Earthquake: నివాసాలే.. సమాధులై!
ఎటుచూసినా భవన శిథిలాల గుట్టలు. అంబులెన్సులు కదలడానికీ వీల్లేనంతగా అవరోధాలు. నిరంతరం భయపెడుతూ భూప్రకంపనలు.
తుర్కియే, సిరియా భారీ భూకంపంలో 7,200 దాటిన మరణాలు
ప్రాణనష్టం 20 వేల పైనే ఉండొచ్చన్న డబ్ల్యూహెచ్‌వో
రెండుగా చీలిపోయిన విమానాశ్రయ రన్‌వే
ఇస్కెన్‌డెరున్ ఓడరేవులో అగ్నికీలలు
కొనసాగుతున్న ప్రకంపనలతో సహాయక చర్యలకు అవాంతరం
గజగజలాడించే చలిలో నిరాశ్రయుల విలవిల
భారత్ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు, సహాయ సామగ్రి అంకారా
ఎటుచూసినా భవన శిథిలాల గుట్టలు. అంబులెన్సులు కదలడానికీ వీల్లేనంతగా అవరోధాలు. నిరంతరం భయపెడుతూ భూప్రకంపనలు. సున్నా కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలతో వెన్ను జలదరించే చలి. సమాచార వ్యవస్థ సహా ఏదీ అందుబాటులో లేని దుస్థితి. కాలూచేయీ కూడదీసుకుని భవన వ్యర్థాలను తొలగిస్తున్నకొద్దీ వెలుగుచూస్తున్న మృతదేహాలు.. స్థూలంగా ఇదీ తుర్కియే, దానిని ఆనుకుని ఉన్న సిరియాలో పెను భూకంపం అనంతరం నెలకొన్న హృదయవిదారక పరిస్థితి. సోమవారంనాటి ప్రకృతి విలయ తీవ్రతలో మృతిచెందినవారి సంఖ్య మంగళవారానికి 7,200 దాటిపోయింది. 20 వేల మందికి పైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేస్తోంది. పెను విషాదం అలముకున్న రెండు దేశాలకు సహాయపడేందుకు ప్రపంచ దేశాలు ఉదారంగా ముందుకు వస్తున్నాయి. వేలసంఖ్యలో నేలమట్టమైన భవంతుల్లో సజీవంగా ఎవరైనా ఉన్నారేమో తెలుసుకునేందుకు కాలంతో పోటీపడి సహాయక బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఒక్క తుర్కియేలోనే 6,000 భవంతులు కూలిపోయాయి. సహాయక చర్యల కోసం 25,000 మంది రంగంలోకి దిగినా ఏమూలకూ సరిపోవడం లేదు.
200లకు పైగా ప్రకంపనలు
భారీ భూకంపం తర్వాత చిన్నా, పెద్దా ప్రకంపనలు రెండు వందలకు పైగా సంభవించాయి. ఇవి సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారాయి. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బలహీనంగా మారిన భవనాలు కూలిపోయే ప్రమాదం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్క తుర్కియేలో ఇప్పటివరకు 5,400 మందికి పైగా మృతి చెందారనీ, 20వేల మంది గాయపడ్డారని అధికార వర్గాలు ప్రకటించాయి. విపత్తు నుంచి బయటపడినవారు కాంక్రీటు శిథిలాల కింద చిక్కుకున్న తమవారి కోసం రోదించడం కలచివేస్తోంది. ఆర్తనాదాలు, హాహాకారాలతో పరిస్థితులు గుండెలు పిండేలా మారాయి. హతయ్ ప్రావిన్సులో కుప్పకూలిన ఓ బహుళ అంతస్తుల భవన శిథిలాల నుంచి ఏడేళ్ల బాలికను సహాయక సిబ్బంది రక్షించి బయటకు తీశారు. ఆ వెంటనే ఆ బాలిక తన తల్లి గురించి ఆరాటంతో ప్రశ్నించడం అక్కడివారిని కదిలించింది. సైన్యం రంగంలో దిగి తాత్కాలిక శిబిరాలను, క్షేత్రస్థాయి ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. షాపింగ్ మాల్స్, స్టేడియాలు, మసీదులు, సామాజిక భవనాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు. ఇస్కెర్‌డెరున్‌లో ఆసుపత్రి కూలిపోవడంతో భూకంప బాధితులకు వైద్యం కోసం నౌకాదళ నౌకను సమీపంలోని రేవుకు పంపించారు.
కీలక పోర్టుకు భారీ నష్టం
తుర్కియే కీలక నగరం ఇసికందరన్‌లోని లిమాక్ పోర్టు భూకంపం దెబ్బకు తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ కంటైనర్లను ఉంచిన ప్రదేశంలో భారీగా అగ్నికీలలు ఎగసి పడ్డాయి. పలుచోట్ల విద్యుత్తు వ్యవస్థ, సహజవాయు పైపులైన్లు దెబ్బతిన్నాయి. అక్కుయు అణు విద్యుత్తు కేంద్రానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదని ప్రభుత్వం వెల్లడించింది. సిరియాలో ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాల్లో మృతుల సంఖ్య 800 దాటిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతాల్లో మరో 1000 మంది చనిపోయినట్లు, ఈ రెండు ప్రాంతాల్లో 3,600మంది గాయపడినట్లు అక్కడి వర్గాల సమాచారం.
ఆదుకుంటామన్న అమెరికా
నాటో కూటమి దేశమైన తుర్కియేకు అన్నివిధాలా సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు. సిరియా, తుర్కియేలకు సహాయక సామగ్రితో విమానాలు బుధవారం నుంచి ప్రతిరోజూ వెళ్తాయని పాకిస్థాన్ ప్రకటించింది. ఇంజినీర్లు, సైనికులు, వైద్య బృందాలు, సహాయక సామగ్రి, సుశిక్షిత జాగిలాలు.. ఇలా వివిధ రూపాల్లో సాయం అందించేందుకు గ్రీస్, దక్షిణకొరియా, బ్రిటన్, తైవాన్, స్విట్జర్లాండ్, జపాన్, లెబనాన్, జర్మనీ వంటి అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. ఈయూలోని 13 దేశాలు కూడా స్పందించాయి. రష్యా నుంచి అత్యవసర సేవల బృందాలు సిరియాకు వెళ్లాయి. తుర్కియేకూ సాయం అందిస్తామని రష్యా ప్రకటించింది. సిరియాతో దౌత్య సంబంధాలు లేని ఇజ్రాయిల్ కూడా మానవతాసాయం అందించేందుకు అంగీకరించింది.
తరలివెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు
దిల్లీ: కష్టంలో ఉన్న తుర్కియేను ఆదుకునేందుకు 101 మందితో ‘జాతీయ విపత్తు స్పందన దళం’ (ఎన్డీఆర్‌ఎఫ్) బృందాలు మంగళవారం సి-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక రవాణా విమానాల్లో బయల్దేరి వెళ్లాయి. వైద్య సేవలకు కావాల్సిన ఔషధాలు, శిథిలాలను తొలగించడానికి ఉపయోగడే పరికరాలు, సుశిక్షిత జాగిలాలు వంటివి వెంట తీసుకువెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గాజియాబాద్, కోల్‌కతాల నుంచి ఈ బృందాలు నాలుగు విమానాల్లో బయల్దేరాయి. స్థానిక యంత్రాంగానికి కావాల్సిన సాయాన్ని ఈ బృందాలు అందించేలా సమన్వయ ఏర్పాట్లు పూర్తిచేశారు. 30 పడకల ఆసుపత్రిని అక్కడ నెలకొల్పేలా ఎక్స్‌రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, కార్డియాక్ మోనిటర్లు వంటివి వైద్య బృందాలు తీసుకువెళ్లాయని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. భారత తక్షణ సాయానికి తుర్కియే కృతజ్ఞతలు తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
celebrity cricket league: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేత ‘తెలుగు వారియర్స్’
-
Movies News
Avatar 2 OTT Release Date: ఓటీటీలో అవతార్ 2.. ప్రీబుకింగ్ ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే!
-
Politics News
YSRCP: అన్నీ ఒట్టి మాటలేనా?.. వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ
-
Sports News
Ashwin: మాది బలమైన జట్టు..విమర్శలపై ఘాటుగా స్పందించిన అశ్విన్
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!
-
Movies News
Ram gopal varma: ఆర్జీవీ నా ఫస్ట్ ఆస్కార్ అన్న కీరవాణి.. వర్మ రిప్లై ఏంటో తెలుసా?