సంక్షిప్త వార్తలు (6)

మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ‘ఎమ్‌హెచ్‌ 17’ను కూల్చడానికి ఉక్రెయిన్‌ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణులు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అనుమతితో వారికి అందినవేనని అంతర్జాతీయ దర్యాప్తు బృందం బుధవారం ప్రకటించింది.

Updated : 09 Feb 2023 09:55 IST

మలేసియా విమానంపై దాడి.. పుతిన్‌ అందించిన క్షిపణులతోనే!
2014 ఘటనపై దర్యాప్తు బృందం ప్రకటన

ద హేగ్‌: మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ‘ఎమ్‌హెచ్‌ 17’ను కూల్చడానికి ఉక్రెయిన్‌ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణులు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అనుమతితో వారికి అందినవేనని అంతర్జాతీయ దర్యాప్తు బృందం బుధవారం ప్రకటించింది. 2014లో ఆమ్‌స్టర్‌డాం నుంచి కౌలాలంపుర్‌ ప్రయాణిస్తున్న ఈ విమానంపై తూర్పు ఉక్రెయిన్‌ గగనతలంలో క్షిపణి దాడి జరిగింది. పుతిన్‌ అనుమతితో రష్యా అందించిన క్షిపణులతోనే ఉక్రెయిన్‌ వేర్పాటువాదులు ఈ దురాగతానికి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. దీనిని రష్యా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఒక దేశాధ్యక్షుడ్ని బోనులో నిలబెట్టేటంత బలమైన ఆధారాలు సంపాదించలేకపోయామని, ఎనిమిదిన్నరేళ్లుగా చేస్తున్న ఈ దర్యాప్తును ఇక ముగిస్తున్నామని దర్యాప్తు బృందం ప్రకటించింది. రష్యా సహకారం లేకుండా ఎంత వరకు దర్యాప్తు చేయగలమో అంతవరకూ చేశామని సభ్యురాలొకరు వ్యాఖ్యానించారు. మొత్తం 298 మంది మృత్యువాత పడిన ఈ ఘటనలో ఎక్కువ మంది మృతులు డచ్‌ దేశస్థులే. ఈ ఘటనకు సంబంధించి మూడు నెలల క్రితం ఇద్దరు రష్యన్లను, ఒక ఉక్రెయిన్‌ తిరుగుబాటుదారుడ్ని నిందితులుగా ఓ డచ్‌ కోర్టు గుర్తించగా.. వారు ఇప్పటి వరకు కోర్టు ముందు హాజరుకాలేదు.


కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి పునరుద్ధరించాలి
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

లాహూర్‌: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించడం ఒక్కటే ఇరు దేశాల సంబంధాల పునరుద్ధరణకు మార్గమని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్‌రీక్‌ ఐ ఇన్‌సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. భారత్‌ పార్లమెంట్‌ 2019లో ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370ని తొలగించి, ఆ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌గా విభజించిందని ఆయన గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించినప్పుడే భారత్‌తో చర్చలు సాధ్యమని మంగళవారం ఆయన లాహూర్‌లోని జమన్‌ పార్క్‌ వద్ద ఉన్న తన స్వగృహంలో విదేశీ మీడియా ప్రతినిధులకు తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. చట్టబద్ధ పాలన లేనంత కాలం పాకిస్థాన్‌కు భవిష్యత్తు ఉండదన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందంటే.. అక్కడ చట్టబద్ధ పాలన ఉండటమే కారణమని చెప్పారు.


రష్యా ఓటమి ఖాయం
బ్రిటన్‌ ఎంపీలను ఉద్దేశించి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగం

లండన్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఐరోపాలో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. బుధవారం బ్రిటన్‌లో అడుగుపెట్టిన ఆయన యూకే పార్లమెంటు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో ప్రసంగించారు. ‘‘రష్యా ఓడిపోతుంది. స్వేచ్ఛ విజయం సాధిస్తుంది’’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. మరిన్ని యుద్ధ విమానాలు కావాలని బ్రిటన్‌ను కోరారు. బిట్రన్‌ ప్రధాని రిషి సునాక్‌తో భేటీ అయ్యారు. బ్రిటన్‌ కింగ్‌ ఛార్లెస్‌-3ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ చేరుకున్నారు.


భారత్‌పైనా చైనా బెలూన్‌ నిఘా: అమెరికా

వాషింగ్టన్‌: చైనా నిఘా బెలూన్లు భారత్‌ గగనతలంలోనూ సంచరించాయా..? మన దేశ రక్షణకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని అవి ఎప్పటికప్పుడు తస్కరిస్తున్నాయా..? ఈ ప్రశ్నకు అవునని అమెరికా బదులిస్తోంది. అట్లాంటిక్‌ మహాసముద్రంలో చైనా బెలూన్‌ను ఇటీవల పేల్చివేసిన అగ్రరాజ్యం.. డ్రాగన్‌ గూఢచర్య కార్యకలాపాలపై హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌తో పాటు..జపాన్‌, వియత్నాం, తైవాన్‌ లక్ష్యంగా చైనా నిఘా బెలూన్లను పంపుతోందని పేర్కొంది.


బేనజీర్‌ భుట్టో హత్య కేసు.. విచారణకు హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ తొలి మహిళా ప్రధాని బేనజీర్‌ భుట్టో హత్య కేసులో వాదనలు వినేందుకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ను ఏర్పాటు చేస్తూ లాహోర్‌ హైకోర్టు బుధవారం నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ సదాకత్‌ అలీ ఖాన్‌, జస్టిస్‌ మిర్జా వకాస్‌ రవూఫా  బెంచ్‌ మొత్తం 8 అప్పీలను విచారించనుంది. అయిదున్నర ఏళ్ల తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేసులో నిందితునిగా ఉన్న పర్వేజ్‌ ముషారఫ్‌ మరణించిన కొద్ది రోజులకే ఈ బెంచ్‌ ఏర్పాటు చేయడం గమనార్హం. ఆయనతో పాటు కేసులో నిందితులుగా ఉన్న అయిదుగురికి నోటీసులు జారీ చేశారు. ముషారఫ్‌ మరణించడంతో ఆయన పేరును తాజా జాబితాలో నుంచి తీసేశారు. 2007, డిసెంబర్‌ 27న ఓ ఎన్నికల ర్యాలీలో బేనజీర్‌ భుట్టో పాల్గొనగా.. ఆ ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఆమెతో పాటు 20 మంది పార్టీ కార్యకర్తలు మరణించగా.. 71మందికి గాయాలయ్యాయి. భద్రత నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులకు 17 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కేసును ఛేదించేందుకు ఇప్పటి వరకు నాలుగు విచారణ కమిటీలను నియమించారు.


4.6 బిలియన్‌ డాలర్ల భూకంప పన్ను బొక్కేశారు!
తుర్కియే ప్రభుత్వంపై-ప్రజల ఆరోపణ

ఇస్తాంబుల్‌: కొన్ని సంవత్సరాలుగా తమ నుంచి వసూలు చేస్తున్న భూకంప పన్ను నిధులు ఎటుపోయాయని ప్రజలు తుర్కియే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. భూకంప ప్రధాన కేంద్రానికి సమీపంలోని గజియన్‌తెప్‌ ప్రాంతంలో దాదాపు 12 గంటల పాటు ఎటువంటి సహాయక చర్యలు అందకపోవడంతో ఈ నిధులు ఏమయ్యాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1999లో వచ్చిన భూకంపంలో 17,000 మంది మరణించడంతో.. భవిష్యత్తులో ఈ తరహా విపత్తులను ఎదుర్కొనేందుకు, సహాయకార్యక్రమాలకు వినియోగించేందుకు ప్రభుత్వం భూకంప పన్ను వసూలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ నిధుల కింద రూ.4.6 బిలియన్‌ డాలర్లు ప్రభుత్వం వద్ద పోగుపడినా.. ఈ నిధులను ఎక్కడ వెచ్చిస్తున్నారో ఇప్పటి వరకు బహిర్గతం కాలేదు. ఆ సొమ్మును ఎక్కడా లెక్కల్లో చూపలేదు. ఈ నిధులు పక్కదారి పట్టాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు