Turkey Earthquake: తుర్కియే భూకంపం.. గత 100 ఏళ్లలో ఇదే ఘోరం!

తుర్కియేను అతలాకుతలం చేసిన భూకంపం గత 100 ఏళ్ల కాలంలో కనీవినీ ఎరగనిదిగా పరిశీలకులు భావిస్తున్నారు.

Updated : 16 Feb 2023 08:31 IST

అన్‌టాకియ: తుర్కియేను అతలాకుతలం చేసిన భూకంపం గత 100 ఏళ్ల కాలంలో కనీవినీ ఎరగనిదిగా పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ప్రకృతి విపత్తులో 35 వేల మందికి పైగా దుర్మరణం పాలయ్యారని, 1,05,505 మంది గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డొగాన్‌ చేసిన ప్రకటన తీవ్రతను వెల్లడిస్తోంది. మరోపక్క రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుండగా నిరాశ్రయులుగా మారిన బాధితులకు కనీస అవసరాలు తీరడంలేదు. ఇప్పటికి 13 వేల మంది ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. మొత్తం 2,11,000 మంది నివసిస్తున్న 47 వేల భవనాలు కుప్పకూలడమో, తీవ్రంగా దెబ్బతినడమో జరిగింది. 1939లో సంభవించిన ఎర్జింకాన్‌ భూకంపం కారణంగా 33 వేలమంది పౌరులు మరణించారు.

* భూకంపం సంభవించిన తొమ్మిది రోజుల తర్వాత కూడా శిథిలాల కింద నుంచి ప్రజల స్వరాలు వినిపిస్తున్నట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి. నీరు, ఆహారం లేక కొందరు శిథిలాల కిందే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం భూకంపం కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకోవడంపైనే ప్రధానంగా దృష్టిసారించారు.

* తుర్కియేలో ఒక యుద్ధనౌకపై తాత్కాలికంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.

* భూకంపం కారణంగా బాధితులుగా మారిన సిరియాలోని 50 లక్షల మందిని ఆదుకునేందుకు 397 మిలియన్‌ డాలర్ల సేకరణకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

* తుర్కియే, సిరియాల్లో 2 కోట్ల 60 లక్షల మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అతిశీతల ఉష్ణోగ్రతలు, అపరిశుభ్రత కారణంగా అనేక రోగాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని