Tik tok: అమెరికాలో మైనర్లకు టిక్‌టాక్‌ 60 నిమిషాలే!

అమెరికాలో తమ యాప్‌ను వినియోగించే మైనర్ల (18 ఏళ్ల లోపువారు)కు 60 నిమిషాల సమయ పరిమితిని వచ్చే కొద్ది వారాల్లో విధించబోతున్నట్లు టిక్‌టాక్‌ బుధవారం ప్రకటించింది.

Updated : 02 Mar 2023 09:46 IST

సమయ పరిమితి విధించనున్న వీడియో యాప్‌

లాస్‌ ఏంజెలెస్‌: అమెరికాలో తమ యాప్‌ను వినియోగించే మైనర్ల (18 ఏళ్ల లోపువారు)కు 60 నిమిషాల సమయ పరిమితిని వచ్చే కొద్ది వారాల్లో విధించబోతున్నట్లు టిక్‌టాక్‌ బుధవారం ప్రకటించింది. యాప్‌పై వివిధ కారణాలతో పలు రాష్ట్ర ప్రభుత్వాల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. తమ పిల్లలు యాప్‌ను వినియోగించే సమయాన్ని తగ్గించడానికి అమెరికాలో తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్‌ సంస్థ విశ్వాసం, భద్రత విభాగం అధిపతి కార్మాక్‌ కీనన్‌ బుధవారం తన బ్లాగ్‌లో పెట్టిన పోస్టులో..‘‘60 నిమిషాల సమయం పూర్తి కాగానే..యాప్‌ను వీక్షించేందుకు..  పాస్‌కోడ్‌ను నమోదు చేసి క్రియాశీల నిర్ణయం తీసుకోవాలని మైనర్లకు సూచన వస్తుంది. అలాంటి సమయంలో 13 ఏళ్ల లోపు వినియోగదారులకు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అప్పటికే రూపొందించుకున్న పాస్‌కోడ్‌ను నమోదు చేస్తే యాప్‌ను వీక్షించేందుకు మరో 30 నిమిషాల అదనపు సమయం లభిస్తుంది’’అని తెలిపారు. బోస్టన్‌ చిల్డ్రన్స్‌ ఆసుపత్రి డిజిటల్‌ వెల్‌నెస్‌ ల్యాబ్‌కు చెందిన నిపుణులు, పలువురు అధ్యాపక పరిశోధకులతో సంప్రదించి యాప్‌ వీక్షణ సమయాన్ని 60 నిమిషాలకు పరిమితం చేసినట్లు టిక్‌టాక్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని