Hubble Telescope: ‘డార్ట్‌’ ఢీ కొట్టాక ఏం జరిగిందంటే..!

డైమార్ఫోస్‌ అనే గ్రహశకలాన్ని ‘డార్ట్‌’ వ్యోమనౌక ఢీ కొట్టినప్పుడు రోదసిలోని హబుల్‌ టెలిస్కోపు వరుసగా ఫొటోలు తీసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ప్రకటించింది.

Updated : 05 Mar 2023 08:50 IST

వీడియో అందించిన హబుల్‌ టెలిస్కోపు

వాషింగ్టన్‌: డైమార్ఫోస్‌ అనే గ్రహశకలాన్ని ‘డార్ట్‌’ వ్యోమనౌక ఢీ కొట్టినప్పుడు రోదసిలోని హబుల్‌ టెలిస్కోపు వరుసగా ఫొటోలు తీసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ప్రకటించింది. వాటిని గుదిగుచ్చి టైమ్‌ ల్యాప్స్‌ వీడియోను సిద్ధం చేసినట్లు తెలిపింది. అందులో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. ఢీ వల్ల గ్రహశకలం నుంచి అంతరిక్షంలోకి ఎగిసిన ధూళి, శకలాలు కళ్లకు కట్టాయి. ఈ క్రమంలో గంటగంటకూ జరిగిన మార్పులు స్పష్టంగా కనిపించాయి. గత ఏడాది సెప్టెంబరు 26న డైమార్ఫోస్‌ను ‘డార్ట్‌’ ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. దానివల్ల వెయ్యి టన్నుల ధూళి, రాతి శిలలు ఎగిశాయి. ఈ పరిణామం తర్వాత కొన్ని రోజుల పాటు ఈ శకలాలు సంక్లిష్ట రీతిలో ఎలా చెల్లాచెదరయ్యాయన్నదానిపై కీలక ఆధారాలను హబుల్‌ వీడియో అందించింది. డైమార్ఫోస్‌.. డిడిమోస్‌ అనే భారీ గ్రహశకలం చుట్టూ పరిభ్రమిస్తోంది. డార్ట్‌ ఢీ కొట్టడం వల్ల డైమార్ఫోస్‌ కక్ష్యలో ఏదైనా మార్పు వస్తుందా అన్నది పరిశీలించడం శాస్త్రవేత్తల ఉద్దేశం. తద్వారా భవిష్యత్‌లో భూమి దిశగా దూసుకొచ్చే ప్రమాదకర గ్రహశకలాలను దారిమళ్లించే విధానంపై అవగాహన పెంచుకోవాలని వారు తలపోశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని