అధ్యక్ష పదవికి బైడెన్‌ మళ్లీ పోటీ?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేయనున్నట్లు సంకేతాలు వదిలారు.

Updated : 05 Feb 2023 07:46 IST

ఫిలడెల్ఫియా: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేయనున్నట్లు సంకేతాలు వదిలారు. అమెరికాలో ఉద్యోగాలు భారీగా పెరిగాయంటూ వార్షిక నివేదిక వెలువడిన నేపథ్యంలో ఇక్కడ శుక్రవారం జరిగిన పాలక డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ సమావేశంలో  ప్రసంగిస్తూ తన ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని పేర్కొన్నారు. శుద్ధి చేసిన తాగునీటి సరఫరాతో సహా అనేక మౌలిక వసతుల నిర్మాణాన్ని పూర్తిచేసి, ఆరోగ్య సేవలను మెరుగుపరచి, హరిత సాంకేతికతలపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టామని ఉద్ఘాటించారు. ‘ఇప్పుడు మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకొంటున్నాను. మీరు నాకు అండగా ఉన్నారా? ’ అని బైడెన్‌ దరహాస వదనంతో ప్రశ్నించగానే, పార్టీ ప్రతినిధులు ‘మరో నాలుగేళ్లు, మరో నాలుగేళ్లు’ అంటూ నినదించారు. అమెరికా అధ్యక్ష పదవీ కాల పరిమితి నాలుగేళ్లు. ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ తరఫున తాను పోటీచేయాలనుకొంటున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించగా, అదే పార్టీకి చెందిన ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌ కూడా బరిలో దిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున 2024లో అధ్యక్ష అభ్యర్థుల ఎంపికకు వచ్చే ఏడాది పార్టీలో ప్రైమరీ ఎన్నికలు జరుగుతాయి. మరొక రోజులో ఆ ఎన్నికల తేదీలను ప్రకటించబోతున్నారు. దానికి ముందే అధ్యక్ష బరిలో తాను ఉంటానంటూ బైడెన్‌ సంకేతాలు వదలడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు