Heart Attack: తియ్యటి ఎరిథ్రిటాల్‌తో గుండెపోటు ముప్పు

ఆహార పదార్థాల్లో తియ్యదనం రావడానికి వాడే కృత్రిమ పదార్థమైన ఎరిథ్రిటాల్‌ వల్ల గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువవుతుందని తాజా పరిశోధనల్లో తేలింది.

Updated : 02 Mar 2023 09:34 IST

 క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ పరిశోధనల్లో వెల్లడి

వాషింగ్టన్‌: ఆహార పదార్థాల్లో తియ్యదనం రావడానికి వాడే కృత్రిమ పదార్థమైన ఎరిథ్రిటాల్‌ వల్ల గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువవుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఇలాంటి ఉత్పత్తులను దీర్ఘకాలం వాడటం వల్ల వచ్చే ప్రమాదాలపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది. రక్తంలో ఎరిథ్రిటాల్‌ స్థాయి ఎక్కువగా ఉన్నవారికి గుండెపోటు, స్ట్రోక్‌ లేదా మరణం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని అమెరికా, ఐరోపాలలో 4వేల మందిపై క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ పరిశోధకులు చేసి పరీక్షల్లో గుర్తించారు. మొత్తం రక్తంలో లేదా ప్లేట్‌లెట్లు, రక్త కణాలలో విడివిడిగా దీన్ని గమనించినప్పుడు కూడా అది రక్తం గడ్డ కట్టడానికి కారణమవుతోందని తెలిపారు. నేచర్‌ మెడిసిన్‌ పత్రికలో ఈ పరిశోధన వ్యాసం ప్రచురితమైంది.

ఎరిథ్రిటాల్‌ వల్ల ప్లేట్‌లెట్లు సులభంగా క్రియాశీలకమై.. గడ్డలు ఏర్పడుతున్నట్లు పరీక్షల్లో గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల ఆహార పదార్థాలు, పానీయాల్లో ఎరిథ్రిటాల్‌ను ఉపయోగిస్తారు. దీనిపై ఐరోపా ఆహార భద్రతా సంస్థ, ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఇతర ఆరోగ్య సంస్థలూ మరింతగా పరిశోధనలు చేయనున్నాయి. కృత్రిమ తీపి పదార్థాలు వాడటం వల్ల గుండె కవాటాల వ్యాధి వచ్చే ముప్పు ఉంటుందని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ గత సంవత్సరం సెప్టెంబరులో చేసిన పెద్ద స్థాయి పరిశోధనల్లోనూ తేల్చిచెప్పింది. గుండె కవాటాల వ్యాధులు క్రమంగా పెరుగుతాయని, గుండెవ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణాలు ఎక్కువవుతున్నాయని క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌లో ప్రివెంటివ్‌ కార్డియాలజీ విభాగాధిపతి స్టాన్లీ హాజెన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని