Indonesia: శరవేగంగా ఇండోనేసియా కొత్త రాజధాని నిర్మాణం

ఇండోనేసియా రాజధాని ఏదంటే టక్కున చెప్పే సమాధానం జకార్తా. అయితే, మరికొద్ది నెలల్లో ఆ దేశ రాజధాని చిరునామా మారిపోనుంది.

Updated : 10 Mar 2023 08:35 IST

వచ్చే ఏడాది ఆగస్టుకు అధ్యక్ష భవనం సిద్ధం
అదే సమయంలో ‘నుసంతర’ పాక్షిక ప్రారంభం
2045 నాటికి కర్బన తటస్థ, హరిత నగరంగా ముస్తాబు
ఏటేటా భూమిలోకి కుంగిపోతున్న జకార్తా

పర్యావరణ మార్పులతో పెనుప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత రాజధాని జకార్తా స్థానంలో కొత్త రాజధానిని నిర్మించుకునే మహత్తరమైన క్రతువులో ఇండోనేసియా నిమగ్నమైంది. పచ్చని అటవీ ప్రాంతంలో రమణీయమైన, అత్యాధునికమైన నయా రాజధానిని ఆ దేశం తీర్చిదిద్దుతోంది. జాతీయ అధికారిక చిహ్నం గరుడను స్ఫురించేలా అధ్యక్ష భవనాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు ప్రారంభానికల్లా ఈ సువిశాలమైన భవనం పూర్తిస్థాయిలో ఆకృతిదాల్చనుంది. ప్రస్తుతం దీనితో పాటు వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం చురుగ్గా కొనసాగుతోంది. ఇండోనేసియా కొత్త రాజధాని నుసంతరపై ‘ఈటీవీ భారత్‌’ ప్రత్యేక కథనం..

ఇండోనేసియా రాజధాని ఏదంటే టక్కున చెప్పే సమాధానం జకార్తా. అయితే, మరికొద్ది నెలల్లో ఆ దేశ రాజధాని చిరునామా మారిపోనుంది. జకార్తాకు రెండు వేల కిలోమీటర్ల దూరంలో పచ్చని అటవీ ప్రాంతంలో ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ‘నుసంతర’కు తరలిపోనుంది. సుందర బోర్నియో ద్వీపంలోని విశాల అటవీ ప్రాంతంలో నూతన రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు? ప్రభుత్వ ప్రణాళికలు ఏంటి?  కొత్త నగరం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఇండోనేసియా అనేక దీవుల సమాహారం. ఎక్కువ భాగం అటవీ ప్రాంతం కావడం వల్ల నేలపై జనాభా ఒత్తిడి ఉంటుంది. జావా ద్వీపంలోని రాజధాని జకార్తా ఇప్పటికే కోటి మందికి పైగా జనాభాతో కిక్కిరిసింది. గ్రేటర్‌ మెట్రో పాలిటన్‌ ప్రాంతంలోని జనాభా ఇంతకు మూడు రెట్లు అధికంగా ఉంటుంది. మరో పక్క జావా సముద్ర తీరంలోని ఆ నగరం ఏటేటా కొన్ని సెంటీమీటర్ల మేర భూమిలోకి కుంగిపోతోంది. వివిధ నివేదికల ప్రకారం 2050 నాటికి జకార్తాలోని మూడింట ఒక వంతు సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉంది. విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడేయటం, వాతావరణ మార్పులు వంటివి ఇందుకు కారణాలు. భూకంప ముప్పూ పొంచి ఉంది. ఇతరత్రా అనేక సమస్యలు చుట్టుముట్టిన జకార్తా నుంచి రాజధానిని మార్చాలని ఇండోనేసియా ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే నిర్ణయించింది.

కొత్త రాజధాని ఎలా ఉంటుంది?

బోర్నియో ద్వీపంలోని తూర్పున గల కాలిమాంటన్‌ అటవీ ప్రాంతంలో నుసంతర పేరిట కొత్త నగర నిర్మాణాన్ని ఇండోనేసియా ప్రభుత్వం గత ఏడాది ప్రారంభించింది. నుసంతర అంటే ద్వీప సమూహం అని అర్థం. ప్రస్తుత రాజధాని జకార్తాకు 2 వేల కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ప్రణాళిక ప్రకారం.. నుసంతరలో ప్రభుత్వ భవనాలు, ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ప్రతి నిర్మాణ స్థలం వద్ద అది ఎప్పటికి పూర్తవుతుంది, పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందీ వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. త్రీడీ విజువల్స్‌లో చూసేందుకు క్యూఆర్‌ కోడ్‌ సంకేతాలను అందుబాటులో ఉంచారు. కొత్త నగరానికి ఫారెస్ట్‌ సిటీ కాన్సెప్ట్‌ వర్తింపజేస్తున్నామని ‘నుసంతర జాతీయ రాజధాని ప్రాధికార సంస్థ’ అధికారి బాంబాంగ్‌ తెలిపారు. నగరమంతా పచ్చని వృక్షాలతో ఆహ్లాదకరంగా ఉంటుందని, భవనాల చుట్టూ, పైన, రహదారుల వెంట  మొక్కలు, చెట్లు పెంచుతామని, ఉద్యానవనాలు, అత్యాధునిక నీటి వ్యవస్థలు, సౌరవిద్యుత్‌ తదితర కాలుష్యరహిత విధానాలకు అత్యంత ప్రాధాన్యముంటుందని వివరించారు. కర్బన తటస్థతను సాధించేలా వ్యర్థాల నిర్వహణకు ‘స్మార్ట్‌’ వ్యవస్థలు ఉంటాయన్నారు. ప్రస్తుతం ఏడువేల మంది కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇండోనేసియా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ఆగస్టు 17న ఈ నగరాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అప్పటికి గరుడ ఆకృతిలో నిర్మిస్తున్న అధ్యక్ష భవనం సిద్ధమవుతుంది. కొత్త రాజధాని నిర్మాణ పనులన్నీ 2045 నాటి పూర్తవుతాయని వెల్లడించారు. అదే సంవత్సరం ఇండోనేసియా 100వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొంటుంది.


పర్యావరణవేత్తల ఆందోళన

కొత్త రాజధాని నిర్మాణంపై పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు కొందరు ఆందోళన చెందుతున్నారు. జాతీయ పట్టణ ప్రణాళిక, అభివృద్ధి సంస్థ గణాంకాల ప్రకారం రాజధాని ప్రాజెక్ట్‌ కోసం 2,56,142 హెక్టార్ల అటవీ భూమిని సేకరిస్తున్నారు. దీంతో ఆ అటవీ ప్రాంతంలో ఒరాంగుటాన్‌, సన్‌బేర్స్‌ వంటి అరుదైన వన్య ప్రాణుల మనుగడకు ఇబ్బందులు కలుగుతాయని అంటున్నారు. గిరిజన జాతులు తమ స్వస్థలాలను వీడేందుకు నిరాకరిస్తున్నాయి. ఇప్పటికే కొత్త రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నందున ఐదు గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాల ప్రజలను తరలించనున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని