ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ వదిలేసి.. 10 గంటలు రైల్లో ప్రయాణించి..

యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తొలిసారి వెళ్లొచ్చిన తీరు ఆద్యంతం రహస్యమే. శ్వేతసౌధం నుంచి తెల్లవారుజామున 3.30 గంటలకు బయటకు రావడం నుంచి పోలండ్‌ మీదుగా ఉక్రెయిన్‌కు వెళ్లడం, తిరిగి రావడం గురించి తెలిసింది అతి కొద్దిమందికే.

Published : 22 Feb 2023 05:19 IST

బైడెన్‌ ఉక్రెయిన్‌ పర్యటన ఆద్యంతం రహస్యం
సి-32 విమానంలో ప్రయాణం

వాషింగ్టన్‌: యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తొలిసారి వెళ్లొచ్చిన తీరు ఆద్యంతం రహస్యమే. శ్వేతసౌధం నుంచి తెల్లవారుజామున 3.30 గంటలకు బయటకు రావడం నుంచి పోలండ్‌ మీదుగా ఉక్రెయిన్‌కు వెళ్లడం, తిరిగి రావడం గురించి తెలిసింది అతి కొద్దిమందికే. అమెరికా బలగాలే లేని యుద్ధక్షేత్రానికి అధ్యక్షుడు వెళ్లడం ఆధునిక చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో ఒకరిద్దరు అధ్యక్షులు వేరే దేశాల్లో ఇలాంటి ప్రాంతాలకు వెళ్లినా అక్కడ ఆ సమయంలో అగ్రరాజ్యం బలగాలు ఉండేవి. అమెరికా అధ్యక్షుడి హోదాలో 2006లో జార్జ్‌ బుష్‌ బాగ్దాద్‌లో పర్యటించారు. 2014లో బరాక్‌ ఒబామా అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో ప్రత్యక్షమయ్యారు. 2019లో డొనాల్డ్‌ ట్రంప్‌ అఫ్గానిస్థాన్‌లో బాగ్రామ్‌ వైమానిక క్షేత్రంలో అమెరికా సైనికులతో కలిసి సంబరాలు చేసుకొన్నారు.

చివరి క్షణంలో రష్యాకు సమాచారం

ఉక్రెయిన్‌కు సంఘీభావం ప్రకటించడానికి బైడెన్‌ వెళ్లి 23 గంటల్లో తిరిగి స్వదేశానికి చేరుకోవడం కొంత ప్రమాదంతో కూడుకున్న పర్యటనగానే చెబుతున్నారు. ఆయన పర్యటనలో ఉన్న సమయంలో దాడులు జరగకుండా ఉండేందుకు, అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణకు తావు లేకుండా చూసేందుకు రష్యాకు కొద్ది గంటల ముందు సమాచారం ఇచ్చారు. వారాంతపు పర్యటన నిమిత్తం శనివారం రాత్రి 7 గంటల సమయంలో భార్యాసమేతంగా వెళ్లిన బైడెన్‌ ఆ తర్వాత 36 గంటలపాటు బయట ప్రపంచానికి కనిపించలేదు. ఎప్పుడూ ఉపయోగించే ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానానికి బదులు సి-32లో ఉక్రెయిన్‌కు బయల్దేరిన విషయం ఒకరోజు తర్వాత ధ్రువపడింది. దీనిలో అతి తక్కువమంది భద్రత సిబ్బంది, అధికారులు, వైద్యులు ఉన్నారు. సాధారణంగా ఈ తరహా విమానాలను అమెరికా పరిధిలో చిన్నచిన్న ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాత్రమే వాడుతుంటారు. అధ్యక్షుడు ఎక్కడకు వెళ్లినా ఆ విశేషాలను ప్రపంచానికి అందించడానికి 13 మంది పాత్రికేయుల్ని తీసుకువెళ్తారు. ఉక్రెయిన్‌ పర్యటనలో ఇద్దరే ఉన్నారు. వారివద్ద నుంచి కూడా ఎలక్ట్రానిక్‌ పరికరాలను భద్రతాధికారులు ముందుగానే స్వాధీనపరచుకుని స్విచాఫ్‌ చేశారు.

లోహ విహంగం కిటికీల మూసివేత

ఇంధనం కోసం ఈ విమానం తొలుత జర్మనీలోని రామ్‌స్టెయిన్‌లో అమెరికా సైనిక స్థావరానికి చేరుకొంది. అక్కడ విమానం కిటికీలను పూర్తిగా మూసి ఉంచారు. అక్కడి నుంచి పోలండ్‌లోని జెసియోనాక్‌ విమానాశ్రయంలో గంట తర్వాత ఈ లోహ విహంగం దిగింది. ఆ ప్రయాణంలో విమానం ట్రాన్స్‌పాండర్‌ను కూడా ఆఫ్‌లో ఉంచారు. ఆ తర్వాత రైలులో 10 గంటలు ప్రయాణించి  బైడెన్‌ కీవ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆ నగరంలో పర్యటనకూ లిమోసీన్‌ కారుకు బదులు తెల్లరంగు ఎస్‌యూవీని వాడారు.  ఉక్రెయిన్‌ తరఫున పోరాటంలో అసువులుబాసిన సైనికులకు నివాళులు అర్పించేందుకు బైడెన్‌ వెళ్తున్న చిత్రం బయటకు వచ్చాక ఆయన పర్యటన గురించి ప్రపంచానికి తెలిసింది.   బైడెన్‌ అక్కడున్న సమయంలో అమెరికా విమానాలు కీవ్‌ గగనతలంపై నిఘా ఉంచాయి.


మాకు చెప్పారు.. మేం హామీ ఇవ్వలేదు

బైడెన్‌ ఆకస్మిక పర్యటన గురించి దౌత్యమార్గాల ద్వారా తమకు సమాచారం పంపించారనీ, ఆయన భద్రతకు ఎలాంటి హామీని తామివ్వలేదని రష్యా ‘ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌’ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ బొర్ట్‌నికోవ్‌ మంగళవారం స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని