మరో గూఢచర్య బెలూన్‌ని గుర్తించిన అమెరికా

లాటిన్‌ అమెరికా ప్రాంతంలో ప్రయాణిస్తున్న మరో భారీ బెలూన్‌ను గుర్తించినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ శుక్రవారం రాత్రి ప్రకటించింది.

Published : 05 Feb 2023 04:12 IST

లాటిన్‌ అమెరికా గగనతలంలో ఉన్నట్లు వెల్లడి
బ్లింకన్‌ పర్యటన గురించి తెలియదన్న డ్రాగన్‌

వాషింగ్టన్‌: లాటిన్‌ అమెరికా ప్రాంతంలో ప్రయాణిస్తున్న మరో భారీ బెలూన్‌ను గుర్తించినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఇది వరకే మోంటానో రాష్ట్రంలో ఒక బెలూన్‌ను గుర్తించగా తాజాగా మరో బెలూన్‌ ఆచూకీ బయటపడడం గమనార్హం. ‘‘లాటిన్‌ అమెరికా గగనతలంలో ఓ బెలూన్‌ ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందింది. అది చైనాకు చెందిన మరో గూఢచర్య బెలూన్‌ అని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతానికి ఇంతకంటే సమాచారం లేదు’’ అని పెంటగాన్‌ మీడియా కార్యదర్శి బ్రిగేడియర్‌ జనరల్‌ ప్యాట్‌ రైడర్‌ వెల్లడించారు. మొదట గుర్తించిన చైనా బెలూన్‌ మరికొన్ని రోజుల పాటు అమెరికా గగనతలంలోనే ప్రయాణించే  అవకాశముందని రక్షణ శాఖ శుక్రవారం ప్రకటించింది. భారీపేలోడ్‌లతో ప్రయాణిస్తున్న ఆ బెలూన్‌ స్వయంచోదక వ్యవస్థ సరిగానే పనిచేస్తున్నట్లు భావిస్తున్నామని తెలిపింది. తూర్పు దిశగా వెళ్తున్న ఆ బెలూన్‌ను ట్రాక్‌ చేస్తున్నామని.. ఏం చేయాలనేదానిపై తమ ముందున్న మార్గాలను పరిశీలిస్తున్నామని వెల్లడించింది. ఈ బెలూన్‌ అలాస్కా మీదుగా యూఎస్‌ గగనతలంలోకి ప్రవేశించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

బయటకు పంపేయడమే ప్రథమ కర్తవ్యం

అమెరికా గగనతలంలో ఎగురుతున్న గూఢచర్య బెలూన్‌ను దేశ సరిహద్దుల ఆవలకు పంపించేయడమే తమ ప్రధాన కర్తవ్యమని విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకన్‌ శుక్రవారం ప్రకటించారు. చైనా వివరణపై స్పందిస్తూ.. తమ స్థానంలో చైనా ఉండి ఉంటే ఎలా స్పందించి ఉండేదో ఊహించగలనని విమర్శించారు. ఈ ఘటన తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లేనని ఆయన స్పష్టం చేశారు. చైనా పర్యటనను వాయిదా వేసుకోవడాన్ని ఆయన సమర్థించుకున్నారు.

పర్యటన గురించి చర్చలే జరగలేదు: చైనా

బెలూన్‌ ఘటన నేపథ్యంలో ఆంటొనీ బ్లింకన్‌ తన చైనా పర్యటనను వాయిదా వేసుకోడాన్ని డ్రాగన్‌ తేలిగ్గా తీసుకుంది. ఆ పర్యటనకు సంబంధించి ఇరు దేశాల మధ్యా అసలు చర్చలే జరగలేదని శనివారం ఉదయం స్పష్టం చేసింది. అమెరికా ఏమైనా ప్రకటించి ఉంటే అది వారి సమస్యని, తమకు తెలియదని కుండబద్దలు కొట్టింది. బెలూన్‌ ఘటన అనుకోకుండా జరిగిందేనని మరోసారి స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని