భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు

భారీ భూకంపం కుదిపేసిన తుర్కియే, సిరియాలో భవనాలు పేకమేడల్లా కూలిపోయి, రహదారులు దెబ్బతిని, పలు నిర్మాణాలు ధ్వంసమై బీభత్సకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 08 Feb 2023 04:54 IST

వేగంగా నష్ట తీవ్రత అంచనాకు సాయం
అంతరిక్ష, ప్రధాన విపత్తుల అంతర్జాతీయ చార్టర్‌ విశేష సేవలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ భూకంపం కుదిపేసిన తుర్కియే, సిరియాలో భవనాలు పేకమేడల్లా కూలిపోయి, రహదారులు దెబ్బతిని, పలు నిర్మాణాలు ధ్వంసమై బీభత్సకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఆ రెండు దేశాలు ‘అంతరిక్ష, ప్రధాన విపత్తుల అంతర్జాతీయ చార్టర్‌’ను క్రియాశీలం చేయమని అంతర్జాతీయ సమాజాన్ని కోరాయి. అసలు ఈ చార్టర్‌ ఏమిటో తెలుసుకుందాం.

వాస్తవ పరిస్థితుల అంచనాకు..

ప్రపంచవ్యాప్తంగా ఏదోమూల తరచూ తుపానులు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, వరదలు, కార్చిచ్చుల వంటి ప్రకృతి విపత్తులతో పాటు పారిశ్రామిక పేలుళ్ల వంటి మానవ ప్రమేయం ఉన్న ప్రమాదాలూ ఏర్పడుతున్నాయి. వాటి కారణంగా లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. మౌలిక సదుపాయాలతో పాటు ప్రకృతి వనరులూ దెబ్బతింటున్నాయి. ఇటువంటి సమయాల్లో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం, నష్టాలను వేగంగా అంచనా వేయడం అంత సులభం కాదు. అయితే, తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు, తద్వారా సహాయక చర్యలు మెరుగ్గా నిర్వహించేందుకు ‘శాటిలైట్‌ ఇమేజింగ్‌’ విశేషంగా సహకరిస్తుంది. ఈ దిశగానే 1999లో ఫ్రాన్స్‌ ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్పేస్‌ స్టడీస్‌’, ‘యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ’లు కలిసి.. ‘అంతరిక్ష, ప్రధాన విపత్తుల అంతర్జాతీయ చార్టర్‌’ ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం 17 అంతరిక్ష సంస్థలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. విపత్తుల సమయంలో తమ ఉపగ్రహాల ద్వారా ప్రభావిత ప్రాంతాల ఫొటోలు, ఇతర సమాచారాన్ని సేకరించి సంబంధిత దేశాలకు ఉచితంగా అందజేస్తాయి. వాటిని విశ్లేషించి, అవసరమైన చర్యలు తీసుకోవచ్చు.

ప్రతికూల వాతావరణంలోనూ..

తమ భూకంప ప్రభావిత ప్రాంతాల వైపు శాటిలైట్ల దృష్టిని మళ్లించేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ‘స్పేస్‌ అండ్‌ మేజర్‌ డిజాస్టర్స్‌’ చార్టర్‌ను యాక్టివేట్‌ చేయాలని తుర్కియే అభ్యర్థించింది. సిరియా విషయంలోనూ ఐరాస చొరవ తీసుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. వెంటనే 11 అంతరిక్ష సంస్థలు తమ ఆప్టికల్‌, రాడార్‌ ఉపగ్రహాలను ఆపరేట్‌ చేసేందుకు ముందుకొచ్చాయి. తొలుత ఫ్రాన్స్‌కు చెందిన ఉపగ్రహాలు ఆ ప్రాంతం మీదుగా వెళ్లిన నేపథ్యంలో.. ఆ దేశం మొదటి చిత్రాలను అందించింది. మేఘాలు ఉన్నప్పటికీ, అన్ని ప్రాంతాలనూ ఇవి స్పష్టంగా చిత్రించగలవు.

* 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 154 దేశాల్లో, 797 సార్లు ఈ చార్టర్‌ను యాక్టివేట్‌ చేశారు. ఇందులో దాదాపు మూడో వంతు వాతావరణ సంబంధిత విపత్తుల(తుపానులు, వరదల) సమయంలో క్రియాశీలం చేశారు.

* యుద్ధాలు, సాయుధ సంఘర్షణలు, వడగాలులు, దీర్ఘకాలంలో సాగే విపత్తు ప్రక్రియ(కరవు)ల సందర్భాల్లో దీన్ని యాక్టివేట్‌ చేయరు.

* విపత్తు రకాన్ని బట్టి.. రాడార్‌శాట్‌, ల్యాండ్‌శాట్‌- 7/8, సెంటినల్‌-2 వంటి వివిధ ఉపగ్రహాలు రంగంలోకి దిగుతాయి. సహాయక చర్యలతో పాటు పునర్నిర్మాణ పనుల పర్యవేక్షణలోనూ ఈ శాటిలైట్‌ల సమాచారం కీలకంగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని