2025 నాటికి ప్రపంచ విద్యుత్తులో సగం ఆసియాలోనే వినియోగం

ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌లో సగం మొత్తాన్ని ఒక్క ఆసియానే వినియోగించుకుంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) వెల్లడించింది.

Updated : 09 Feb 2023 06:09 IST

వెల్లడించిన అంతర్జాతీయ ఇంధన సంస్థ

బెర్లిన్‌: ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌లో సగం మొత్తాన్ని ఒక్క ఆసియానే వినియోగించుకుంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) వెల్లడించింది. చరిత్రలో తొలిసారి 2025లో ఆసియా ఈ ఘనతను సాధిస్తుందని బుధవారం విడుదల చేసిన భవిష్యత్తు అంచనా నివేదికలో ఐఈఏ ప్రకటించింది. ఐరోపా సమాఖ్య, అమెరికా, భారత్‌లు కలిపి వినియోగించే విద్యుత్‌ కంటే చైనా ఎక్కువ కరెంటును ఉపయోగించనుందని ఈ నివేదిక పేర్కొంది. ఆ సమయానికి ప్రపంచ జనాభాలో అయిదో వంతుకు ఆశ్రయమివ్వనున్న ఆఫ్రికా.. మౌలికవసతుల కొరత కారణంగా ప్రపంచ విద్యుదుత్పత్తిలో మూడు శాతం కరెంటును మాత్రమే వినియోగించుకుంటుందని ఐఈఏ అంచనా వేసింది. విద్యుదుత్పత్తిలో అణు, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం గణనీయంగా పెరగడం వల్ల ఆ మేరకు వాయుకాలుష్యం తగ్గనుందని ఈ నివేదిక తెలిపింది. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు కట్టడి చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే సంప్రదాయేతర వనరుల వినియోగం మరింత పెరగాలని నివేదిక స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తి, సరఫరా వాతావరణ మార్పులపై ఆధారపడి ఉంటున్నాయనే నిజాన్ని ప్రభుత్వాధినేతలు అర్థం చేసుకోవాలని  హెచ్చరించింది. గతేడాది యూరోప్‌, భారత్‌, మధ్య, తూర్పు చైనాల్లో ఉష్ణపవనాలు, కరవు పరిస్థితులు ఏర్పడగా, అమెరికాలో శీతల పవనాలు ఇబ్బందులు సృష్టించాయని ఐఈఏ వెల్లడించింది. ఆయా పరిస్థితుల్లో విద్యుదుత్పత్తి, సరఫరా వ్యవస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని గుర్తుచేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని