ముషారఫ్‌ అంత్యక్రియలు పూర్తి

బంధువులు, పలువురు సైనికాధికారుల సమక్షంలో పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ అంత్యక్రియలు కరాచీలోని ఆర్మీ కంటోన్మెంటు ప్రాంతంలో మంగళవారం జరిగాయి.

Published : 08 Feb 2023 04:50 IST

హాజరైన పలువురు సైనికాధికారులు

కరాచీ: బంధువులు, పలువురు సైనికాధికారుల సమక్షంలో పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ అంత్యక్రియలు కరాచీలోని ఆర్మీ కంటోన్మెంటు ప్రాంతంలో మంగళవారం జరిగాయి. అమైలాయిడోసిస్‌ అనే అరుదైన వ్యాధితో దుబాయ్‌లో ఆదివారం ఆయన మరణించిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్‌లోని గుల్‌మొహర్‌ పోలో మైదానంలో మధ్యాహ్నం 1.45 గంటలకు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ సాహిర్‌ శంషద్‌ మీర్జా, ఆర్మీ మాజీ చీఫ్‌లు జనరల్‌ కమర్‌ జావేద్‌ బాజ్వా, జనరల్‌ అష్ఫఖ్‌ పర్వేజ్‌ కయానీ, ఐఎస్‌ఐ మాజీ చీఫ్‌లు జనరల్‌ షుజా పాషా, జనరల్‌ జహీరుల్‌ ఇస్లామ్‌ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రస్తుత ప్రధాని, అధ్యక్షుడు మాత్రం హాజరుకాలేదు. ముషారఫ్‌ భార్య సబా, కుమారుడు బిలాల్‌, కుమార్తె, ఇతర బంధువులు కలిసి యూఏఈ అధికారులు ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని కరాచీకి తీసుకొచ్చారు. భారీ భద్రత నడుమ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కంటోన్మెంటు ప్రాంతానికి తరలించారు. అయితే ముషారఫ్‌ అంత్యక్రియల విషయంలో పార్లమెంటు ఎగువసభలో నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి. తాను సిరియా, తుర్కియే భూకంప మృతులకు నివాళులు అర్పిస్తాను తప్ప ముషారఫ్‌కు కాదని జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన ముష్తాక్‌ అహ్మద్‌ చెప్పడంతో గందరగోళం చెలరేగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని