చైనా కలిపిన ఉప్పు-నిప్పు
అలుగుటయే ఎరగని అజాతశత్రువు అలిగితే ఎంత ఆశ్చర్యమో... కలలోనూ కలవటం అసాధ్యమనుకునే ఆగర్భ శత్రువుల్లాంటివారు మాట్లాడుకుంటే అంతకంటే ఆశ్చర్యం! అలాంటి సంభ్రమాశ్చర్య సంఘటనే శుక్రవారం బీజింగ్‌లో సంభవించింది.
ఇరాన్, సౌదీ మధ్య దౌత్య ఒప్పందం
మధ్య ఆసియా రాజకీయాల్లో భారీ మార్పు
అమెరికా ఆధిపత్యానికి దెబ్బా?
అలుగుటయే ఎరగని అజాతశత్రువు అలిగితే ఎంత ఆశ్చర్యమో... కలలోనూ కలవటం అసాధ్యమనుకునే ఆగర్భ శత్రువుల్లాంటివారు మాట్లాడుకుంటే అంతకంటే ఆశ్చర్యం! అలాంటి సంభ్రమాశ్చర్య సంఘటనే శుక్రవారం బీజింగ్‌లో సంభవించింది. అదే... ఇరాన్-సౌదీ అరేబియా మధ్య ఒప్పందం! ప్రపంచ ఇస్లామిక్ రాజకీయాల్లో ఉప్పునిప్పులా చిటపటలాడే ఈ రెండు దేశాల మధ్య సయోధ్య ఎలా కుదిరింది? చైనా ఎందుకు మధ్యవర్తిగా వ్యవహరించింది? ప్రపంచ భౌగోళిక రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది?
మూడోసారి అధ్యక్షుడిగా షి జిన్‌పింగ్ అభ్యర్థిత్వానికి చైనా పార్లమెంటు ఆమోదముద్ర వేసిందనే వార్తలకంటే శుక్రవారం బీజింగ్ నుంచి వచ్చిన ఓ వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అదే సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దౌత్య సయోధ్య కుదరటం. చైనా మధ్యవర్తిత్వంలో ఈ రెండు దేశాలూ స్నేహరాగం ఆలపించటం విశేషం. ఈ ఒప్పందం ప్రకారం... సౌదీ, ఇరాన్‌లు రక్షణ ఒప్పందంతో పాటు బంద్ చేసిన దౌత్య కార్యాలయాలను పరస్పరం పునరుద్ధరించుకుంటాయి. సాంస్కృతిక, వాణిజ్య బంధాలకూ ద్వారాలు తెరుస్తాయి.
ఎందుకు శత్రుత్వం?
రెండూ ఇస్లామిక్ దేశాలే అయినా సౌదీ, ఇరాన్‌ల మధ్య బంధం ఉప్పునిప్పులా చిటపటలాడుతూనే ఉంది. కారణం ఇరాన్ షియా ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా... సౌదీ సున్నీలకు! అలా రెండు దేశాల మధ్య వర్గ విభేదాలు కొనసాగుతూ మధ్య ఆసియాలో రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఫలితంగా ఇరాక్, లెబనాన్, సిరియా, యెమెన్‌లలో తలెత్తిన యుద్ధాలు, ఘర్షణల్లో ఇరాన్, సౌదీలు పరోక్షంగా శత్రువులుగా మారాయి.
మరి ఇప్పుడీ ఒప్పందం ఎలా?
పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇరాన్, సౌదీల మధ్య ఇప్పుడు ఉన్నట్లుండి ఎలా ఒప్పందం కుదిరిందన్నది చూస్తే... సౌదీలో మహమ్మద్ బిన్ సల్మాన్ పగ్గాలు చేపట్టిన తర్వాత అంతర్గత రాజకీయాలతోపాటు దౌత్యనీతిలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పటిదాకా చమురుపై అధికంగా ఆధారపడ్డ తమ దేశాన్ని... మునుముందు అన్నిరంగాల్లోనూ ప్రపంచ ఆర్థిక పెట్టుబడుల కేంద్రంగా మార్చాలని రాజు భావిస్తున్నారు. ఇందుకోసం విజన్-2030 పేరిట ఓ ప్రణాళిక రూపొందించారు. దీర్ఘకాలిక ఘర్షణలు, శత్రుత్వాలపట్ల కాసింత మెతకవైఖరి అవలంబించటం అందులో భాగంగా చెబుతున్నారు. అదే ఇరాన్‌తో దౌత్య ఒప్పందానికి దారి తీసింది. మరోవైపు ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అమెరికా భారీ ఆంక్షలు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైగా స్వదేశంలో ఉద్యమాలూ సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ లక్ష్యాలను సాధించటానికి మధ్య ఆసియాలో విభేదాలకంటే స్నేహాలను పెంచుకోవాలని ఇరాన్ చూస్తోంది. తాజా ఒప్పందానికి ఆ ధోరణి బాటలు వేసింది.
ఘర్షణ తొలగినట్లేనా?
ఇరాన్, సౌదీ దౌత్య ఒప్పందం కుదిరినా షియా, సున్నీల మధ్య ఘర్షణవాతావరణంలో అది పెద్దగా మార్పు తెచ్చే అవకాశాలు తక్కువని నిపుణులు భావిస్తున్నారు. పైగా... యెమెన్, సిరియాల్లో ఈ రెండు దేశాలూ పరస్పర వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్నాయి. వీటికి తోడు... మధ్య ఆసియాలో అనేక సాయుధబలగాలకు ఇరాన్ సాయం చేస్తోంది. ఇది ఈ ప్రాంతంలో రాజకీయంగా ఇబ్బందులు సృష్టించటంతోపాటు, తమ సార్వభౌమత్వానికి ప్రమాదంగా సౌదీ భావిస్తోంది. అంతేగాకుండా అమెరికాకు సౌదీ అరేబియా సన్నిహిత దేశం. సౌదీలో అమెరికా సైనిక శిబిరాలున్నాయి. మరోవైపు ఇరాన్‌కు అమెరికాకు అస్సలు పడదు. ఆ దేశంపై అమెరికా బలమైన ఆంక్షలు విధించింది. ఈ అడ్డంకుల నేపథ్యంలో ఒప్పందం ఎంతమేరకు మనస్ఫూర్తిగా అనుబంధంగా మారుతుందన్నది సందేహమేనని నిపుణుల అంచనా!
అమెరికాను కాదని చైనా...
ఈ ఒప్పందం రెండు దేశాలకే పరిమితం కాదని.. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో మార్పులకు సంకేతమనే వాదనా వినిపిస్తోంది. పెద్దన్న పాత్ర పోషించటానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా దీని ద్వారా సంకేతాలు పంపుతోందని భావిస్తున్నారు. ఒకరకంగా ఈ ఒప్పందం అమెరికాకు ఇబ్బందికర పరిణామం. మధ్య ఆసియా రాజకీయాల్లో అమెరికా కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో తమ భాగస్వామ్య దేశం (సౌదీ) శత్రుదేశమైన ఇరాన్‌తో.. అదీ చైనా మధ్యవర్తిగా ఒప్పందం కుదుర్చుకోవటం అమెరికాకు కొరుకుడుపడని వ్యవహారం. మునుముందు మధ్య ఆసియాలో అమెరికా పాత్రను పరిమితం చేయటానికే కాకుండా... ఉక్రెయిన్-రష్యా యుద్ధంలోనూ శాంతిదూతగా వ్యవహరించేందుకు సిద్ధమని చైనా సంకేతాలు పంపిస్తోందన్నది విశ్లేషకుల భావన.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో
-
World News
Pakistan: బడ్జెట్ ప్రవేశపెట్టిన పాక్.. సగం అప్పులకే కేటాయింపు!
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/06/23)