అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే ఉపేక్షించం

తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని, తమ నుంచి ప్రతిఘటన తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చైనాను హెచ్చరించారు.

Published : 09 Feb 2023 04:51 IST

చైనాకు బైడెన్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌: తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని, తమ నుంచి ప్రతిఘటన తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చైనాను హెచ్చరించారు. చైనా పంపిన అనుమానాస్పద బెలూన్‌ ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు పెంచిన నేపథ్యంలో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్‌ ఉభయసభలను ఉద్దేశించి మంగళవారం ఆయన ప్రసంగించారు. అమెరికా, ప్రపంచ పురోభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే అంశాల్లో చైనాతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తప్పులు ఏమైనా జరిగితే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోమని బెలూన్‌ పేల్చివేత అంశాన్ని ఉద్దేశిస్తూ హెచ్చరించారు. చైనాతో పోటీ పడతాం కానీ ఘర్షణ పడాలనుకోవట్లేదని తాను ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు గతంలో స్పష్టం చేసినట్లు బైడెన్‌ సభకు తెలిపారు. సైనిక శక్తి సహా అన్ని రకాలుగానూ అమెరికా దృఢంగా ఉందని, చైనాతోనే కాకుండా ఎవరితో అయినా పోటీ పడగలమని తేల్చిచెప్పారు. మొత్తం తన 73 నిమిషాల ప్రసంగంలో బైడెన్‌ కనీసం ఏడు సార్లు చైనా పేరును ప్రస్తావించారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రస్తావిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై బైడెన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి ప్రపంచానికే పెద్ద పరీక్షలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక విలువలకు కట్టుబడి ఉక్రెయిన్‌కు అమెరికా అన్ని రకాలుగా సాయపడుతోందని, అది కొనసాగుతుందని వెల్లడించారు.

మెరుగుపడిన దేశ ఆర్థికస్థితి

రెండేళ్ల క్రితం దెబ్బతిన్న అమెరికా ఆర్థికస్థితి మెరుగుపడిందని బైడెన్‌ తెలిపారు. మాజీ అధ్యక్షులు నాలుగేళ్లలో కల్పించిన ఉద్యోగాలను తాను ఈ రెండేళ్లలోనే సృష్టించానని బైడెన్‌ గుర్తుచేశారు. అక్రమ, చట్టబద్ధంగా వచ్చిన వలసదారులకు శాశ్వత పౌరసత్వాన్ని కల్పించే సమగ్ర వలసవిధాన సంస్కరణ చట్టాన్ని త్వరగా ఆమోదించాలని ఆయన సభకు విజ్ఞప్తి చేశారు.

పోటీ పడటానికి భయం లేదు: చైనా

బైడెన్‌ ప్రసంగంపై చైనా స్పందించింది. అమెరికాతో పోటీపడటానికి తాము భయపడటం లేదు కానీ.. ఇరుదేశాల సంబంధాలను కేవలం ఆ కోణం నుంచే చూడటం అభ్యంతరకరమని వ్యాఖ్యానించింది. పోటీ పేరు చెప్పి ఒక దేశం అభివృద్ధి చెందే హక్కును కాలరాయలేరని స్పష్టం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ గాడిన పడేలా తమతో కలిసి పనిచేయాలని అమెరికాకు చైనా సూచించింది. బెలూన్‌ కూల్చివేసిన అనంతరం చైనా, అమెరికా రక్షణశాఖ మంత్రుల టెలిఫోన్‌ సంభాషణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా తోసిపుచ్చిందని పెంటగాన్‌ వర్గాలు తెలిపాయి. శనివారం బెలూన్‌ను పేల్చేసిన అనంతరం ఈ ప్రతిపాదన వెళ్లినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని