ఇక్కడ ధర లేదు.. అక్కడ కొనలేరు

ప్రపంచ  వ్యాప్తంగా ఉల్లి ధరలు రైతులు, కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Updated : 05 Mar 2023 11:12 IST

ప్రపంచవ్యాప్తంగా కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి
ఫిలిప్పీన్స్‌లో కిలో రూ.వెయ్యిపైనే.. పాక్‌లో రూ.250
మన దేశంలోనేమో రోడ్లపై పారబోస్తున్న రైతులు

ప్రపంచ  వ్యాప్తంగా ఉల్లి ధరలు రైతులు, కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బ్రిటన్‌, ఫిలిప్పీన్స్‌, పాకిస్థాన్‌, అజర్‌బైజాన్‌, తుర్కియే దేశాల్లో  ద్రవ్యోల్బణ ప్రభావంతో ఉల్లి ధరలు ఆకాశాన్నిఅంటుతుండగా... మన దేశంలో మాత్రం కిలోకు రూపాయి కూడా రాక రైతులు రోడ్లపై పారబోస్తున్న విచిత్ర పరిస్థితి!

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావానికి, వాతావరణ మార్పులు కూడా తోడవటంతో పలు దేశాల్లో కూరగాయలు, నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. అనేక ప్రభుత్వాలు వాటిని నియంత్రించలేక ఆపసోపాలు పడుతున్నాయి. మొరాకో, తుర్కియే, కజక్‌స్థాన్‌లు ఎగుమతులు ఆపేశాయి. ముఖ్యంగా ఉల్లి కోసం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచబ్యాంకు సైతం ప్రపంచవ్యాప్తంగా ఉల్లి కొరతపై హెచ్చరించాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ ఉల్లిని వంటల్లో తప్పనిసరిగా వాడతారు. ఏటా 10.6 కోట్ల టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతుంది. కానీ ఈసారి దిగుబడి తగ్గింది. స్పెయిన్‌, ఉత్తర ఆఫ్రికాల్లో కరవు తదితర వాతావరణ ప్రతికూలతలతో పంట చేతికందలేదు. ఫలితంగా బ్రిటన్‌లో కొరత ఏర్పడింది. ఉల్లితో పాటు అనేక కూరగాయలను కూడా రేషన్‌ పద్ధతిలో అమ్ముతున్నారు. ఇంతకుమించి కొనుగోలు చేయటానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు. పాకిస్థాన్‌లో నిరుడు వచ్చిన భారీ వరదలతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో కిలో ఉల్లి ధర 371% పెరిగి రూ.250కిపైగా పలుకుతోందక్కడ.


విమానాల్లో స్మగ్లింగ్‌...

‘‘ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఒక క్యారెట్‌, ఒక ఆలు... అంటూ వినియోగదారులు కొంటుంటే కడుపు తరుక్కుపోతోంది. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు’’ అని మొరాకోలోని వ్యాపారి ఒకరు వాపోయారు. ఇక ఫిలిప్పీన్స్‌లోనైతే మాంసం కంటే ఉల్లి ధర ఎక్కువగా ఉంది. కిలోకు రూ.1200కుపైగా ధర పలుకుతోంది. అంతపెట్టినా దొరికే పరిస్థితి లేదు. విదేశాల నుంచి వచ్చేవారు విమానాల్లో ఉల్లిగడ్డలను దొంగతనంగా తెచ్చుకుంటున్నారు. ఉల్లి స్మగ్లింగ్‌పై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉజ్బెకిస్థాన్‌, తజిక్‌స్థాన్‌, అజర్‌బైజాన్‌, బెలారస్‌ల్లోనూ ఇదే పరిస్థితి.


నాసిక్‌లో 500 కిలోలకు రూ.2 చెక్కు

ప్రపంచమంతా ఉల్లి కోసం వెంపర్లాడుతుంటే... ఇక్కడ మన దేశంలోనేమో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి! పండించిన పంటకు ధరలేక మహారాష్ట్రలో రైతులు ఉల్లిని రోడ్లపై పారేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి వ్యాపార కేంద్రంగా పేరొందిన నాసిక్‌ ప్రాంతంలో కిలో ధర రూపాయి లేదా రెండు రూపాయలు మాత్రమే పలుకుతోంది. శోలాపుర్‌లో రాజేంద్ర చవాన్‌ అనే రైతు... 512 కిలోల ఉల్లిని మార్కెట్లో విక్రయించగా చేతికి వచ్చింది రూ.2.49 మాత్రమే! ‘‘క్వింటాలుకు వ్యాపారి రూ.100 ఇస్తానంటే 10 బస్తాల్లో ఉల్లిని శోలాపుర్‌ మార్కెట్‌ యార్డుకు పంపించా. మొత్తం 512 కిలోలు తూగింది. రవాణా, కూలీ, బరువు తూసిన ఖర్చులు...ఇతరత్రా మార్కెట్‌ కమిషన్‌లు పోను మిగిలింది రూ.2.49 పైసలని చెప్పాడా వ్యాపారి. రూ.2కు చెక్కు ఇచ్చాడు. అదీ 15రోజుల తర్వాతే బ్యాంకులో నగదుగా మారుతుందట! ఇలాగైతే ఎలా బతికేది?’’ అంటూ వాపోతున్నారు రాజేంద్ర చవాన్‌! సాధారణంగా మహారాష్ట్రలో ఉల్లి రైతులు మూడుసార్లు... ఖరీఫ్‌ (సెప్టెంబరు-అక్టోబరు), ఖరీఫ్‌ తర్వాత (జనవరి-ఫిబ్రవరి), రబీ (మార్చి-ఏప్రిల్‌)లో పంటలు వేస్తారు. ఖరీఫ్‌ పంటను జనవరిలో అమ్ముతారు. తర్వాతి పంటను మే, జూన్‌లలో మార్కెట్‌లోకి తెస్తారు. ఈసారి ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు కాస్త పెరగటంతో పంట పాడవుతుందనే భయంతో ఖరీఫ్‌ తర్వాత వేసిన పంటను కూడా తొందరగా మార్కెట్లోకి తేవటంతో సరఫరా పెరిగిపోయింది. దీంతో ధర పడిపోయింది. నిల్వచేసుకునే సదుపాయాలు ఎక్కువగాలేకపోవటం రైతులకు ఇబ్బందికరంగా మారింది.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు