత్త ఉద్యోగం లభిస్తోంది. ప్రతి 10 మందిలో నలుగురు నెల రోజుల్లోనే కొత్త ఉద్యోగం సాధించగలుగుతున్నారని జిప్‌ రిక్రూటర్‌ సంస్థ సర్వేలో తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని