సిరియాలో వైద్య సంక్షోభం

ఏళ్ల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధంతో ఛిన్నాభిన్నమైన సిరియాలో భూకంపం పెనువిధ్వంసం సృష్టించింది.

Published : 08 Feb 2023 04:50 IST

క్షతగాత్రులతో ఆసుపత్రులన్నీ కిటకిట  
ఔషధాలు, పరికరాలకు తీవ్ర కొరత  
నిస్సహాయ స్థితిలో వైద్యులు

డార్కుష్‌: ఏళ్ల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధంతో ఛిన్నాభిన్నమైన సిరియాలో భూకంపం పెనువిధ్వంసం సృష్టించింది. అరకొర వసతులతో బతుకులీడుస్తున్న ఆ దేశ ప్రజలను కట్టుబట్టలతో నడివీధుల్లోకి నెట్టివేసింది. కుప్పకూలిన ఇళ్లల్లో ఎందరో మృతి చెందగా...తీవ్రంగా గాయపడిన వారితో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి చికిత్సలు అందించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణాధార వ్యవస్థలు, కీలకమైన పరికరాలతో పాటు అవసరమైనన్ని ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో వారూ నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. అంతర్జాతీయ సమాజం చేయూత కోసం ఎదురు చూడడం మినహా తామేమీ చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. సిరియాలోని ఇద్లిబ్‌ నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడి అసుపత్రి గదులు, వరండాలన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. నడిచేందుకు కూడా దారిలేనంత మంది వైద్యం కోసం ఎదురు చేస్తున్నారు. ‘ఎవరి ప్రాణాలు కాపాడాలో తెలియక ఒక రోగి నుంచి మరో రోగికి వెంటిలేటర్‌ను మార్చుతూ ఉన్నాను’ అని షాజుల్‌ ఇస్లామ్‌ అనే బ్రిటిష్‌ వైద్యుడు తెలిపారు. యుద్ధం వల్ల గాయపడిన వారికి సేవలందించేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థల తరఫున ఆయన గత ఏడేళ్లుగా సిరియాలో పనిచేస్తున్నారు. ‘ఆసుపత్రిలో తగినన్ని వసతులు లేవు. నిధుల కొరతా తీవ్రంగా ఉంది. భూకంపం తర్వాత ఆసుపత్రిపై భారం ఒక్కసారిగా పెరిగిపోయింద’ని తెలిపారు. ‘యుద్ధం వల్ల నగరంలోని పలు ఆసుపత్రులు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. అందుబాటులో ఉన్న మూడు ఆసుపత్రులూ క్షతగాత్రులతో కిక్కిరిసి పోయి ఉన్నాయ’ని షాజుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భూకంపం తీవ్రతకు వాయవ్య సిరియాలోని 58 గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని భవనాలన్నీ పూర్తిగానో లేదా పాక్షికంగానో కూలిపోయాయని మానవ హక్కుల సంఘం పరిశీలకుడు ఒకరు తెలిపారు.


ధ్వంసమైన జైలు.. ఉగ్రవాదుల పరారీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిరియాలో భూకంపం వల్ల భవనాలు కుప్పకూలి వేల మంది ప్రమాదంలో చిక్కుకోగా....జైళ్లలో ఉన్న ఖైదీలకు మాత్రం ఇది కలిసి వచ్చింది. ఇదే అదనుగా కొందరు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు జైలు అధికారులపై తిరుగుబాటు చేసి పారిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. నైరుతి సిరియాలోని రాజో ప్రాంతంలో మిలటరీ పోలీస్‌ జైలు ఉంది. అక్కడ సుమారు 2వేల మంది ఖైదీలున్నారు. వీరిలో సుమారు 1300 మంది ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారే. సోమవారం సంభవించిన భూకంపంలో ఆ జైలు ధ్వంసమైంది. అదే సమయంలో కొందరు ఖైదీలు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో సుమారు 20 మంది పారిపోయారని.. వారంతా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులేనని జైలు అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులను విడిపించుకునేందుకు అక్కడి రాఖా జైలుపై కొన్ని వారాల క్రితమే దాడి జరిగింది.


మాతృమూర్తిని బలిగొంది.. శిశువును కరుణించింది
 సిరియాలో అపార్ట్‌మెంట్‌  శిథిలాల్లోనే ప్రసవం

డమాస్కస్‌: ఆ పసికందు ఇంకా భూమ్మీదకి పడకముందే భూమి కదలిపోయింది. ఒకపక్క ప్రసవ వేదన, మరోపక్క ప్రకృతి విలయం మధ్యనే ఆమె తల్లికి కాన్పు అయింది. టన్నులకొద్దీ భవన వ్యర్థాలు తమపై పడడంతో ఆ మాతృమూర్తి.. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదించకుండానే కన్నుమూసినా శిశువు మాత్రం మృత్యువును జయించింది. తన ఏడుపుతో సహాయక బృందాల దృష్టిలో పడి ప్రాణాలు కాపాడుకుంది. అప్పటికి ఆమె బొడ్డుతాడు కూడా ఇంకా తల్లితో ముడిపడే ఉంది..! తుర్కియే సరిహద్దులో వాయవ్య సిరియా పట్టణమైన జిండెరిస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. శిశువు తల్లి అఫ్రా అబూ హదియా నివసిస్తున్న ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌ భవనం భూకంప ధాటికి కుప్పకూలిపోయింది. పాపకు జన్మనిచ్చిన తల్లి సహా ఆ కుటుంబ సభ్యులంతా ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. భూకంపం వచ్చిన 10 గంటల తర్వాత సహాయక బృందాలు ఈ అపార్ట్‌మెంట్‌ శిథిలాల్లో శిశువును గుర్తించాయి. అప్పటికి శిశువు జన్మించి మూడు గంటలై ఉంటుందని భావిస్తున్నారు. పొరుగింటి మహిళ ఆ పాపాయి బొడ్డుతాడును కత్తిరించిన తర్వాత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శరీర ఉష్ణోగ్రత పడిపోయి, శరీరమంతా గాయాలతో ఉన్న చిన్నారిని ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని