Indian Students: భారతీయ విద్యార్థులకు శుభవార్త

వర్క్‌ పర్మిట్ల (ఓపీటీ) విషయంలో కొన్ని రంగాల్లో పని చేయాలనుకుంటున్న విద్యార్థులకు ప్రీమియం ప్రొసెసింగ్‌ను వర్తింపజేయనున్నట్లు అమెరికా ప్రకటించింది.

Updated : 08 Mar 2023 08:14 IST

 కొన్ని రంగాల్లో వర్క్‌ పర్మిట్లకు ప్రీమియం ప్రొసెసింగ్‌
అమెరికా నిర్ణయం

వాషింగ్టన్‌: వర్క్‌ పర్మిట్ల (ఓపీటీ) విషయంలో కొన్ని రంగాల్లో పని చేయాలనుకుంటున్న విద్యార్థులకు ప్రీమియం ప్రొసెసింగ్‌ను వర్తింపజేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. సోమవారం అగ్రదేశం ప్రకటించిన ఈ విధానం ద్వారా సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితంలలో (స్టెమ్‌) ప్రీమియం ప్రొసెసింగ్‌ను వర్తింపజేస్తారు. దీనివల్ల భారతీయ విద్యార్థులకు అత్యధిక ప్రయోజనం కలగనుంది. ఈ విధానం ఈ నెల 6వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు అమెరికా వలస సేవల విభాగం వెల్లడించింది. ‘ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అదనంగా ఈ ప్రీమియం ప్రొసెసింగ్‌ ఎఫ్‌-1 వీసాదారులకు ఎంతో మేలు చేస్తుందని వలస సేవల విభాగం డైరెక్టరు ఎం.జడ్డో పేర్కొన్నారు. ఐ-907 ఫారం ద్వారా కొత్త ఆన్‌లైన్‌ విధానంలో ప్రీమియం ప్రొసెసింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఇది భారతీయ విద్యార్థులకు గొప్ప వార్త అని కమ్యూనిటీ లీడర్‌ అజయ్‌ భూటోపియా తెలిపారు. ఓపీటీ అనుమతుల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వారికిది ఎంతో మేలు చేయనుందని వెల్లడించారు. ‘వలస సేవల విభాగం ఐ-907 ఫారాలను ఆన్‌లైన్‌లోగానీ, కాగిత రూపంలోగానీ అంగీకరిస్తుంది. ఇప్పటికే ఐ-765 ఫారాలను దాఖలు చేసినవారూ ప్రీమియం ప్రొసెసింగ్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఇందులో ఓపీటీ ముగింపు దశకు చేరుకున్నవారు, ఓపీటీ పూర్తయినవారు 24 నెలల పొడిగింపునకూ దరఖాస్తు చేయవచ్చు. ఐ-765తోపాటు ఐ-907 దరఖాస్తులను ఏప్రిల్‌ 3వ తేదీ వరకూ వలస సేవల విభాగం స్వీకరిస్తుంది. ఈ కొత్త విధానం ద్వారా ఓపీటీ అనుమతుల ప్రక్రియ క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఎఫ్‌-1 వీసాదారులకు గొప్ప ఉపశమనం కలుగుతుంది’ అని భూటోపియా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని