బతుకంతా అంబారీ మోత.. బక్కచిక్కితే చూడరే కలత!

ఏనుగు అంబారీ అంటే అందరికీ సరదాయే. కానీ, నిత్యం బరువుల్ని మోసే ఆ మూగజీవి వేదన పట్టించుకోం. థాయ్‌లాండ్‌కు చెందిన ఆడ ఏనుగు ‘పైలిన్‌’ కథ ఆ కష్టం ఏమిటో మనకు చెబుతుంది.

Published : 12 Mar 2023 05:03 IST

బ్యాంకాక్‌: ఏనుగు అంబారీ అంటే అందరికీ సరదాయే. కానీ, నిత్యం బరువుల్ని మోసే ఆ మూగజీవి వేదన పట్టించుకోం. థాయ్‌లాండ్‌కు చెందిన ఆడ ఏనుగు ‘పైలిన్‌’ కథ ఆ కష్టం ఏమిటో మనకు చెబుతుంది. 71 ఏళ్ల వయసున్న ఈ ఏనుగు పాతికేళ్లు పర్యాటకశాఖలో పనిచేసింది. ట్రెక్కింగ్‌ విభాగంలో ఏళ్లతరబడి పర్యాటకులను మోసి ఇలా చిక్కిపోయింది. ఈ ఏనుగుపై ఒక్కోసారి ఆరుగురు టూరిస్టులను ఎక్కించి తిప్పేవారట. వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేసే ‘వైల్డ్‌లైఫ్‌ ఫ్రెండ్స్‌ ఫౌండేషన్‌ ఇన్‌ థాయ్‌లాండ్‌’ సంస్థ ఇలాంటి ఎన్నో మూగజీవాలను కాపాడి తమ సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చింది. అందులో పైలిన్‌ కూడా ఒకటి. చిక్కి శల్యమైన ఈ ఏనుగు ఫొటోను ఆ సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేస్తూ ఏనుగుల దుస్థితిని వివరించింది. ‘‘భారీకాయంతో కనిపించే ఏనుగులు ఎంత బరువైనా మోస్తాయనుకుంటే పొరపాటే. వాటి వెన్నెముక అధిక బరువులను మోసేందుకు అనువుగా ఉండదు. నిరంతరం పర్యాటకులకు ఎక్కించడం వల్ల ఏనుగుల శరీరానికి శాశ్వత నష్టం వాటిల్లుతుంది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం పైలిన్‌ తమ కేంద్రంలో స్వేచ్ఛగా విహరిస్తోందని వెల్లడించింది. ఏనుగు ఫొటో నెట్టింట వైరల్‌గా మారడంతో బక్కచిక్కిన పైలిన్‌ను చూసి ఎంతోమంది హృదయాలు ద్రవిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని