సంక్షిప్త వార్తలు(7)

అమెరికాలోని పశ్చిమ న్యూయార్క్‌ను సోమవారం ఉదయం స్వల్పస్థాయి భూకంపం కుదిపేసింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 3.8గా నమోదైంది.

Updated : 07 Feb 2023 06:04 IST

పశ్చిమ న్యూయార్క్‌లో భూప్రకంపనలు

బఫెలో: అమెరికాలోని పశ్చిమ న్యూయార్క్‌ను సోమవారం ఉదయం స్వల్పస్థాయి భూకంపం కుదిపేసింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 3.8గా నమోదైంది. బఫెలో నగరంలోని వెస్ట్‌ సెనెకా శివారు ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గత 40 ఏళ్లలో ప్రాంతీయంగా అత్యంత శక్తిమంతమైన భూకంపం ఇదేనని అధికారులు తెలిపారు. తాజా ప్రకంపన వల్ల ఆస్తి, ప్రాణ నష్టమేమీ జరగలేదని అధికారులు చెప్పారు.


100 శాతం భూమిలో కలిసిపోయే కాగితపు స్ట్రాలు

సియోల్‌: ప్రస్తుతం వాడుకలో ఉన్న కాగితపు స్ట్రాలతో పోలిస్తే 100 శాతం భూమిలో కలిసిపోయే పర్యావరణహిత కాగితపు స్ట్రాలను రూపొందించినట్లు కొరియా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ పరిశోధకులు ప్రకటించారు. అడ్వాన్స్‌డ్‌ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన వివరాల ప్రకారం.. భారీ ఎత్తున ఉత్పత్తి చేయడానికి అనువుగా ఉండే ఈ స్ట్రాలను పూర్తిగా కాగితంతోనే శాస్త్రవేత్తలు తయారుచేశారు. అయితే కార్బొనేటెడ్‌ పానీయాల్లో ఈ స్ట్రాలు నానిపోకుండా భూమిలో త్వరగా కలిసిపోయే ప్లాస్టిక్‌ (పాలీబ్యుటైలీన్‌ సక్సినేట్‌)తో వాటికి ఒక పూత పూస్తున్నామని వివరించారు. ఇందులో ఉపయోగించే సెల్యులోజ్‌ నానోక్రిస్టల్స్‌ ఆ పూతను పట్టి ఉంచుతాయన్నారు. ఈ పర్యావరణహిత స్ట్రాలు భూమిలోనూ, సముద్రాల్లోనూ త్వరగా కలిసిపోతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.


ఆ దాడి నుంచి తప్పించుకున్న అదృష్టవంతుడ్ని

న్యూయార్క్‌ ఘటనపై తొలిసారి స్పందించిన సల్మాన్‌ రష్దీ

లండన్‌: గత సంవత్సరం క్రూరమైన దాడి నుంచి తప్పించుకున్నందుకు అదృష్టంగా భావిస్తున్నానని బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీ సోమవారం వ్యాఖ్యానించారు. గత ఏడాది ఆగస్టులో న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆయనపై కొందరు దుండగలు దాడి చేశారు. ‘ది న్యూయార్క్‌ర్‌’ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాడిపై ఆయన తొలిసారి స్పందించారు. ‘‘నేను చాలా అదృష్టవంతుడ్ని. నాకు అండగా నిలిచిన నా కుటుంబానికి కృతజ్ఞత. ఇప్పుడు లేచి నిలబడగలుగుతున్నాను. నడుస్తున్నాను. అయితే నా శరీరంపై నిరంతర పర్యవేక్షణ అవసరం’’ అన్నారు. ఆయనను హత్య చేయాలని ఆదేశించిన అయతొల్లా ఖొమిని వ్యాఖ్యాల గురించి అడిగిన ప్రశ్నకు.. ‘‘నాకు నేను ఆ ప్రశ్న వేసుకుంటున్నాను. మరో 20 ఏళ్ల ఆయుష్షు ఉండటం నా తప్పా. ‘ది సాన్‌టానిక్‌ వర్సెర్‌’ నా అయిదో పుస్తకం. విక్టోరి సిటీ అనేది నా ఇరవైఒకటో పుస్తకం. నా హత్య జరిగిన తర్వాత ప్రజలు ఎలా స్పందిస్తారో నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. రేపు ఏం జరుగబోతుందనేదాని కంటే నిన్న ఏం జరిగిందనేది ముఖ్యం. విజయనగర రాజులు తాము చంద్రుని నుంచి దిగివచ్చినట్లు చెప్పుకొన్నారు. నేనూ అచిల్స్‌(దేవ కుటుంబం) నుంచి వచ్చిన వ్యక్తినేనని చెప్పుకొంటాను’’ అని బదులిచ్చారు.


ఇజ్రాయెల్‌ బలగాల కాల్పుల్లో ఐదుగురు పాలస్తీనా ముష్కరుల హతం

అకాబత్‌ జబ్ర్‌: ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతంలోని శరణార్థి శిబిరంపై సోమవారం జరిగిన దాడిలో ఇజ్రాయెల్‌ దళాలు ఐదుగురు పాలస్తీనా ముష్కరులను హతమార్చాయి. తాజా ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉంది. పాలస్తీనా అధ్యక్షుడి కార్యాలయం ఈ ఘటనను ఖండించింది. దీన్ని హింసను ప్రేరేపించే నేరంగా అభివర్ణించింది. ఇజ్రాయెల్‌ చొరబాట్లను ఆపేలా అమెరికా చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే వెస్ట్‌బ్యాంక్‌ యూదుల సెటిల్‌మెంట్‌లోని ఓ రెస్టారెంట్‌పై కాల్పులు జరిపిన ముష్కర ముఠాను పట్టుకొనేందుకే ఈ దాడి చేసినట్లు సైన్యం వెల్లడించింది. 1967లో జరిగిన యుద్ధంలో వెస్ట్‌బ్యాంక్‌, గాజా స్ట్రిప్‌, తూర్పు జెరూసలేంలను ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకుంది. తిరిగి ఆ భూభాగాలు తమకు అప్పగించాలని పాలస్తీనీయులు డిమాండ్‌చేస్తున్నారు.


హార్వడ్‌ లా రివ్యూ అధ్యక్షురాలిగా అప్సర అయ్యర్‌

న్యూయార్క్‌: అమెరికాలోని హార్వడ్‌ లా స్కూల్‌లో భాగమైన హార్వడ్‌ లా రివ్యూ అధ్యక్షురాలిగా భారతీయ- అమెరికన్‌ మహిళ అప్సర అయ్యర్‌ సోమవారం ఎన్నికయ్యారు. విద్యార్థులు నిర్వహించే చట్టపరమైన స్కాలర్‌షిప్‌(జర్నల్‌) ప్రచురణ విభాగం ఇది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, సుప్రీంకోర్టు జస్టిస్‌ రుత్‌ బదేర్‌ గిన్స్‌బర్గ్‌ సైతం గతంలో దీనికి అధ్యక్షులుగా వ్యవహరించారు. ‘‘కథనాలను ఎంచుకోవడంలో మరింత మంది సంపాదకులను చేర్చుతాం. పూర్తిగా పారదర్శకంగా దీన్ని నిర్వహిస్తాను’’ అని అయ్యర్‌ అన్నారు. 2016లో యేల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అయ్యర్‌.. ఆర్థిక శాస్త్రం, మ్యాథ్స్‌, స్పానిష్‌లో డిగ్రీ పట్టా పొందారు. ప్రస్తుతం హార్వడ్‌ స్కూల్‌లో రెండో ఏడాది లా చదువుతున్నారు.


కల్లోల ప్రాంతాల్లో సగటు ఆయుర్దాయానికి కోత

లండన్‌: శాంతియుత పరిస్థితులున్న దేశాలతో పోలిస్తే హింస ఎక్కువగా ఉన్న చోట్ల యువత సగటు ఆయుర్దాయం 14 ఏళ్ల మేర తక్కువగా ఉండొచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. హింసతో ప్రత్యక్ష సంబంధం లేనివారిపైనా ఈ ప్రభావం ఉంటుందని వెల్లడైంది. 2008 నుంచి 2017 మధ్య 162 దేశాల్లో మరణాల డేటా, అంతర్గత శాంతి సూచీ వంటి వివరాలను విశ్లేషించిన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. ఎల్‌ సాల్వడార్‌, హోండురస్‌, గ్వాటెమలా, కొలంబియాల్లో సగటు ఆయుర్దాయం తక్కువగా ఉండటానికి కారణం.. ఆయా చోట్ల హత్యలు ఎక్కువగా జరగడమేనని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో ఘర్షణల్లో చిక్కుకొని చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం వల్ల సగటు ఆయుర్దాయం తగ్గిపోతోందని తెలిపారు. లాటిన్‌ అమెరికాలో హత్యలు, వ్యక్తుల మధ్య ఘర్షణలు ఈ పరిస్థితికి దారితీస్తున్నట్లు చెప్పారు. హింస వల్ల పురుషులు ప్రత్యక్షంగా ప్రభావానికి గురవుతుండగా.. మహిళలు పరోక్షంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనివల్ల వారిలో దుర్బలత పెరిగి, అంతిమంగా మరణం ముప్పును ఎదుర్కొంటున్నారని తెలిపారు.


సామాన్యులపై అదనపు భారం వద్దు

ప్రయాణికులు నచ్చిన సీట్లను ఎంచుకునేందుకూ కొన్ని విమానయాన సంస్థలు అదనపు రుసుము వసూలు చేస్తున్నాయి. తమ పిల్లల పక్కన కూర్చోవాలనుకొనే తల్లిదండ్రులపైనా ఈ భారాన్ని మోపుతున్నాయి. ఇలాంటి ప్రత్యేక ఛార్జీలను అడ్డుకునేందుకు ‘జంక్‌ ఫీ ప్రొటెక్షన్‌ యాక్ట్‌’ను కాంగ్రెస్‌ ఆమోదించాలి. ఇది అమల్లోకి వస్తేనే.. ఇంటర్నెట్‌, కేబుల్‌ టీవీ, మొబైల్‌ ఫోన్‌ లాంటి సేవలందించే సంస్థల ప్యాకేజీలను వినియోగదారులు గడువు కన్నా ముందే మార్చుకోవడానికి ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు.      

బైడెన్‌


దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు లేదు

భారత్‌లో ఇటీవలి పరిణామాలను చూశాక దేశ ఆర్థిక రంగానికి వ్యవస్థాగత ముప్పు ఉందని నేను భావించడం లేదు. అయితే పెద్ద కార్పొరేట్‌ సంస్థలు రుణాల కోసం విదేశీ వనరుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి.  

ఉదయ్‌ కోటక్‌


పాత్రికేయులను కాపాడుకోవాలి

పత్రికా స్వేచ్ఛను ఉపయోగించి సత్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు. వారు సమాజానికి కీలకం. పాత్రికేయులపై ప్రపంచవ్యాప్తంగా దాడులు పెరిగిపోయాయి. వారిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.          

యునెస్కో


వాటితోనే అర్థవంతమైన జీవితం

దైనందిన జీవితంలో మనం ఇతరులతో నడిపే వ్యవహారాలన్నింటిలో నిజాయతీగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. అర్థవంతమైన జీవితమనేది నైతిక సమగ్రత, నిజాయతీల మీద ఆధారపడి ఉంటుంది. వాటికి కట్టుబడి ఉన్నవారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు.

దలైలామా


చిత్ర వార్త


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు