Vivek Ramaswamy: అమెరికాలో విద్యాశాఖను రద్దు చేస్తా.. వివేక్‌ రామస్వామి సంచలన వ్యాఖ్యలు

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్న భారత సంతతి నేత వివేక్‌ రామస్వామి తాజాగా సంచలన ప్రకటనలు చేశారు.

Updated : 06 Mar 2023 10:16 IST

ఎఫ్‌బీఐని కూడా..

వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్న భారత సంతతి నేత వివేక్‌ రామస్వామి తాజాగా సంచలన ప్రకటనలు చేశారు. తాను అధ్యక్ష పీఠమెక్కితే- విద్యాశాఖను రద్దు చేస్తానన్నారు. అసలు ఆ శాఖ ఎందుకు ఉందో కూడా తెలియదని పేర్కొన్నారు. ప్రముఖ దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ’ని కూడా రద్దు చేసి, దాని స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటుచేస్తానన్నారు. చైనాతో అమెరికా కంపెనీలు వ్యాపారాలు చేయకుండా నిషేధిస్తాననీ స్పష్టం చేశారు. కన్జర్వేటివ్‌ రాజకీయ కార్యాచరణ సదస్సు (సీపీఏటీ)లో శనివారం ఆయన ప్రసంగించారు. దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి, ఆయన ప్రతిపాదించిన ‘అమెరికా ఫస్ట్‌’ అనే విధానం నుంచి తాను స్ఫూర్తి పొందుతున్నట్లు చెప్పారు. జాతి, లింగం, పర్యావరణం అనేవి లౌకిక మతాలుగా మారి అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని రామస్వామి వ్యాఖ్యానించారు. శరీరం రంగు ఆధారంగా వ్యక్తుల నేపథ్యాన్ని గుర్తిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

పోటీలో ఉన్నా: ట్రంప్‌

తాను వరుసగా మూడోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. తనపై నేరాభియోగాలు మోపినా.. రేసు నుంచి తప్పుకోనని సీపీఏటీ వేదికగా స్పష్టం చేశారు.

వారిద్దరూ 10 లక్షల కోట్ల డాలర్ల రుణభారం మోపారు: నిక్కీ హేలి

రిపబ్లికన్‌ పార్టీ తరఫున గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన జార్జ్‌ బుష్‌, ట్రంప్‌లపై భారత సంతతి నేత నిక్కీ హేలి విమర్శలు గుప్పించారు. వారిద్దరూ కలిసి దేశంపై 10 లక్షల కోట్ల డాలర్ల రుణభారం మోపారని ఆరోపించారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ (డెమోక్రటిక్‌ పార్టీ) వల్ల రాబోయే పదేళ్లలో మరో 20 లక్షల కోట్ల డాలర్ల భారం పడనుందని అంచనా వేశారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగేందుకు హేలి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని