మానవాళిని వణికించిన పెను భూకంపాలు

భారీ ఎత్తున ప్రాణనష్టాన్ని మిగిల్చిన పెనుభూకంపాలు ప్రపంచ చరిత్రలో చాలానే ఉన్నాయి. రికార్డుల్లో అధికారికంగా నమోదై పెను విధ్వంసం సృష్టించిన కొన్ని భూకంపాల వివరాలివీ...

Updated : 07 Feb 2023 05:43 IST

భారీ ఎత్తున ప్రాణనష్టాన్ని మిగిల్చిన పెనుభూకంపాలు ప్రపంచ చరిత్రలో చాలానే ఉన్నాయి. రికార్డుల్లో అధికారికంగా నమోదై పెను విధ్వంసం సృష్టించిన కొన్ని భూకంపాల వివరాలివీ...

చరిత్రలోనే అతి పెద్ద భూకంపం

1960 మే 22న చిలీలోని వాల్ద్వియా ప్రాంతంలో 9.5 తీవ్రతతో భూమి ఏకంగా 10 నిమిషాల పాటు కంపించింది. రికార్డుల్లో నమోదైన భూకంపాల్లో ఇదే అతిపెద్దది. భూకంప ప్రభావంతో సముద్రంలో ఎద్ద ఎత్తున ఏర్పడ్డ రాకాసి అలలు దక్షిణ చిలీ, హవాయి, జపాన్‌, ఫిలిప్పీన్స్‌, తూర్పు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తీరాలను తాకాయి. ఈ ఘటనల్లో 1655 మంది మరణించగా 3000 మంది గాయాలపాలయ్యారు. దాదాపు నాలుగు బిలియన్‌ డాలర్ల ఆస్తినష్టం చోటు చేసుకొంది.

పండగరోజున విషాదం..

1964 మార్చి 28న గుడ్‌ఫ్రైడే. అమెరికాలోని అలాస్కా ప్రజలంతా సెలవును ఆనందంగా గడుపుతున్న వేళ భారీ భూకంపం కుదిపేసింది. భూకంప లేఖినిపై 9.2 తీవ్రతతో 4.38 నిమిషాలు భూమి కంపించింది. ఇప్పటి వరకు నమోదైన భూకంపాల్లో రెండో అతిపెద్దది. చాలా చోట్ల భూమి చీలిపోయింది. ఇళ్లు, ఇతర నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. భూకంపానికి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ భూకంపం నుంచి పుట్టిన సునామీ అలల కారణంగా 131 మంది మరణించారు.

సుమత్ర భూకంపం ఓ పీడకల..

2004 డిసెంబర్‌ 26వ తేదీన ఇండోనేసియా సుమత్రా తీరంలోని సముద్ర ప్రాంతంలో 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై నమోదైన మూడో అతిపెద్ద భూకంపం ఇదే. ఈ భూకంపం నుంచి పుట్టిన అలలు 14 దేశాల తీరాలను అతలాకుతలం చేసి మొత్తం 2,27,898 మంది ప్రాణాలను బలిగొన్నాయి. మానవచరిత్ర చవిచూసిన అతిపెద్ద ఉపద్రవాల్లో ఇది కూడా ఒకటి. భూకంపం వచ్చిన రెండు గంటలకు రాకాసి అల ఒకటి భారత్‌లో అండమాన్‌-నికోబార్‌ దీవులు, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తీరాలను తాకింది. కేరళలో దీని ప్రభావం కనిపించింది. రెండు నుంచి ఐదు సునామీ అలలు తీరాలను తాకినట్లు రికార్డులు చెబుతున్నాయి.

2011లో జపాన్‌లో బీభత్సం

జపాన్‌ చరిత్రలో అతిపెద్ద భూకంపం 2011లో నమోదైంది. టొహోకు వద్ద 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో దాదాపు 40 మీటర్ల ఎత్తుతో భయంకరమైన సునామీ అలలు విరుచుకుపడ్డాయి. దాదాపు 15,500 మంది మరణించారు. ఈ ప్రమాదంలోనే ఫుకుషిమా అణు రియాక్టర్‌ ధ్వంసమై ప్రజలను బెంబేలెత్తించింది. అక్కడి 12 లక్షల టన్నుల రేడియోధార్మిక జలాలను దూరంగా ఉన్న ఓ ప్రదేశంలో ఏర్పాటు చేసిన వెయ్యి ట్యాంకుల్లోకి తరలించారు. ఈ జలాల్లో పెద్ద మొత్తంలో సీజియం, ట్రీటియం, కోబాల్ట్‌, కార్బన్‌-12 లాంటి రేడియోధార్మిక ఐసోటోప్‌లు ఉన్నాయి.

వెంటాడి ప్రాణాలు తీసిన రాకాసి అలలు

రష్యాకు చెందిన కమ్చట్కా ద్వీపకల్పంలో 1952లో 9 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఇది దాదాపు 18 మీటర్లున్న మూడు భారీ సునామీ అలలను పుట్టించింది. సెవెరే-కుర్లిస్క్‌ ప్రాంతంపై ఇవి పెను ప్రభావం చూపాయి. భూకంపం వచ్చిన వెంటనే ఇక్కడి ప్రజలు ప్రాణభయంతో సమీపంలోని కొండలపైకి పారిపోయి తొలి సునామీ అల నుంచి తప్పించుకొన్నారు. కానీ, వీరు తిరిగి ఇళ్లకు వచ్చాక రెండో సునామీ అల విరుచుకుపడడంతో ఇక్కడ నివసించే 6,000 మందిలో 2,336 మంది ప్రాణాలు కోల్పోయారు.

చిలీలోనే మరోసారి

చిలీలోని బియో-బియో ప్రాంతాన్ని 2010లో వచ్చిన భూకంపం భారీగా నష్టపరిచింది. 8.8 తీవ్రతతో వచ్చిన ఈ విపత్తు ధాటికి 521 మంది మరణించారు. సుమారు 80 లక్షల మంది తమ నివాసాల నుంచి తరలిపోవాల్సి వచ్చింది. వందల మంది గల్లంతవడంతో వారి ఆచూకీ తెలియకుండా పోయింది.

మరికొన్ని..

* 1906 జనవరి 31న 8.8 తీవ్రతతో ఈక్వెడార్‌ కోస్ట్‌ను భూకంపం అతలాకుతలం చేసింది. దీని ద్వారా ఏర్పడిన సునామీ వల్ల చిలీ, ఈక్వెడార్‌, కొలంబియా దేశాల్లో సుమారు 500 నుంచి 1500 మంది చనిపోయారని అంచనా

* అలాస్కాలోని రాట్‌ దీవుల్లో 8.7 తీవ్రతతో భూమి కంపించింది. 1965లో వచ్చిన ఈ విపత్తులో ప్రాణ నష్టం నమోదు కాలేదు.

* ఎక్కువగా భూకంపాలు, సునామీలు ఏర్పడే ఇండోనేసియాలో 2005 మార్చి 28న మరోసారి భూమి కంపించింది. 8.6 తీవ్రతతో వచ్చిన ఈ విపత్తు ధాటికి 1313 మంది ప్రాణాలు కోల్పోయారు.

* భారతదేశంలోని అస్సాం, టిబెట్‌లలో 8.6 తీవ్రతతో 1950 ఆగస్టు 15న వచ్చిన భూకంపం 780 మంది ప్రాణాలను బలిగొంది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని