పాక్‌లో ఆందోళనకరంగా విదేశీ మారక నిల్వలు

పొరుగు దేశం పాకిస్థాన్‌ నిధుల కొరతతో అల్లాడుతోంది. ఆ దేశంలో విదేశీ మారకపు నిల్వలు భారీగా క్షీణించి 10 ఏళ్ల కనిష్ఠానికి చేరాయి.

Published : 04 Feb 2023 04:58 IST

3.09 బిలియన్‌ డాలర్లకు పరిమితం
మూడు వారాల దిగుమతులకే సరిపోతాయని అంచనా

కరాచీ: పొరుగు దేశం పాకిస్థాన్‌ నిధుల కొరతతో అల్లాడుతోంది. ఆ దేశంలో విదేశీ మారకపు నిల్వలు భారీగా క్షీణించి 10 ఏళ్ల కనిష్ఠానికి చేరాయి. గత బుధవారం నాటికి అవి 16.1 శాతం క్షీణించి 3.09 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ఆ దేశ కేంద్ర బ్యాంక్‌ తెలిపింది. ఈ నిల్వలు కేవలం మూడు వారాల దిగుమతులకే సరిపోతాయని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రుణ చెల్లింపుల వల్ల 592 మిలియన్‌ డాలర్ల విదేశీ మారకపు నిల్వలు క్షీణించినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది. ప్రస్తుతం దేశ కమర్షియల్‌ బ్యాంకుల వద్ద ఉన్న 5.65 బిలియన్‌ డాలర్లతో కలుపుకొంటే మొత్తం విదేశీ మారకపు నిల్వలు 8.74 బిలియన్‌ డాలర్లు పాక్‌ వద్ద ఉన్నాయని వివరించింది. మరోవైపు, నగదు కొరతతో అల్లాడుతున్న పాకిస్థాన్‌ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి నిధులు పొందేందుకు నానా తంటాలు పడుతోంది. ఒకసారి 7 బిలియన్‌ డాలర్ల బెయిలవుట్‌ ప్యాకేజీ మంజూరైతే.. ఇతర వేదికల నుంచి, స్నేహ పూర్వక దేశాల నుంచి నిధులు పొందేందుకు పాక్‌కు వీలవుతుంది. ఇప్పటికే నిధుల విడుదలకు ఐఎంఎఫ్‌ కొన్ని షరతులు విధించింది. చమురు సబ్సిడీల్లో కోత పెట్టాలని, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా మారకపు విలువను సవరించాలని సూచించింది.

ఈ రెండింటికీ ఇప్పటికే పాక్‌ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. చమురు ధరలను ఏకంగా 16 శాతం మేర పెంచింది. రూపాయి మారకంపై ఉన్న పరిమితిని తొలగించింది. దీంతో ప్రస్తుతం ఇంటర్‌ బ్యాంక్‌ మార్కెట్‌లో పాక్‌ రూపాయి విలువ 270 వద్ద ట్రేడవుతోంది.


ఐఎంఎఫ్‌ షరతులకు తలొగ్గాల్సిందే: షరీఫ్‌

విదేశీ మారక ద్రవ్యం కొరత నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి పెట్టే షరతులను అంగీకరించాల్సి వస్తోందని స్వయాన ప్రధాన మంత్రి షెహ్‌బాజ్‌ షరీఫ్‌ వెల్లడించారు. ‘పూర్తి వివరాల్లోకి వెళ్లదల్చుకోలేదు. కానీ దేశంలో ఆర్థిక సవాళ్లు ఊహకందని విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్‌ విధించిన ఆచరణ సాధ్యంకాని షరతులను అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని షరీఫ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని