కర్బన ఉద్గారాలకు పాతర.. డెన్మార్క్‌లో సరికొత్త ప్రాజెక్టు
భూతాపానికి కారణమవుతున్న గ్రీన్‌హౌస్ వాయువులను అదుపులోకి తీసుకొచ్చేందుకు డెన్మార్క్ ప్రభుత్వం వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
కార్బన్ డైఆక్సైడ్‌ను సముద్రం అడుగున పాతిపెట్టేస్తారు
కోపెన్‌హేగెన్: భూతాపానికి కారణమవుతున్న గ్రీన్‌హౌస్ వాయువులను అదుపులోకి తీసుకొచ్చేందుకు డెన్మార్క్ ప్రభుత్వం వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. వాతావరణంలోకి అధిక మొత్తంలో చేరే కార్బన్ డైఆక్సైడ్‌ను సమీకరించి దానిని సముద్ర భూతలం అడుగున పాతిపెట్టే క్రతువును బుధవారం ప్రారంభించింది. తద్వారా పారిశ్రామిక యుగం ముందు నాటితో పోల్చితే భూ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న ప్రపంచ దేశాల ఉమ్మడి లక్ష్యం సాకారానికి తన వంతు తోడ్పాటునివ్వాలని నిర్ణయించింది. ‘ప్రాజెక్టు గ్రీన్‌శాండ్’గా దీనికి నామకరణం చేసింది. రసాయనాలు, చమురు-సహజవాయువును ఉత్పత్తి చేసే దిగ్గజ కంపెనీలు అంతర్జాతీయ కన్సార్షియంగా ఏర్పడి ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర వహిస్తున్నాయి. డెన్మార్క్‌లోని ‘నార్త్ సీ’ భూతలం దిగువున, నిరుపయోగంగా మారిన చమురు క్షేత్రం ‘వెస్ట్ ఆయిల్ ఫీల్డ్’లో కార్బన్‌డైఆక్సైడ్‌ను పాతిపెట్టేందుకు ఆ దేశ యువరాజు ఫ్రెడెరిక్ అనుమతించారు. కర్బన ఉద్గారాలను భూస్థాపితం చేయడం ద్వారా డెన్మార్క్‌తో పాటు ఐరోపా దేశాలు లబ్ధిపొందుతాయన్న ఆశాభావాన్ని ఫ్రెడెరిక్ వ్యక్తం చేశారు.
1.8 కి.మీ. లోతులో భూస్థాపితం ..
ద్రవ రూపంలోకి మార్చిన కార్బన్‌డైఆక్సైడ్‌ను నిరుపయోగంగా మారిన చమురు క్షేత్రాలకు చేరుస్తారు. తొలుత బెల్జియంలోని ఓ రసాయన కంపెనీ నుంచి కార్బన్‌డైఆక్సైడ్‌ను తీసుకువస్తారు. ఆ తర్వాత డెన్మార్క్, ఇతర ఐరోపా దేశాల నుంచి సేకరిస్తారు. తొలి ప్రాజెక్టులో భాగంగా ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్‌హౌస్ వాయువును సముద్ర భూతలం నుంచి 1.8 కిలోమీటర్ల లోతులో ఇసుక,రాళ్లతో నింపిన రిజర్వాయర్‌లో పాతిపెడతారు. 2030 నాటికి ఇలా పూడ్చిపెట్టే కర్బన ఉద్గారాలను ఏడాదికి 80లక్షల టన్నుల స్థాయికి తీసుకెళతారు. వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితికి చెందిన కమిటీ కూడా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి వాటిని సేకరించి పూడ్చిపెట్టే సాంకేతిక పరిజ్ఞానాలనూ పరిష్కార మార్గాల్లో భాగం చేయాలని సూచించింది. ఐరోపా సమాజంలోని 27 దేశాల నుంచే ఏడాదికి 30 కోట్ల టన్నుల మేర కార్బన్‌డైఆక్సైడ్‌ను సేకరించి భూమిలో పాతిపెట్టాల్సిన అవసరం ఉందని ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డెర్ తెలిపారు. 2050 వరకు అలా చేయగలిగితే వాతావరణంపై గ్రీన్‌హౌస్ వాయువుల దుష్ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలమని అభిప్రాయపడ్డారు.
ప్రతికూలతలపై హెచ్చరికలు
కార్బన్‌డైఆక్సైడ్‌ను భూమిలో పాతిపెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సాంకేతికత సామర్థ్యం పూర్తి స్థాయిలో ఇంకా నిరూపితంకాలేదని నిపుణులు తెలిపారు. భూకంపం వంటి విపత్తులు వచ్చినప్పుడు ఈ వాయువు తిరిగి భూ వాతావరణంలోకి వెలువడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కర్బన ఉద్గారాల కట్టడికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలన్న ప్రయత్నాలకు ఇది ఆటంకం కలిగిస్తుందని పేర్కొన్నారు. భూమి లోపలి పొరలు అన్ని ప్రాంతాల్లోనూ ఒకే మాదిరిగా ఉండవు కనుక ఈ వాయువును పాతిపెట్టే ప్రతిచోటా ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని బ్రూస్ రాబర్ట్‌సన్ అనే నిపుణుడు తెలిపారు. భూమిలో సురక్షితంగా పాతిపెట్టడం కూడా ఖరీదైన వ్యవహారమేనని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
-
Vijay antony: కుమార్తె మృతి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ పోస్ట్
-
Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు
-
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే.. ఈ రికార్డులు నమోదవుతాయా?
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
NTR: ‘ఏఐ’ మాయ.. ఎన్టీఆర్‌ని తలపించేలా.. ఫొటో వైరల్