రాజపక్సను విచారించిన శ్రీలంక పోలీసులు

కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను పోలీసులు మూడు గంటల పాటు విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

Updated : 09 Feb 2023 06:08 IST

గతంలో వెలుగుచూసిన నగదు నిల్వలపై ప్రశ్నలు

కొలంబో: కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను పోలీసులు మూడు గంటల పాటు విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతేడాది జులైలో ఆందోళనలు ఎగసిన విషయం విదితమే. అప్పట్లో దేశ రాజధానిలో అధ్యక్షుడు రాజపక్స భవనాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. దీంతో రాజపక్స దేశం విడిచి వెళ్లిపోవడంతో ఆయన కార్యాలయం, నివాసాలను వారు ఆక్రమించుకున్నారు. ఆ రెండు భవనాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలు వెలుగు చూశాయి. కొలంబో ఫోర్ట్‌ పోలీసులకు 17 మిలియన్ల నగదును అప్పగించినట్లు ఆందోళనకారులు అప్పట్లో ప్రకటించారు. ఈ విషయాన్ని పోలీసులు కోర్టుకు నివేదించడంతో దానిపై ఆయన్ను ప్రశ్నించి.. వాంగ్మూలం తీసుకోవాలని ఆదేశించింది. ప్రజా ఆందోళనల కారణంగా 73 ఏళ్ల గొటబాయ రాజపక్స గతేడాది జులై 13న దేశం విడిచి వెళ్లి సెప్టెంబరు 2న తిరిగి స్వదేశంలో అడుగుపెట్టారు. రాజపక్సతో పాటు ఆయన కుటుంబంపై 2015 నుంచి 2019 వరకు అనేక ఆరోపణలు వచ్చాయి. 2019లో ఆయన దేశాధ్యక్ష పదవి చేపట్టిన తరువాత తన తల్లిదండ్రుల పేర స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి ప్రజాధనం దుర్వినియోగం చేశారన్న కేసును తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని తొలగించుకున్నారన్న అభియోగాలున్నాయి. ప్రస్తుతం ఆ కేసు కూడా తిరిగి విచారణ చేపడతారని పలువురు న్యాయవాదులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు