సంక్షిప్త వార్తలు (5)

గురుడి కక్ష్యలో మరో 12 కొత్త చందమామలను ఖగోళశాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఆ గ్రహం వద్ద ఉన్న సహజ ఉపగ్రహాల సంఖ్య రికార్డు స్థాయిలో 92కు చేరింది.

Updated : 05 Feb 2023 06:18 IST

గురుగ్రహ కక్ష్యలో మరో 12 చందమామలు

కేప్‌ కెనావెరాల్‌: గురుడి కక్ష్యలో మరో 12 కొత్త చందమామలను ఖగోళశాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఆ గ్రహం వద్ద ఉన్న సహజ ఉపగ్రహాల సంఖ్య రికార్డు స్థాయిలో 92కు చేరింది. చందమామల సంఖ్య విషయంలో సౌర కుటుంబంలో ఇప్పటివరకూ శనిదే ఆధిపత్యం. ఆ గ్రహం చుట్టూ 83 సహజ ఉపగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు గురుడిదే ఆధిపత్యం. హవాయ్‌, చిలీలోని టెలిస్కోపుల సాయంతో వీటిని గుర్తించారు. కొత్తగా గుర్తించిన చందమామలు 1- 3 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉన్నాయి. భవిష్యత్‌లో మరింత నిశితంగా వీటిని చిత్రీకరిస్తామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఉపగ్రహాల సంఖ్య మరింత పెరగొచ్చని పేర్కొన్నారు. సౌర కుటుంబంలో యురేనస్‌కు 27, అంగారకుడికి రెండు, భూమికి ఒకటి చొప్పున చందమామలు ఉన్నాయి. శుక్రుడు, బుధుడి చుట్టూ సహజ ఉపగ్రహాలు లేవు.


చైనాతో సంధికి ఆసియాన్‌ సుముఖం

జకార్తా: దక్షిణ చైనా సముద్రంలో సంఘర్షణలు నివారించే ఒప్పందంపై చైనాతో సంప్రదింపులు కొనసాగించాలని ఆగ్నేయాసియా దేశాల విదేశాంగ మంత్రులు శనివారం తీర్మానించారు. ఇండోనేసియా అధ్యక్షతన ఈ ఏడాది ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్‌) సమావేశాలు నిర్వహిస్తున్నారు. చైనా-ఆసియాన్‌ ఒప్పందం ఖరారుకు మార్చి నుంచి పలు దఫాలు చర్చలు జరపబోతున్నామని ఇండోనేసియా విదేశాంగ మంత్రి రత్నో మార్సుడి చెప్పారు. ఆసియా దేశాల వివాదాల్లో అమెరికా తల దూర్చుతోందని చైనా తరచూ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియాన్‌ చైనాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపడం విశేషం. దక్షిణ చైనా సముద్రంలో దీవుల్లాంటి ఆరు ఇసుక దిబ్బలపై చైనా రన్‌వేలు నిర్మించి, ఆయుధాలు మోహరించడాన్ని వియత్నాం వ్యతిరేకిస్తోంది. ఆసియాన్‌లో వియత్నాంకు సహ సభ్య దేశాలైన లావోస్‌, కంబోడియాలు మాత్రం చైనాపై ఘాటు విమర్శలు చేయకూడదంటున్నాయి. అవి రెండూ బీజింగ్‌ మిత్రదేశాలు. దక్షిణ చైనా సముద్రమంతా తనకే చెందుతుందని చైనా చేస్తున్న వాదనను ఇండోనేసియా ఇంతవరకు ఖండించకపోయినా, సముద్రంలోని తన ప్రత్యేక ఆర్థిక మండలంలో కొంత భాగంపై చైనా కన్ను వేయడంపై రుసరుసలాడుతోంది.


గూడ్స్‌ రైలు పట్టాలు తప్పి భారీ అగ్నిప్రమాదం

ఈస్ట్‌ పాలస్తీన్‌ (అమెరికా): ఒహాయో రాష్ట్రంలోని ఈస్ట్‌ పాలస్తీన్‌ గ్రామం వద్ద శుక్రవారం రాత్రి ఓ రైలు పట్టాలు తప్పి భారీ అగ్నిప్రమాదానికి దారి తీసింది. అటు పెన్సిల్వేనియా రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో స్థానికులు అందరినీ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఆ ప్రాంతమంతా పొగలు, నారింజ రంగులో మంటలు వ్యాపించాయి. 50 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదానికి కారణం ఏమిటన్నది తక్షణం తెలియరాలేదు. ఎవరూ గాయపడినట్లు కూడా సమాచారం లేదు. ఈ రైలు మాడిసన్‌, ఇల్లినాయి నుంచి పెన్సిల్వేనియాలోని కాన్వేకు వివిధ రకాల సరకులు తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మంటలను ఆర్పే కార్యక్రమం శనివారం రోజంతా కొనసాగింది.


పాక్‌లో వికీపీడియాపై నిషేధం

ఇస్లామాబాద్‌: అంతర్జాలంలో సమాచారాన్ని అందించే వికీపీడియా సేవలపై పాకిస్థాన్‌లో నిషేధం విధించారు. దైవ దూషణలకు సంబంధించిన అభ్యంతరకర సమాచారం తొలగించాలని దేశ టెలికం అథారిటీ(పీటీఏ) తాఖీదులు జారీ చేసి, గతంలో 48 గంటల పాటు సేవలను నిలిపివేసింది. అప్పటికీ వికీపీడియా స్పందించకపోవడంతో తాజాగా నిషేధం వేటు వేసినట్లు పీటీఏ అధికార ప్రతినిధి మలహత్‌ ఒబాద్‌ శనివారం తెలిపారు. వికిపీడియా స్పందనను అనుసరించి తమ నిర్ణయాన్ని సమీక్షిస్తామని పేర్కొన్నారు.


సైన్యం, న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష

నూతన బిల్లు సిద్ధంచేసిన పాక్‌

ఇస్లామాబాద్‌: సైన్యం, న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, అపహాస్యం చేసేలా ప్రవర్తించినా ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా లేదా రెండు శిక్షలూ ఏకకాలంలో విధించేలా పాక్‌ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. న్యాయ శాఖ ఇప్పటికే ఈ బిల్లును సిద్ధం చేసినట్లు డాన్‌ పత్రిక పేర్కొంది. నిందితుడ్ని వారెంట్‌ లేకుండా అరెస్టు చేయవచ్చని దీనిని నాన్‌ బెయిలబుల్‌ నేరంగా పరిగణించాలని బిల్లులో పొందుపరిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని