చైనా బెలూన్‌పై ఆగని రగడ

చైనా బెలూన్‌ను అమెరికా కూల్చివేయడం ఆ రెండు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావంపడేలా చేసింది.

Published : 08 Feb 2023 04:54 IST

వాషింగ్టన్‌/బీజింగ్‌: చైనా బెలూన్‌ను అమెరికా కూల్చివేయడం ఆ రెండు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావంపడేలా చేసింది. ఈ వారం బీజింగ్‌కు వెళ్లాల్సిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తన పర్యటనను రద్దుచేసుకున్నారు. వాతావరణ పరిశోధన కోసమే ప్రయోగించామని చైనా చెబుతున్నా... అది గూఢచర్య బెలూన్‌ అని విశ్వసిస్తున్న అమెరికా యుద్ధ విమానాన్ని పంపించి తమ దేశ తీరానికి సమీపంలోని అట్లాంటిక్‌ మహా సముద్రంలో కూల్చివేసింది. బెలూన్‌ విషయంలో తమ ప్రయోజనాలను, హక్కులను కాపాడుకోవడానికి బీజింగ్‌ కృతనిశ్చయంతో ఉందనీ చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్‌ మంగళవారం ఉద్ఘాటించారు. ఆ బెలూన్‌ను అమెరికా భూభాగం మీదకు ఎందుకు పంపిందని వైట్‌ హౌస్‌లో విలేఖరులు అడగ్గా, చైనా అలాంటి పనులే చేస్తుందని అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. బెలూన్‌ను పంపినట్లు చైనా అంగీకరించినా అది ఎలాంటిదో వివరించలేదని పేర్కొన్నారు. కెనడా నుంచి అమెరికా భూభాగంలోకి ప్రవేశించగానే బెలూన్‌ కూల్చివేతకు ఆదేశించానని బైడెన్‌ వెల్లడించారు. శిథిలాలను వాపసు ఇచ్చేది లేదని అమెరికా సోమవారం స్పష్టం చేసింది. బెలూన్‌కు స్వయంచాలన శక్తి ఉందని వైట్‌ హౌస్‌ ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. అది వాతావరణ బెలూన్‌ కాదనీ, నిఘా బెలూనేనని స్పష్టం చేశారు. అది అమెరికా భూభాగంలో ప్రవేశించిన సమయంలోనే మరొక చైనా బెలూన్‌ దక్షిణ అమెరికా ఖండం మీదుగా పయనిస్తోందని అమెరికా అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని